టిడ్కో ఇళ్ల పంపిణీలో ప్రొటోకాల్‌ రగడ

వేదికపైకి రాకుండా తెదేపా ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల అడ్డగింత

తోపులాటలో కింద పడిపోయిన నేతలు

కలెక్టరేట్‌లో ఎమ్మెల్యే నిమ్మల నిరసన

పాలకొల్లు, భీమవరం అర్బన్‌, న్యూస్‌టుడే: పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో శుక్రవారం నిర్వహించిన టిడ్కో ఇళ్ల పంపిణీ కార్యక్రమం రసాబాసగా మారింది. శిలాఫలకంలో తన పేరు అడుగున వేశారని.. కార్యక్రమ నిర్వహణలో ప్రొటోకాల్‌ పాటించలేదంటూ స్థానిక ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు (తెదేపా) ప్రశ్నించడంతో ఉద్రిక్తత ఏర్పడింది. మంత్రులు కొట్టు సత్యనారాయణ, ఆదిమూలపు సురేష్‌, కారుమూరి నాగేశ్వరరావు ముందుగా సభావేదికపైకి చేరుకోగా, వారి వెనక వస్తున్న ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు, ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్‌లను వైకాపా కార్యకర్తలు అడ్డుకున్నారు. తోపులాటలో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు రెండుసార్లు కిందపడ్డారు. వ్యక్తిగత సహాయకుల సహకారంతో వారు సభావేదికపైకి అతికష్టంమీద చేరుకున్నారు. తొలుత మంత్రి కొట్టు ప్రసంగించగా.. తర్వాత మంత్రి సురేష్‌ మాట్లాడాక ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు అవకాశం ఇవ్వకుండానే సభ ముగించేశారు.

దొంగల్లా పారిపోయారు.. ఇళ్ల కోసం ఏళ్లుగా నిరీక్షిస్తున్న లబ్ధిదారులకు సరైన సమాధానం చెప్పలేకే మంత్రులు, వైకాపా నాయకులు దొంగల్లా పారిపోయారని ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు ఆరోపించారు. అదే భీమవరంలో అక్కడి వైకాపా ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్‌ పేరును సభాధ్యక్షుడి హోదాలో శిలాఫలకంపై రెండో స్థానంలో వేశారని గుర్తుచేశారు. లబ్ధిదారులనుంచి ఎలాంటి పరిస్థితులు వస్తాయోననే ఆందోళనతో హడావుడిగా సభను ముగించేసి వైకాపావారు జారుకున్నారని ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్‌ విమర్శించారు. అనంతరం వారు భీమవరంలోని కలెక్టరేట్‌కు చేరుకున్నారు. ఉండి ఎమ్మెల్యే రామరాజు (తెదేపా)తో కలిసి అక్కడ ఐదుగంటలకు పైగా బైఠాయించారు. సాయంత్రం ఒకసారి కలెక్టర్‌ ప్రశాంతి వచ్చి వారిని సముదాయించారు. ఫ్రొటోకాల్‌ పాటించనివారిపై చర్యలకు నాయకులు పట్టుబట్టారు. రాత్రి ఏడింటి తరువాత కలెక్టర్‌ మరోసారి వచ్చి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని హామీనిచ్చారు. న్యాయం జరగనట్లయితే మరోసారి ఆందోళనకు దిగుతామని ఎమ్మెల్యే రామానాయుడు పేర్కొంటూ ప్రయాణమయ్యారు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని