
తెలంగాణ
కొవిడ్ ‘అదనపు’ డోసుపై చర్చ
దిల్లీ: రోగ నిరోధకశక్తి తక్కువగా ఉన్నవారికి కొవిడ్ టీకా ‘అదనపు’ డోసు ఇచ్చే అంశాన్ని ఇమ్యునైజేషన్‌పై ఏర్పాటైన జాతీయ సాంకేతిక సలహా బృందం (ఎన్టాగీ) పరిశీలించనుంది. ఈమేరకు సోమవారం నిర్వహించనున్న సమావేశంలో దీనిపై చర్చిస్తారని అధికారులు తెలిపారు. అధికార వర్గాల సమాచారం మేరకు.. అదనపు డోసుకు, బూస్టర్ డోసుకు మధ్య తేడా ఉంది. ముందు జరిగిన వ్యాక్సినేషన్ వల్ల కలిగే రోగ నిరోధక స్పందన కొంత తగ్గినట్లు భావించినప్పుడు తర్వాత నిర్దేశించిన సమయంలో అందరికీ ఇచ్చేదే బూస్టర్ డోసు. అదే రోగ నిరోధకశక్తి తక్కువగా ఉన్నవారు, మందులతో రోగనిరోధక శక్తిని తగ్గించినవారిలో ముందు ఇచ్చిన టీకాలు ఇన్ఫెక్షన్ నుంచి తగినంత రక్షణ కల్పించనప్పుడు అలాంటివారికి మాత్రమే అదనపు డోసు ఇస్తారు. ‘‘ప్రస్తుత పరిస్థితుల్లో అధ్యయనాలు కొనసాగుతున్నందున బూస్టర్ డోసు అంశం అజెండాలో లేదు. అదనపు డోసుకు సంబంధించి మాత్రమే ఎన్టాగీ సమావేశంలో చర్చకు రానుంది’’ అని అధికార వర్గాలు తెలిపాయి.