Latest Telugu News | Breaking News Telugu | Telugu News Today | News in Telugu

ఈనాడు ప్రత్యేకం

Facebook Share Twitter Share Comments Telegram Share
దేవుడి పేరిటే మాన్యం

ఇతరుల పేరిట రిజిస్టరయిన ఆలయ భూములను గుర్తిస్తున్నాం

ఇప్పటికే 3 వేల ఎకరాల స్వాధీనం

జోగులాంబ ఆలయానికి కేంద్రం నుంచి రూ.37 కోట్లు

‘ఈనాడు’తో మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి

‘ఇతరుల పేరిట ఉన్న దేవాలయ భూములను గుర్తిస్తున్నాం. వాటిని స్వాధీనం చేసుకునేందుకు ప్రత్యేక డ్రైవ్‌ చేపట్టాం. స్వాధీనానంతరం మాన్యాన్ని ఆయా దేవుళ్ల పేరిట రిజిస్ట్రేషన్‌ చేసేందుకు ఏర్పాట్లుచేస్తున్నాం’ అని  దేవాదాయ, అటవీ, న్యాయ శాఖల మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి తెలిపారు. మాన్యం భూములను దేవుడి పేరిట రిజిస్ట్రేషన్‌ చేయాలంటూ ఇటీవల సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో దాని అమలుకు అనుసరిస్తున్న కార్యాచరణ, రాష్ట్రవ్యాప్తంగా వివిధ ఆలయాల్లో కొనసాగుతున్న అభివృద్ధి పనులు తదితరాలపై మంత్రి ‘ఈనాడు’తో మాట్లాడారు.

భూముల గుర్తింపునకు ప్రత్యేక డ్రైవ్‌

‘‘మాన్యం భూములు కొన్ని ప్రాంతాల్లో పూజారుల పేరిట ఉన్నాయి. కొన్నిచోట్ల క్రయవిక్రయాలు జరిగాయి. వాటిని గుర్తించే ప్రక్రియలో భాగంగా అధికారులకు మార్గదర్శకాలు జారీచేశాం. వారికి లక్ష్యాలు నిర్దేశించాం. ఇప్పటికే సుమారు మూడు వేల ఎకరాలు స్వాధీనం చేసుకున్నాం. ఈ వ్యవహారం కొలిక్కిరాగానే ఆయా ఆస్తులను దేవుడి పేరిట రిజిస్ట్రేషన్‌ చేస్తాం.

వివిధ ఆలయాల్లో వేగంగా అభివృద్ధి పనులు

ప్రసాదం పథకం కింద జోగులాంబ, భద్రాచలం, బాసర ఆలయాలకు నిధులు మంజూరు చేయాల్సిందిగా కేందాన్ని కోరాం. జోగులాంబ ఆలయానికి మాత్రం రూ.37 కోట్లు మంజూరయ్యాయి. వేములవాడ, భద్రాచలం, బాసర ఆలయాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్‌లో నిధులు కేటాయించింది. వేములవాడ ఆలయంలో అభివృద్ధి పనులు సాగుతున్నాయి. విస్తరణలో భాగంగా ఆలయం పక్కనే 35 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న చెరువును స్వాధీనం చేసుకుని, ప్రత్యామ్నాయంగా అంతే విస్తీర్ణాన్ని సేకరించి చెరువు నిర్మాణం చేపడుతున్నాం. ఈ చెరువులో కొంత భాగాన్ని గోదావరి నీటితో నింపి ఆలయ అవసరాలకు వినియోగిస్తాం. కొంత స్థలాన్ని పార్కింగ్‌ కోసం వినియోగిస్తాం. భద్రాచలం ఆలయ అభివృద్ధి పనులకు సంబంధించిన కార్యాచరణ సిద్ధమైంది. వరద వచ్చినప్పుడు గోదావరి పొంగి ఆలయ ప్రధాన మెట్లు మునిగిపోతున్నాయి. వరదనీరు రాకుండా రక్షణ గోడ(రీటైనింగ్‌ వాల్‌) నిర్మించడంతోపాటు ఉత్సవమూర్తుల ఊరేగింపునకు వీలుగా పురవీధులను విస్తరించాలని నిర్ణయించాం.

‘పోడు’పై త్వరలో నిర్ణయం

హరితహారంతో రాష్ట్రంలో పచ్చదనం గణనీయంగా పెరిగింది. రాష్ట్ర విస్తీర్ణంలో 33 శాతం మేరకు అడవులు ఉండాలి. హరితహారానికి ముందు 24 శాతమే ఉన్నాయి. ఈ పథకం అమలు తర్వాత 3.71 శాతం పెరిగాయి. మొత్తంగా పచ్చదనం 27.71 శాతానికి చేరువైంది. సుమారు ఆరు నుంచి ఏడు లక్షల ఎకరాల్లో పోడు సాగు జరుగుతున్నట్టు ఇప్పటివరకూ గుర్తించాం. గుర్తింపు ప్రక్రియ పూర్తికాగానే ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకుంటారు.

గుడుల అభివృద్ధికి దాతలు ముందుకొస్తున్నారు

ఆలయాల అభివృద్ధిలో భాగస్వాములయ్యేందుకు ఎక్కువ మంది చొరవ చూపుతున్నారు. హైదరాబాద్‌లోని  కర్మన్‌ఘాట్‌ ఆంజనేయస్వామి ఆలయ అభివృద్ధికి ఓ భక్తుడు రూ.15 కోట్లు ఖర్చుచేసేందుకు ముందుకొచ్చారు. కీసర, బల్కంపేట అమ్మవారి ఆలయంతోపాటు, పలు ఆలయాలకు నిధులు ఇచ్చేందుకు పలువురు ఆసక్తి చూపుతున్నారు’ అని ఇంద్రకరణ్‌రెడ్డి వివరించారు.

- ఈనాడు, హైదరాబాద్‌


మరిన్ని

+

© 1999- 2022 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.