సంక్షిప్త వార్తలు

రాష్ట్రాన్ని విద్యుత్‌ వాహనాల హబ్‌గా తీర్చిదిద్దుతాం: మంత్రి అమర్‌నాథ్

ఈనాడు, అమరావతి: విద్యుత్‌ వాహన తయారీ రంగంలో రూ.32 వేల కోట్ల పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యమని పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్రాన్ని విద్యుత్‌ వాహన తయారీ హబ్‌గా తీర్చిదిద్దడానికి ‘వరల్డ్‌ ఎకనమిక్‌ ఫోరం’తో కలిసి మొదటి వర్చువల్‌ సమావేశాన్ని శుక్రవారం నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ‘రవాణారంగం భవిష్యత్తును నిర్దేశించడం’ పేరిట రాష్ట్ర ఆర్థిక అభివృద్ధి బోర్డు (ఏపీఈడీబీ) నిర్వహించే సదస్సులో విద్యుత్‌ వాహన రంగంలో పెట్టుబడులు, అవకాశాలపై ప్రధానంగా చర్చ జరుగుతుందన్నారు. ‘‘విద్యుత్‌ వాహనాల తయారీ కంపెనీలకు చెందిన 60 మంది సీఈవోలు ఇందులో పాల్గొంటారు. రాష్ట్రంలో ఉన్న అవకాశాలను వారికి వివరిస్తాం. రాష్ట్రాన్ని కర్బన ఉద్గారాల రహితంగా తీర్చిదిద్దాలన్నదే లక్ష్యం. వాహనాలు, విడిభాగాలు, ఛార్జింగ్‌కు సంబంధించిన సదుపాయాలు, ఇతర అంశాలపై కంపెనీల సీఈవోల నుంచి అభిప్రాయాలు తీసుకుంటాం’’ అని పేర్కొన్నారు.


ఆహారధాన్యాలను పూర్తిగా పంచడం లేదని కేంద్రం చెప్పేది వాస్తవం కాదు
పౌరసరఫరాలశాఖ కమిషనర్‌

ఈనాడు, అమరావతి: కేంద్రం నుంచి రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న ఆహారధాన్యాలను.. లబ్ధిదారులకు పూర్తిగా పంచడం లేదంటూ కేంద్ర ఆహార, ప్రజాపంపిణీ వ్యవహారాలశాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌ లోక్‌సభకు ఇచ్చిన సమాధానంలో వాస్తవం లేదని పౌరసరఫరాలశాఖ కమిషనర్‌ గిరిజా శంకర్‌ ఒక ప్రకటనలో తెలిపారు. ‘తీసుకునే రేషన్‌ ఎక్కువ.. ప్రజలకు పంచేది తక్కువ’ అని గురువారం ‘ఈనాడు’ లో వచ్చిన వార్తపై ఆయన వివరణ ఇచ్చారు. ‘కేంద్ర ప్రభుత్వం ఎన్‌ఎఫ్‌ఎస్‌ఏ కింద 268.23 లక్షల మంది లబ్ధిదారులకు పంపిణీ చేయడానికి ఏపీకి నెలకు 1.54 లక్షల టన్నుల బియ్యాన్ని కేటాయిస్తుంది. అది తీసుకున్న పరిమాణం కాదు. 2019-20 నుంచి 2022 మధ్య కాలంలో కేంద్రం ఎప్పటికప్పుడు కేటాయింపులను సవరించింది. దీంతో కేటాయింపు, పంపిణీ వివరాల్లో కొన్ని వ్యత్యాసాలున్నాయి. 2020-21లో ఎన్‌ఎఫ్‌ఎస్‌ఏ కింద ఏపీకి 17.77 లక్షల టన్నులు మాత్రమే కేటాయించగా.. 21.41 లక్షల టన్నులుగా చూపారు. వ్యత్యాసంగా చూపిన 3.64 లక్షల టన్నులను ఆంధ్రప్రదేశ్‌ పౌరసరఫరాలశాఖ బహిరంగ మార్కెట్‌ కొనుగోలు పథకం కింద కేంద్రం నుంచి కొనుగోలు చేసి 2020 ఏప్రిల్‌-ఆగస్టు మధ్య పంపిణీ చేశాం. ఈ వివరాలు కేంద్ర పోర్టల్‌లో చూపరు. ఈ క్రమంలోనే 3.64 లక్షల టన్నుల తేడా చూపారు. వాస్తవానికి ఎలాంటి వ్యత్యాసం లేదు. మీడియా ద్వారా ఈ విషయం తెలిసింది. కేంద్రానికి రాతపూర్వకంగా తెలియజేస్తాం’ అని గిరిజాశంకర్‌ వివరించారు.


‘భూ హక్కు, భూ రక్షా’ పథకంపై అవగాహన ఒప్పందం

ఈనాడు, అమరావతి: వైఎస్సార్‌ జగనన్న శాశ్వత భూ హక్కు, భూ రక్షా పథకం అమల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం, నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ స్మార్ట్‌ గవర్న్‌మెంట్‌తో గురువారం అవగాహన ఒప్పందం చేసుకుంది. భూ పరిపాలన శాఖ ప్రధాన కమిషనర్‌ సాయిప్రసాద్‌ సమక్షంలో జాతీయ సంస్థ ప్రధాన కార్యనిర్వహణ అధికారి రామకృష్ణారావు, సర్వే సెటిల్‌మెంట్‌ అండ్‌ ల్యాండ్‌ రికార్డ్సు కమిషనర్‌ సిద్దార్థ్‌జైన్‌ ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు.మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని