Haryana Crisis: సంక్షోభం వేళ చౌతాలాకు షాక్‌.. భాజపా గూటికి పార్టీ ఎమ్మెల్యేలు..!

Haryana Crisis: హరియాణాలో రాజకీయ సంక్షోభం వేళ జేజేపీ నాయకుడు దుశ్యంత్ చౌతాలాకు షాక్‌ తగిలింది. ఆయన పార్టీ ఎమ్మెల్యేలు భాజపా గూటికి చేరేందుకు సిద్ధమయ్యారు. దీంతో సైనీ ప్రభుత్వం మెజార్టీ సాధించే అవకాశాలు కన్పిస్తున్నాయి.

Published : 09 May 2024 19:19 IST

చండీగఢ్‌: హరియాణా (Haryana Crisis)లో రాజకీయ సమీకరణాలు శరవేగంగా మారుతున్నాయి. స్వతంత్ర ఎమ్మెల్యేలు మద్దతు ఉపసంహరించుకోవడంతో ముఖ్యమంత్రి నాయబ్‌ సింగ్‌ సైనీ నేతృత్వంలోని భాజపా (BJP) ప్రభుత్వం మైనార్టీలో పడిన విషయం తెలిసిందే. దీంతో సీఎం అసెంబ్లీలో తన బలాన్ని నిరూపించుకోవాలని మాజీ ఉప ముఖ్యమంత్రి, జననాయక్‌ జనతా పార్టీ (JJP) నాయకుడు దుశ్యంత్‌ చౌతాలా (Dushyant Chautala) డిమాండ్‌ చేశారు. ఈ పరిణామాలు ఇప్పుడు కీలక మలుపు తిరిగాయి. జేజేపీ నుంచి కొందరు ఎమ్మెల్యేలు భాజపాకు మద్దతు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.

చౌతాలా పార్టీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలు ఈ మధ్యాహ్నం భాజపా నేత, మాజీ సీఎం మనోహర్‌లాల్ ఖట్టర్‌తో సమావేశమయ్యారు. రాష్ట్ర మంత్రి మహిపాల్ దండా నివాసంలో దాదాపు అరగంట పాటు ఈ చర్చలు జరిగాయి. ఒకవేళ శాసనసభలో సీఎం బలపరీక్షను ఎదుర్కోవాల్సివస్తే వీరు భాజపాకు మద్దతు పలికే అవకాశమున్నట్లు సమాచారం. అయితే, ఈ భేటీపై స్పందించేందుకు భాజపా నేతలు నిరాకరించారు.

హరియాణా సంక్షోభం.. ‘బలపరీక్ష’కు భాజపా మాజీ మిత్రుడి డిమాండ్‌

సైనీ (Nayab Singh Saini) ప్రభుత్వానికి బలపరీక్ష నిర్వహించాలని డిమాండ్‌ చేస్తూ దుశ్యంత్‌ చౌతాలా నేడు రాష్ట్ర గవర్నర్‌ బండారు దత్తాత్రేయకు లేఖ రాసిన సంగతి తెలిసిందే. ప్రభుత్వానికి వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానం తెస్తే మేం దానికి తమ పార్టీ మద్దతిస్తుందని తెలిపారు. ఈ పరీక్షలు ప్రభుత్వం మెజార్టీ సాధించలేకపోతే రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని కోరారు. ఈ డిమాండ్ల వేళ జేజేపీ ఎమ్మెల్యేలు.. భాజపా నేతలతో సంప్రదింపులు జరపడం ప్రాధాన్యం సంతరించుకుంది.

90 స్థానాలున్న హరియాణా అసెంబ్లీలో ప్రస్తుత సభ్యుల సంఖ్య (మాజీ ముఖ్యమంత్రి మనోహర్‌లాల్‌ ఖట్టర్‌, మరో స్వతంత్ర ఎమ్మెల్యే రంజిత్‌ చౌతాలా రాజీనామాలతో) 88కు పడిపోయింది. ప్రభుత్వం గట్టెక్కాలంటే 45 మంది సభ్యుల మద్దతు అవసరం. ప్రస్తుతం భాజపాకు 40 మంది ఎమ్మెల్యేలుండగా.. ఇద్దరు స్వతంత్ర శాసనసభ్యులు, హరియాణా లోక్‌హిత పార్టీ ఏకైక సభ్యుడు మద్దతిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు