
తెలంగాణ
మావోయిస్టు పార్టీ తాజా పరిస్థితులపై ఆరా
కీలక నేత ప్రశాంత్ బోస్ అరెస్ట్ నేపథ్యంలో పర్యటన
ఈనాడు, హైదరాబాద్: మావోయిస్టు పార్టీ కీలక అగ్రనేత ప్రశాంత్ బోస్ అలియాస్ కిషన్‌దా అరెస్ట్ నేపథ్యంలో పార్టీ తాజా స్థితిగతులపై ఆరా తీసేందుకు తెలంగాణ నిఘా వర్గాలు ఝార్ఖండ్‌లో పర్యటించాయి. 75 ఏళ్ల వయసులో అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న కిషన్‌దా ఝార్ఖండ్ గిరిఢ్ అడవుల్లోని ప్రశాంత్‌హిల్స్ నుంచి చికిత్స నిమిత్తం బయటికి వచ్చిన క్రమంలో ఇటీవల అక్కడి పోలీసులకు చిక్కిన సంగతి తెలిసిందే. దక్షిణాది, ఉత్తరాది, ఈశాన్య రాష్ట్రాల్లోని మావోయిస్టు పార్టీ నేతలకు అతనే వారధిగా ఉన్నాడు. 2004లో దక్షిణ భారతంలో బలంగా ఉన్న సీపీఐ-పీపుల్స్‌వార్, ఉత్తరాదిన బలంగా ఉన్న భారత మావోయిస్టు కమ్యూనిస్ట్ సెంటర్(ఎంసీసీఐ) కలిసి సీపీఐ మావోయిస్టు పార్టీగా అవతరించాయి. ఆ సమయంలో ఎంసీసీఐకి ప్రశాంత్ బోస్ సారథ్యం వహించాడు. అప్పట్లో మావోయిస్టు పార్టీకి పీపుల్స్‌వార్ అగ్రనేత గణపతి కార్యదర్శిగా ఎన్నికయ్యాడు. ప్రశాంత్‌బోస్ రెండో స్థానంలో ఉంటూ పొలిట్‌బ్యూరో, కేంద్ర మిలిటరీ కమిషన్(సీఎంసీ) సభ్యుడిగా కొనసాగాడు. బిహార్, ఝార్ఖండ్‌తోపాటు ఈశాన్య రాష్ట్రాల్లో పార్టీ కార్యకలాపాల్ని పర్యవేక్షించాడు. మణిపుర్, నాగాలాండ్, అస్సాం లాంటి ఈశాన్య రాష్ట్రాల్లోని వేర్పాటువాద నక్సల్స్ పార్టీలతో అనుసంధాన ప్రక్రియలో నిమగ్నమయ్యాడు. నేపాల్ మావోయిస్టు పార్టీతోనూ సంబంధాలు నెరపడంలో కీలకంగా వ్యవహరించాడు. ఒకట్రెండు సార్లు పొలిట్‌బ్యూరో సభ్యుడు మల్లోజుల కోటేశ్వరరావు అలియాస్ కిషన్‌జీ (2010లో పశ్చిమబెంగాల్లో ఎన్కౌంటర్లో మృతిచెందారు)తో కలిసి నేపాల్‌కు సైతం వెళ్లివచ్చాడు. పార్టీలో ప్రాధాన్యం కలిగిన అతడి వద్ద కీలక సమాచారం ఉంటుందనే అంచనాతో తెలంగాణ నిఘావర్గాలు సహా దేశంలోని పలు రాష్ట్రాలకు చెందిన పోలీసులు ఝార్ఖండ్‌కు ఇటీవల వెళ్లారు.
2017లో గణపతితో ఆఖరి భేటీ!
కొంతకాలంగా ఝార్ఖండ్ గిరిఢ్ అడవుల్లో ఉన్న ప్రశాంత్ బోస్ అనారోగ్యంతో బాధపడుతున్నట్లు అప్పటికే దర్యాప్తు బృందాల వద్ద సమాచారమున్నా అతడు పక్షవాతంతో బాధపడుతున్నట్లు అరెస్ట్ తర్వాత వెల్లడైంది. అతడు చివరిసారిగా 2017లో అబూఝ్‌మాడ్‌కు వెళ్లి గణపతిని కలిసినట్లు తాజాగా గుర్తించారు. పార్టీలోని కీలక నేతలు ఆ సమయంలో భేటీ అయినట్లు సమాచారం సేకరించారు. అనారోగ్యంతో ఉన్న ప్రశాంత్ బోస్‌ను కొంతకాలంగా కీలక కార్యకలాపాలకు దూరంగా ఉంచినట్లు గుర్తించారు. ఉత్తరాది, ఈశాన్య రాష్ట్రాల్లో పార్టీ కార్యకలాపాల్ని పాత ఎంసీసీఐకే చెందిన మరో అగ్రనేత ద్వారా నిర్వహిస్తున్నట్లు తేలిందని తెలంగాణ నిఘావర్గానికి చెందిన ఓ ఉన్నతాధికారి తెలిపారు.