తాజా వార్తలు

Facebook Share Twitter Share Comments Telegram Share
Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు

1. కీలక వడ్డీరేట్లు మళ్లీ యథాతథం

మార్కెట్‌ విశ్లేషకుల అంచనాలను నిజం చేస్తూ కీలక వడ్డీ రేట్లను ఆర్‌బీఐ మరోసారి యథాతథంగా ఉంచింది. ద్వైమాసిక ద్రవ్య పరపతి విధాన సమీక్ష నిర్ణయాలను గవర్నర్‌ శక్తికాంత దాస్‌ బుధవారం వెల్లడించారు. కొవిడ్‌ కొత్త వేరియంట్‌ వ్యాప్తి, అధిక ద్రవ్యోల్బణం భయాల కారణంగా ఈసారి కూడా కీలక రేట్లలో ఎలాంటి మార్పు చేయలేదు. రెపో రేటు 4శాతంగా ఉంచగా.. రివర్స్‌ రెపో రేటును 3.35 శాతంగా కొనసాగించనున్నట్లు శక్తికాంత దాస్‌ తెలిపారు. 

2. ఎంపీల సస్పెన్షన్‌పై మళ్లీ దద్దరిల్లిన రాజ్యసభ

పార్లమెంట్‌ సమావేశాల్లో భాగంగా రాజ్యసభలో బుధవారమూ అదే గందరగోళం నెలకొంది. ప్రతిపక్ష ఎంపీలపై సస్పెన్షన్‌ ఎత్తివేతకు విపక్షాలు పట్టుబట్టడంతో సభ మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా పడింది. ఈ ఉదయం 11 గంటలకు రాజ్యసభ ప్రారంభం కాగానే ఛైర్మన్‌ వెంకయ్యనాయుడు శూన్య గంట చేపట్టారు. అయితే, ఎంపీల సస్పెన్షన్‌ సహా పలు అంశాలపై చర్చ జరపాలంటూ విపక్ష ఎంపీలు నోటీసులిచ్చారు. ఇందుకు ఛైర్మన్‌ అంగీకరించలేదు. దీంతో ప్రతిపక్ష సభ్యులు ప్లకార్డులు చేతబట్టి నినాదాలు చేశారు. 

3. 8,439 కొత్త కేసులు.. 9,525 రికవరీలు

దేశంలో గత కొద్దికాలంగా కరోనా కేసుల్లో హెచ్చుతగ్గులు కొనసాగుతున్నాయి. అంతక్రితం రోజు 18 నెలల కనిష్ఠానికి తగ్గిన కేసులు.. తాజాగా 23 శాతం మేర పెరిగాయి. ప్రస్తుతం కరోనా వ్యాప్తి కట్టడిలోనే ఉండగా.. ఈ సమయంలో ఒమిక్రాన్ కలవరం మొదలైంది. ఇప్పటివరకు 23 మందిలో ఈ రకాన్ని గుర్తించినట్లు బుధవారం కేంద్రం వెల్లడించింది. అలాగే తాజా గణాంకాలను విడుదల చేసింది.  

4. బడి పిల్లలకు సర్కారు కిట్‌!

సర్కారు పాఠశాలల విద్యార్థులకు ఏటా రెండు జతల ఏకరూప దుస్తులు, పాఠ్య పుస్తకాలను ఇస్తున్న విద్యాశాఖ వాటిని ఓ స్కూల్‌ బ్యాగ్‌లో ఉంచి పంపిణీ చేయాలని భావిస్తోంది. దానికో పథకం పేరు పెట్టి ఇవ్వొచ్చా? అందుకు సమగ్ర శిక్షాభియాన్‌ ద్వారా మరిన్ని నిధులను పొందే అవకాశం ఉందా? అని మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆరా తీసినట్లు సమాచారం. జత బూట్లు, రెండు జతల సాక్సులు కూడా  ఇస్తే ఎంతవుతుంది? నిధుల సేకరణ ఎలా అన్న దానిపై అధికారులు కసరత్తు చేస్తున్నట్లు తెలిసింది.

5. 38వ రోజుకు చేరుకున్న అమరావతి రైతుల పాదయాత్ర

అమరావతి రైతుల ‘న్యాయస్థానం నుంచి దేవస్థానం’ పాదయాత్ర 38వ రోజుకు చేరింది. బుధవారం చిత్తూరు జిల్లాలోని ఏర్పేడు మండలం చింతలపాలెం నుంచి ప్రారంభమైంది. ఈరోజు రాజులపాలెం, పంగూరు, కాట్రకాయలగుంట మీదుగా శ్రీకాళహస్తి మండలంలోని పలు గ్రామాల మీదుగా శ్రీకాళహస్తి పట్టణం వరకు పాదయాత్ర కొనసాగనుంది. రాత్రికి శ్రీకాళహస్తిలో రైతుల బస చేయనున్నారు. 

6. మిశ్రమ డోసులతో గట్టి స్పందన

భిన్నరకాల కొవిడ్‌-19 టీకా డోసులతో గట్టి ఫలితమే ఉంటుందని తాజా పరిశోధనలో వెల్లడైంది. దీనివల్ల బలమైన రోగ నిరోధక స్పందన కలుగుతోందని తేలింది. బ్రిటన్‌లోని ఆక్స్‌ఫర్డ్‌ విశ్వవిద్యాలయం ఈ అధ్యయనాన్ని నిర్వహించగా ఆ వివరాలు ప్రముఖ వైద్య పత్రిక ‘ద లాన్సెట్‌’లో ప్రచురితమయ్యాయి. 1,070 మందిపై ఈ పరిశోధనను నిర్వహించారు.

7. ఒమిక్రాన్‌.. డెల్టా కంటే తీవ్రమేమీ కాదు..! 

దక్షిణాఫ్రికాలో బయటపడి యావత్‌ దేశాలను వణికిస్తోన్న ‘ఒమిక్రాన్‌’ వేరియంట్‌పై ప్రపంచ వ్యాప్తంగా విస్తృత స్థాయిలో పరిశోధనలు జరుగుతున్నాయి. అయితే గతంలో ప్రపంచ దేశాలను ఉక్కిరిబిక్కిరి చేసిన ‘డెల్టా’ వేరియంట్‌ కంటే ఒమిక్రాన్‌ తీవ్రమైనదేమీ కాదని అమెరికా అంటు వ్యాధుల నిపుణులు, బైడెన్‌ ముఖ్య వైద్య సలహాదారు ఆంటోనీ ఫౌచీ అన్నారు. మరిన్ని వారాలు గడిస్తేనే దీనిపై స్పష్టమైన నిర్ణయానికి రావొచ్చన్నారు.

8. దేశీయ సూచీల్లో కొనసాగుతున్న లాభాల జోరు!

దేశీయ స్టాక్ మార్కెట్‌ సూచీలు బుధవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. కొవిడ్‌ ఒమిక్రాన్‌ వేరియంట్‌ తీవ్రతపై ఆందోళనలు తగ్గడం వల్ల అంతర్జాతీయ మార్కెట్లు పుంజుకోవడంతో.. సెన్సెక్స్‌, నిఫ్టీ అదే బాటలో నడుస్తున్నాయి. డెల్టా వేరియంట్‌తో పోలిస్తే ఒమిక్రాన్‌ ప్రమాద తీవ్రత తక్కువగా ఉండొచ్చన్న వార్తలు ఇందుకు దోహదం చేస్తున్నాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి రూ.75.37 వద్ద ట్రేడవుతోంది. 

9. దేశ ఆస్తుల్ని మోదీ ప్రభుత్వం అమ్మేస్తోంది: సోనియా

భాజపా ప్రభుత్వంపై కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. పార్లమెంట్‌ సమావేశాలకు ముందు జరిగిన కాంగ్రెస్‌ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. దేశ ఆస్తుల్ని మోదీ ప్రభుత్వం విక్రయిస్తోందని ఆరోపించారు. ప్రభుత్వ రంగ సంస్థలు మూతపడేలా చేస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వం అన్ని వస్తువుల ధరలు పెంచడంతో సామన్య ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 

10. అరుదైన ఘనత సాధించిన స్టార్క్

ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ జట్ల మధ్య బ్రిస్బేన్‌ వేదికగా జరుగుతోన్న యాషెస్‌ టెస్టు సిరీస్‌లో మిచెల్ స్టార్క్‌ అరుదైన రికార్డు నమోదు చేశాడు. టెస్టుల్లో తొలి బంతికే వికెట్ తీసి చరిత్రకెక్కాడు. ఇతని కంటే ముందు 1936లో ఎర్నీ మెక్‌ కార్మిక్‌ తొలిసారి ఈ ఘనత సాధించాడు. ఈ రెండు రికార్డులు బ్రిస్బేన్‌ మైదానంలోనే నమోదు కావడం గమనార్హం. 


మరిన్ని

దేవ‌తార్చ‌న

+

© 1999- 2022 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.