ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు కుట్ర: వైకాపా

ప్రధానాంశాలు

ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు కుట్ర: వైకాపా

కరకట్ట దాడి ఘటనపై డీజీపీ కార్యాలయంలో ఫిర్యాదు

ఈనాడు, అమరావతి: రాష్ట్రంలో శాంతియుత వాతావరణానికి భంగం కలిగిస్తున్న తెదేపా నేతలను కట్టడి చేయాలని కోరుతూ ఉండవల్లిలోని చంద్రబాబు నివాసం ఎదుట ప్రజాస్వామ్యయుతంగా నిరసన తెలపడానికి వెళ్లిన ఎమ్మెల్యే జోగి రమేష్‌పై తెలుగుదేశం కార్యకర్తలు దాడి చేశారని వైకాపా నేతలు ఆరోపించారు. ఘటనను... ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు ఒక పథకం ప్రకారం జరిగిన కుట్రగా డీజీపీ కార్యాలయంలో శుక్రవారం సాయంత్రం చేసిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ‘‘ఇటీవల గుంటూరులో తెదేపా నేత నారా లోకేష్‌, సత్తెనపల్లిలో చింతకాయల అయ్యన్నపాత్రుడు సీఎం జగన్‌ను అసభ్యంగా మాట్లాడారు. వైకాపాని, దాని నేతలను రెచ్చగొట్టేలా తెదేపా నేతలు ఆరు నెలలుగా అసభ్య పదజాలంతో దూషిస్తున్నారు. దీనికి ప్రధాన కారకుడైన చంద్రబాబును, ఎమ్మెల్యే రమేష్‌పై దాడికి పాల్పడిన వారిని  తక్షణం అరెస్టు చేయాలి’’ అని పిర్యాదులో పేర్కొన్నారు. అలాగే చింతకాయల అయ్యన్నపాత్రుడుపై చర్యలు తీసుకోవాలని మరో వినతిపత్రాన్ని డీజీపీ కార్యాలయంలో ఎస్పీ (పరిపాలన) అమ్మిరెడ్డికి అందించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, ఎమ్మెల్యేలు జోగి రమేష్‌, మహ్మద్‌ ముస్తఫా, ఆళ్ల రామకృష్ణారెడ్డి, మద్దాళి గిరి, మేరుగ నాగార్జున, ఎంపీ నందిగం సురేష్‌, నవరత్నాల వైస్‌ ఛైర్మన్‌ నారాయణమూర్తి పాల్గొన్నారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ ‘‘సీఎం జగన్‌ను విమర్శిస్తూ అయ్యన్నపాత్రుడు  అభ్యంతరకరంగా మాట్లాడారు. అలాంటి వ్యక్తిని చంద్రబాబు ప్రోత్సహిస్తారా? చంద్రబాబు ఇంట్లోనే కూర్చుని మాపై దాడి చేయించారు. హైదరాబాద్‌లో ఉంటూ రాష్ట్రాన్ని ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు’’ అని ఆరోపించారు.

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని