
ఫీచర్ పేజీలు
సమస్య: నాకు 23 ఏళ్లు. పదేళ్లుగా చలి పెట్టే సమయంలో శరీరంలో ఒక వైపున పక్షవాతం లక్షణాలు వస్తున్నాయి. ఇవి 10 సెకండ్లు మాత్రమే ఉంటాయి. ఎప్పుడో ఒకసారే వస్తుంటాయి. ఇదేం సమస్య?
- జి. అరుణ్ కుమార్ (ఈమెయిల్)
సలహా: మీకు ఇతరత్రా జబ్బులేవైనా ఉన్నాయా, లక్షణాలు తగ్గాక ఎలా ఉంటుందన్నది తెలపలేదు. ఇవి చాలా ముఖ్యం. ఎందుకంటే చలి పెట్టే సమయంలోనే శరీరంలో ఒక వైపున పక్షవాతం లక్షణాలు తలెత్తటం, అదీ తక్కువ సేపే ఉండటమనేది చాలా అరుదు. దీనికి ఇతరత్రా జబ్బులేవైనా కారణం కావొచ్చు. పార్శ్వనొప్పి గలవారిలో కొందరికి తలనొప్పి వచ్చే ముందు శరీరంలో ఒకవైపు కొద్ది సెకండ్ల పాటు బలహీనంగా అనిపించొచ్చు. కణాల పొరల్లో అయాన్ ఛానెళ్ల పనితీరు అస్తవ్యస్తమైనా (ఛానెలోపతీ) కొన్నిసార్లు తూలటం, శరీరంలో ఒకవైపు బలహీనత, మొద్దుబారటం వంటి లక్షణాలు తలెత్తొచ్చు. కొందరికివి చలికాలంలో మరింత ఎక్కువగానూ కనిపించొచ్చు. కొందరికి ఫిట్స్ కూడా రావొచ్చు. కొన్నిసార్లు తాత్కాలికంగా మెదడుకు రక్త సరఫరా తగ్గినా ఒక చేయి, కాలు చచ్చుబడినట్టు అనిపించొచ్చు. అంతేకాదు.. మానసికంగానూ కొందరు ఇలాంటి అనుభూతికి లోనవ్వచ్చు. వీటన్నింటిని పరిశీలిస్తే గానీ అసలు సమస్య ఏంటన్నది బయటపడదు. మీరు నాడీ నిపుణులను సంప్రదిస్తే తగు పరీక్షలు చేసి, సమస్యను నిర్ధరిస్తారు. అవసరమైన చికిత్స సూచిస్తారు.