విపక్ష నేతలతో భేటీ కానున్న మమత

ప్రధానాంశాలు

విపక్ష నేతలతో భేటీ కానున్న మమత

ఈనాడు, దిల్లీ: భాజపా వ్యతిరేక పార్టీలన్నింటినీ కూడగట్టే ఆలోచనలో ఉన్న పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఈ నెల 28న దిల్లీలో పలువురు నేతలతో మంతనాలు జరపనున్నారు. ఆరోజు ప్రధాని నరేంద్రమోదీతో భేటీ తర్వాత ఈ సమావేశం జరగనుంది. విపక్ష పార్టీల అగ్రనేతల్ని సమన్వయపరిచి సమావేశానికి ఏర్పాట్లు చేయాల్సిందిగా నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ (ఎన్సీపీ) అధ్యక్షుడు శరద్‌ పవార్‌, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత పి.చిదంబరంలను మమత కోరారు. తృణమూల్‌ కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి అభిషేక్‌ బెనర్జీ, రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌లు ఈ నెల 22నే ఇదే పనిపై దిల్లీకి చేరుకున్నారు. ఆన్‌లైన్‌ విధానంలో ఇప్పటికే నిర్వహించిన ఒక సమావేశంలో మమతతో పలువురు నేతలు సమాలోచనలు జరిపారు. దీనికి కొనసాగింపుగా 28న సమావేశం జరగనుంది. ఈ ఏడాది చివర్లో కోల్‌కతాలో తృణమూల్‌ నిర్వహించబోయే బహిరంగ సభలో పాల్గొనాల్సిందిగా కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీ సహా విపక్ష నేతలను మమత ఆహ్వానించనున్నారని తృణమూల్‌ నేత ఒకరు తెలిపారు.

నేషనల్‌ ఫ్రంట్‌ ఏర్పడాలి: బాదల్‌

దిల్లీ: 2024 సార్వత్రిక ఎన్నికల్లో భాజపాను ఎదుర్కొనేందుకు దేశంలోని ప్రాంతీయ పార్టీలన్నీ ఏకతాటిపైకి రావాలని శిరోమణి అకాలీదళ్‌ (ఎస్‌ఏడీ) అధ్యక్షుడు సుఖ్‌బీర్‌ సింగ్‌ బాదల్‌ పిలుపునిచ్చారు. ఆ దిశగా వివిధ పార్టీలతో సంప్రదింపులు జరుపుతున్నామని, కమలనాథులతో తమ పార్టీ ప్రస్థానం కథ కంచికి చేరినట్లేనని చెప్పారు. రాబోయే ఎన్నికలకు ముందే నేషనల్‌ ఫ్రంట్‌ ఆవిర్భవిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని