
గ్రేటర్ హైదరాబాద్
ఎకనమిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్ జాబితాలో తొలిస్థానంలో నిలిచిన ఇజ్రాయెల్ సిటీ
ద్వితీయస్థానంలో పారిస్, సింగపూర్
చౌక నగరాల జాబితాలో అహ్మదాబాద్‌కు ఏడోస్థానం
ఇంటర్నెట్ డెస్క్: ప్రపంచంలో అత్యంత ఖరీదైన నగరంగా ఇజ్రాయెల్‌లోని టెల్ అవీవ్ నిలిచింది. ‘ఎకనమిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్’ (ఈఐయూ) అనే సంస్థ.. పెరుగుతున్న జీవన వ్యయాల ఆధారంగా అత్యంత ఖరీదైన నగరాల జాబితాను రూపొందించింది. ఈ మేరకు వరల్డ్ కాస్ట్ ఆఫ్ లివింగ్-2021 పేరుతో నివేదిక విడుదల చేసింది. ఆగస్టు, సెప్టెంబరు నెలల్లో ప్రపంచవ్యాప్తంగా 173 నగరాల్లో ఉన్న నిత్యావసర వస్తువుల ధరలు, ఇంటి అద్దె, రవాణా తదితర వ్యయాలను పరిగణనలోకి తీసుకున్నారు. ఈ జాబితాలో తొలిసారిగా టెల్ అవీవ్ మొదటి స్థానంలో నిలవడం విశేషం. పారిస్(ఫ్రాన్స్), సింగపూర్ సమాన పాయింట్లతో రెండో స్థానాన్ని పంచుకున్నాయి. జ్యూరిచ్ (స్విట్జర్లాండ్) నాలుగో స్థానంలో, హాంకాంగ్ ఐదో స్థానంలో నిలిచాయి. ఆరో స్థానంలో న్యూయార్క్ (అమెరికా), ఏడో స్థానంలో జెనీవా (స్విట్జర్లాండ్), ఎనిమిదో స్థానంలో కోపెన్‌హాగెన్ (డెన్మార్క్), తొమ్మిదో స్థానంలో లాస్ ఏంజెలెస్ (అమెరికా), పదో స్థానంలో ఒసాకా (జపాన్) ఉన్నాయి. గతేడాది పారిస్, జ్యూరిచ్, హాంకాంగ్ నగరాలు అత్యంత ఖరీదైన నగరాల జాబితాలో తొలి మూడు స్థానాల్లో నిలిచాయి. ద్రవ్యోల్బణం ప్రభావం.. కరోనా కారణంగా నిత్యావసర వస్తువుల సరఫరాలో ఇబ్బందులతో కొన్ని దేశాల్లో ధరలకు రెక్కలొచ్చాయి. జీవన వ్యయం విపరీతంగా పెరిగిపోయింది. గతంతో పోలిస్తే నిత్యావసర వస్తువుల ధరలు స్థానిక కరెన్సీలోనే 3.5 శాతం పెరిగినట్లు ఈఐయూ సర్వేలో తేలింది. దీంతో గతంలో 79వ స్థానంలో ఉన్న ఇరాన్ రాజధాని టెహ్రాన్ కూడా 29వ స్థానానికి ఎగబాకింది. దీన్ని బట్టి గతేడాది కంటే ఈ ఏడాది ప్రపంచవ్యాప్తంగా జీవన వ్యయాలు భారీగా పెరిగినట్లు తెలుస్తోంది.
* అత్యల్ప జీవన వ్యయమున్న (చౌకైన) నగరంగా సిరియా రాజధాని డమాస్కస్ నిలిచింది. గుజరాత్‌లోని అహ్మదాబాద్ నగరం ఈ జాబితాలో ఏడో స్థానం దక్కించుకుంది.
* పెట్రోల్ ధరలు అత్యంత ఎక్కువగా ఉన్న తొలి పది నగరాల్లో హాంకాంగ్ తొలిస్థానంలో నిలిచింది. అక్కడ లీటర్ పెట్రోల్ ధర సుమారు రూ.187 (2.5 డాలర్లు) ఉన్నట్లు ఈఐయూ తెలిపింది. లీటర్‌కు సుమారు రూ.150 (2 డాలర్లు) ధరతో టెల్ అవీవ్ ఈ జాబితాలో నాలుగో స్థానంలో నిలిచింది.