చంద్రబాబును చీపుర్లతో కొట్టాలనడం నీతి కబురా?

ప్రధానాంశాలు

చంద్రబాబును చీపుర్లతో కొట్టాలనడం నీతి కబురా?

ఆయన్ను నడిరోడ్డుపై కాల్చాలనలేదా?: అచ్చెన్నాయుడు

ఈనాడు డిజిటల్‌, అమరావతి: తానెప్పుడూ పవిత్రమైన మాటలే మాట్లాడానని, తన నోటి నుంచి ఒక్క బూతుపదం కూడా రాలేదని ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి నీతికబుర్లు చెబుతున్నారని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మండిపడ్డారు. ‘ప్రతిపక్షనేతగా జగన్‌... నాటి సీఎం చంద్రబాబును రోడ్డుమీద కాల్చాలని చెప్పలేదా? చీపుర్లతో కొట్టాలనలేదా? అంతకంటే పట్టాభి మాట్లాడిన మాట ఎక్కువైందా? జగన్‌రెడ్డికి సవాలు విసురుతున్నా. తెదేపా ప్రభుత్వ హయాంలో మేం మాట్లాడిన మాటలు.. గత రెండున్నరేళ్లగా వైకాపా మంత్రులు, ఎమ్మెల్యేలు మాట్లాడుతున్న మాటల్ని ప్రజల ముందు ఉంచుదామా? దీనికి సిద్ధమా?’ అని ప్రశ్నించారు. చంద్రబాబు దీక్షలో భాగంగా ఆయన గురువారం మాట్లాడారు.  

అందరి చిట్టాలూ రాస్తున్నాం... ఎవర్నీ వదలం

‘డీజీపీ చేసిన పనులకు.. ప్రాణత్యాగాలు చేసిన పోలీసుల ఆత్మ ఘోషిస్తోంది. పార్టీ ప్రధాన కార్యాలయం మీద వైకాపా గూండాలు, పోలీసులు కలిసొచ్చి దాడిచేసి, తిరిగి గూండాలను పోలీసులు కారెక్కించి పంపారు. పైగా సంఘటన జరిగిన సమయానికి లేని లోకేశ్‌పై హత్యాయత్నం, ఎస్సీ, ఎస్టీ కేసు పెట్టారు. పట్టాభి ఇంటిపై దాడిచేసి 48 గంటలు గడుస్తున్నా ఒక్కరినీ అదుపులోకి తీసుకోలేకపోగా, ఆయన్నే అరెస్టు చేశారు. అందరి చిట్టాలూ రాస్తున్నాం. ఏ ఒక్కరినీ వదిలిపెట్టం. 2024లో తెదేపా అధికారం చేపట్టే నాటికి పదవీవిరమణ చేసి ఇంటికి వెళ్లిపోతామని కొందరు అనుకుంటున్నారు. దేశంలో ఎక్కడ దాక్కున్నా తగిన మూల్యం చెల్లించాలి’ అన్నారు.

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని