మొనాజైట్‌ అక్రమ రవాణా ఆరోపణలు అవాస్తవం

2019నుంచి రాష్ట్రంలో ఎక్కడా బీచ్‌శాండ్‌ మైనింగ్‌ కాలేదు

గనుల శాఖ డైరెక్టర్‌ వీజీ వెంకటరెడ్డి

ఈనాడు-అమరావతి: రాష్ట్రంలో బీచ్‌శాండ్‌ మైనింగ్‌ ద్వారా మొనాజైట్‌ ఖనిజాన్ని అక్రమ రవాణా చేస్తున్నట్లు వచ్చిన ఆరోపణలు పూర్తి అవాస్తవమని గనుల శాఖ డైరెక్టర్‌ వీజీ వెంకటరెడ్డి పేర్కొన్నారు. 2019నుంచి రాష్ట్రంలో ఎక్కడా బీచ్‌శాండ్‌ మైనింగ్‌ జరగడం లేదని తెలిపారు. అసలు మైనింగ్‌ ఆపరేషన్సే లేనప్పుడు మొనాజైట్‌ ఖనిజాన్ని అక్రమ రవాణా చేయటం ఎలా సాధ్యమవుతుందని ప్రశ్నించారు. ఈ మేరకు గురువారం ఆయన పత్రికా ప్రకటన విడుదల చేశారు. ‘2019కంటే ముందు ఏపీలో 2 ప్రైవేటు సంస్థలు బీచ్‌శాండ్‌ మైనింగ్‌ నిర్వహించాయి. 2019లో కేంద్రం ఆదేశాల మేరకు రాష్ట్రంలో హెవీ మినరల్‌ బీచ్‌శాండ్‌ మైనింగ్‌ నిలిపేశాం. ఇటీవల బీచ్‌శాండ్‌ మైనింగ్‌లో అక్రమాలంటూ వచ్చిన ఆరోపణల నేపథ్యంలో ఇండియన్‌ బ్యూరో ఆఫ్‌ మైన్స్‌ (ఐబీఎం) ద్వారా విచారణ జరిపించాలని కేంద్ర గనుల శాఖను అణు ఇంధన శాఖ కోరింది. ఐబీఎం విచారణలో సదరు సంస్థలు మైనింగ్‌ నిర్వహించినప్పుడు ఏదైనా అక్రమాలకు పాల్పడి ఉంటే వాస్తవాలు వెలుగుచూస్తాయి. అక్రమాలు నిర్ధారణ అయితే బాధ్యులపై చర్యలు తీసుకుంటాం’ అని ప్రకటనలో తెలిపారు. ఇతర ప్రధానాంశాలివి.

* ఏపీలో బీచ్‌శాండ్‌ మైనింగ్‌ కోసం గతేడాది కేంద్ర అణుశక్తి సంస్థ (డీఏఈ)కి ఏపీఎండీసీ 16 ప్రతిపాదనలు సమర్పించింది. దానిలో విశాఖ జిల్లా భీమునిపట్నం పరిధిలో 90.15 హెక్టార్లు, కృష్ణా జిల్లా మచిలీపట్నం తీరంలో 1978.471 హెక్టార్లలో రెండు బీచ్‌శాండ్‌ డిపాజిట్లకు ఏపీఎండీసీని ప్రాస్పెక్టివ్‌లెస్సీగా డీఏఈ నియమించింది. ఇక్కడ మైనింగ్‌ జరిపేందుకు అనుమతుల కోసం ఏపీఎండీసీ దరఖాస్తు చేసుకుంది. ఆ అనుమతుల ప్రక్రియ పూర్తికాకపోవటం వల్ల ఈ 2బ్లాక్‌లలో ఇప్పటివరకూ మైనింగ్‌ ప్రారంభం కాలేదు.

* హెవీ మినరల్‌ బీచ్‌శాండ్‌లో మొనాజైట్‌ అవశేషాలు సున్నా శాతమే ఉండాలి. అంతకుమించి ఉన్నట్లు నిర్ధారణయితే ఆ లీజులను రద్దు చేయాలంటూ కేంద్రం 1.3.2019న మెమో ద్వారా రాష్ట్రానికి ఆదేశాలిచ్చింది. దాని ప్రకారం ఏపీలోని బీచ్‌శాండ్‌లో మొనాజైట్‌ శాతం కేంద్రం నిర్దేశించిన దానికన్నా ఎక్కువగా ఉన్నందున అన్ని బీచ్‌శాండ్‌ లీజులను గనుల శాఖ రద్దు చేసింది.

* బీచ్‌శాండ్‌ మైనింగ్‌పై తాజాగా కేంద్రం సందేహాల నేపథ్యంలో ఈ ఏడాది ఏప్రిల్‌ 12న అణు ఇంధన శాఖ అధికారులకు రాష్ట్ర ప్రభుత్వం గనులశాఖ ద్వారా వివరణ ఇచ్చింది. రాష్ట్రంలో బీచ్‌శాండ్‌ మైనింగ్‌ జరుగుతోందని, తద్వారా పర్యావరణానికి నష్టం, మైనింగ్‌ చట్టాలకు విఘాతం కలుగుతోందని, మొనాజైట్‌ అక్రమ రవాణా అవుతోందని వచ్చిన ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని కేంద్రానికి సమర్పించిన నివేదికలో స్పష్టం చేసింది.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని