
తెలంగాణ
ఆదిలాబాద్, మెదక్, నల్గొండ, ఖమ్మంతో పాటు కరీంనగర్లో రెండింటికి
స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆరు ఏకగ్రీవం
ఈనాడు, హైదరాబాద్: రాష్ట్రంలో శాసనమండలికి స్థానిక సంస్థల కోటాలో జరుగుతున్న 12 స్థానాల ఎన్నికల్లో ఆరుగురు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మరో ఆరు స్థానాల్లో ఎన్నికలు జరగనున్నాయి. శుక్రవారం నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసింది. ఈ సందర్భంగా ఎన్నికల సంఘం రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి డాక్టర్ శశాంక్ గోయల్ విలేకరులతో మాట్లాడారు. ‘తొమ్మిది ఉమ్మడి జిల్లాల పరిధిలో 12 స్థానాలకు ఎన్నికల ప్రక్రియ చేపట్టాం. రంగారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాల్లో రెండేసి స్థానాలు, వరంగల్, నిజామాబాద్ జిల్లాల్లో ఒక్కో స్థానానికి సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
కరీంనగర్లో రెండు, ఆదిలాబాద్, ఖమ్మం, నల్గొండ, మెదక్ జిల్లాల్లో ఒక్కో స్థానానికి వచ్చే నెల పదో తేదీన పోలింగ్ జరుగుతుంది. ఈ ఆరు స్థానాలకు 26 మంది అభ్యర్థులు పోటీలో నిలిచారు. ఉదయం ఎనిమిది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు పోలింగ్ ఉంటుంది. మొత్తం 5,326 మంది ఓటర్లుండగా వారి కోసం 37 పోలింగు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నాం. ఓట్ల లెక్కింపు 14న చేపడతాం. బ్యాలెట్ పత్రం ద్వారా పోలింగ్ జరుగుతుంది. ఓటర్లు ప్రాధాన్య క్రమంలో పోటీలో ఉన్న అభ్యర్థులకు ఓటు వేయాలి. ఏకగ్రీవమైన స్థానాలకు సంబంధించిన జిల్లాల్లో ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఎత్తివేశాం. హోటళ్లు, రిసార్టుల్లో ఓటర్లతో క్యాంపులు నిర్వహించటం నిబంధనలకు విరుద్ధం. ఈసీ రూపొందించిన కరోనా నిబంధనల మేరకు ఎన్నికల ప్రక్రియను నిర్వహిస్తాం’ అని డాక్టర్ శశాంక్ గోయల్ తెలిపారు. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసిన అనంతరం నిజామాబాద్‌లో కల్వకుంట్ల కవిత, వరంగల్‌లో పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, రంగారెడ్డిలో శంభీపూర్‌రాజు, పట్నం మహేందర్‌రెడ్డి, మహబూబ్‌నగర్‌లో కూచికుళ్ల దామోదర్‌రెడ్డి, కసిరెడ్డి నారాయణరెడ్డిలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కేంద్ర ఎన్నికల సంఘం వారి ఫలితాలను ప్రకటించడంతో ఆయా జిల్లాల్లోని ఎన్నికల రిటర్నింగ్ అధికారులు విజేతలకు ధ్రువీకరణ పత్రాలను అందజేశారు.
ఇక్కడ పోటీ అనివార్యం..
రెండు స్థానాలున్న కరీంనగర్లో 14 మంది నామినేషన్లను ఉపసంహరించుకోగా మరో 10 మంది బరిలో మిగిలారు. తెరాస అభ్యర్థులు భానుప్రసాద్‌రావు, ఎల్.రమణతో పాటు పార్టీకి రాజీనామా చేసిన రవీందర్ సింగ్, మరో ఏడుగురు పోటీలో ఉన్నారు. ఖమ్మంలో ఒక స్థానానికి తెరాస, కాంగ్రెస్ అభ్యర్థులు తాతా మధు, రాయల నాగేశ్వరరావులతో పాటు స్వతంత్ర అభ్యర్థులు శ్రీనివాసరావు, సుధారాణి పోటీలో ఉన్నారు. మెదక్ జిల్లాలో తెరాస అభ్యర్థి యాదవరెడ్డి, కాంగ్రెస్ నుంచి నిర్మల, స్వతంత్ర అభ్యర్థి మల్లారెడ్డి పోటీలో నిలిచారు. నల్గొండలో తెరాస అభ్యర్థి ఎంసీ కోటిరెడ్డితో పాటు మరో ఆరుగురు స్వతంత్రులు బరిలో ఉన్నారు.
ఆదిలాబాద్‌లో ఉద్రిక్తత
ఆదిలాబాద్‌లో నామినేషన్ల ఉపసంహరణ నాటకీయ పరిణామాల మధ్య తీవ్ర ఉత్కంఠకు, ఉద్రిక్తతకు దారి తీసింది. 22 మంది అభ్యర్థులు ఉపసంహరించుకోవడంతో తెరాస నుంచి దండె విఠల్, స్వతంత్ర అభ్యర్థిగా పెందూరు పుష్పరాణి పోటీలో ఉన్నారు. అంతకుముందు తుడుందెబ్బ ఆధ్వర్యంలో స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచిన పెందూర్ పుష్పరాణి తరఫున సాయంత్రం 3 గంటలకు ఓ వ్యక్తి వచ్చి నామినేషన్ ఉపసంహరించుకుంటున్నట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి సిక్తాపట్నాయక్‌కు తెలిపారు. కాగా పుష్పరాణిని ప్రతిపాదించిన పది మందిలో ఆయన పేరు లేకపోవడంతో అధికారులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఏజెంట్‌గా వచ్చినట్లు ఆయన వివరించడంతో అభ్యర్థి పుష్పరాణితో మాట్లాడించాలని సూచించారు. సాయంత్రం 4 దాటినా ఎలాంటి సమాచారం రాలేదు. ఎన్నికల అధికారి నిర్ణయం కోసం మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు సహా అభ్యర్థి దండే విఠల్ కలెక్టరేట్ ఆవరణలోనే ఎదురుచూడాల్సి వచ్చింది. ఇదే సమయంలో భాజపాకు చెందిన కొంతమంది కలెక్టరేట్‌కు చేరుకొని నినాదాలు చేయడంతో తెరాస శ్రేణులు ప్రతినినాదాలు చేయడం, అనంతరం పుష్పరాణి సహా తుడుందెబ్బ శ్రేణులు వచ్చి బైఠాయించడంతో అక్కడ తోపులాట చోటుచేసుకుంది.
తెరాస శిబిరాలు
ఆరు స్థానాలకు ప్రాతినిధ్యం ఉన్న అయిదు ఉమ్మడి జిల్లాల్లో ఎన్నికలు జరగనుండడంతో ఆయా జిల్లాల్లో మెజారిటీ ఓట్లు ఉన్న తెరాస తమ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులను ముందుజాగ్రత్తగా శిబిరాలకు తరలించినట్లు తెలిసింది. పోలింగ్ రోజైన డిసెంబరు పదో తేదీన వారు నేరుగా పోలింగ్ కేంద్రాలకు చేరుకుంటారని సమాచారం.
ఏపీలో 11 మంది ఎమ్మెల్సీలు ఏకగ్రీవం
ఈనాడు, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లోని ఎనిమిది జిల్లాల పరిధిలోని 11 స్థానిక సంస్థల ఎమ్మెల్సీ నియోజకవర్గాల్లో వైకాపా అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 11 మంది వైకాపా అభ్యర్థులు ఎన్నికైనట్లు ఆయా జిల్లాల ఎన్నికల రిటర్నింగ్ అధికారులు ప్రకటించారు. చిత్తూరు-కృష్ణ రాఘవ జయేంద్ర భరత్, అనంతపురం-ఎల్లారెడ్డిగారి శివరామిరెడ్డి, ప్రకాశం-తూమాటి మాధవరావు, గుంటూరు(2 స్థానాలు)- డాక్టర్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, మురుగుడు హనుమంతరావు, కృష్ణా(2స్థానాలు)- తలశిల రఘురాం, మొండితోక అరుణ్‌కుమార్, తూర్పుగోదావరి-అనంత సత్య ఉదయ భాస్కర్, విశాఖపట్నం(2స్థానాలు)- వరుదు కళ్యాణి, చెన్నుబోయిన శ్రీనివాస్, విజయనగరం-ఇందుకూరి రఘురాజు ఎమ్మెల్సీలుగా ఎన్నికయ్యారు.