రాష్ట్రం పరువు తీస్తున్న వారిని అరెస్టు చేయాలి

ప్రధానాంశాలు

రాష్ట్రం పరువు తీస్తున్న వారిని అరెస్టు చేయాలి

 వైకాపా ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి

ఈనాడు, అమరావతి: రాష్ట్ర సరిహద్దులకు కూడా డ్రగ్స్‌ రాకపోయినా, మాఫియా అంటూ నిరాధార ఆరోపణలతో రాష్ట్రం పరువు తీస్తున్నవారిని పోలీసులు అరెస్టు చేయాలని వైకాపా ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి డిమాండ్‌ చేశారు. ‘ఫెర్టిలైజర్‌లో రూ.వందల కోట్లు దోచేసిన జీవీ ఆంజనేయులు, కాల్‌మనీలో కీలక సూత్రధారి బుద్దా వెంకన్న, విజయవాడలో అనేక స్థలాలను ఆక్రమించిన బోండా ఉమామహేశ్వరరావు, సంగం డెయిరీని మింగేసిన ధూళిపాళ్ల నరేంద్రలాంటి తెదేపా నాయకులు రాష్ట్రంలోకి డ్రగ్స్‌ వచ్చేశాయంటూ దిగజారుడు విమర్శలు చేస్తూ ప్రజలను తప్పుదారి పట్టించేందుకు ప్రయత్నిస్తున్నారు’ అని విమర్శించారు. శనివారం ఆయన ఇక్కడ విలేకరులతో మాట్లాడారు. ‘మాచవరం సుధాకర్‌ విజయవాడలో తప్పుడు చిరునామా మాత్రమే ఇచ్చారని, అతడు చెన్నైలో ఉంటున్నాడని డీఆర్‌ఐ (డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌) స్పష్టం చేసినా.. తెదేపా నేతలు మాత్రం సుధాకర్‌ వైకాపా వ్యక్తి అని, ముఖ్యమంత్రి అనుచరుడంటూ దిగజారుడు మాటలు మాట్లాడుతున్నారు. తెదేపా హయాంలో వైకాపా ఎమ్మెల్యేపై దాడి చేసి ఎంపీటీసీ సభ్యులను కిడ్నాప్‌ చేసి మండలాధ్యక్ష పదవిని దక్కించుకున్నారు. ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా ఆ పద్ధతిలో ఒక్క ఎంపీపీనైనా వైకాపా దక్కించుకుందని చూపించగలరా?’ అని ప్రశ్నించారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని