జల్‌జీవన్‌ మిషన్‌ ర్యాంకుల్లో వెనుకబడిన ఏపీ జిల్లాలు

ఏ కేటగిరీలోనూ దక్కని చోటు

ఈనాడు, దిల్లీ: జల్‌జీవన్‌ మిషన్‌ అమలులో వివిధ జిల్లాలు కనబరిచిన ప్రతిభ ఆధారంగా కేంద్ర జల్‌శక్తిశాఖ విడుదల చేసిన నెలవారీ ఉత్తమ జిల్లాల్లో ఆంధ్రప్రదేశ్‌ వెనుకబడింది. అక్టోబరు 1 నాటికి గ్రామీణ ప్రాంతాల్లోని ఇళ్లకు ఏర్పాటు చేసిన తాగునీటి కొళాయిల కవరేజీ ఆధారంగా జిల్లాలకు ఫ్రంట్‌ రన్నర్స్‌ (100 కవరేజీ), హై ఎచీవర్స్‌ (75 నుంచి 100% కవరేజీ), ఎచీవర్స్‌ (50 నుంచి 75% కవరేజి), పెర్ఫార్మర్స్‌ (25 నుంచి 50% కవరేజీ), యాస్పిరెంట్స్‌ (0 నుంచి 25% కవరేజీ) కింద 1, 2 3 ర్యాంకులను కేంద్రం బుధవారం ప్రకటించింది. ఇందులో ఏ కేటగిరీలోనూ ఏపీకి చోటు దక్కలేదు. అలాగే ఫాస్టెస్ట్‌ మూవింగ్‌ డిస్ట్రిక్ట్‌ విభాగంలోనూ ఎచీవర్స్‌, పెర్ఫార్మర్స్‌, యాస్పిరెంట్స్‌ కేటగిరీల్లో మూడేసి ర్యాంకులు ప్రకటించగా అందులోనూ ఏపీ జిల్లాలు కనిపించలేదు. గ్రాడ్యుయేటింగ్‌ జిల్లాల విభాగం కింద గ్రాడ్యుయేటింగ్‌ టు హై ఎచీవర్స్‌, ఎచీవర్స్‌, పెర్ఫార్మర్స్‌ విభాగాల కింద ర్యాంకులను ప్రకటించకపోయినా, అందులో వివిధ జిల్లాలను గుర్తించారు. అందులో గ్రాడ్యుయేటింగ్‌ టు హై ఎచీవర్స్‌ విభాగంలో ఏపీలోని పశ్చిమగోదావరి, అనంతపురం జిల్లాలున్నాయి. గ్రాడ్యుయేటింగ్‌ టు పెర్ఫార్మర్స్‌ విభాగంలో శ్రీకాకుళం జిల్లాకు స్థానం లభించింది. స్వచ్ఛ సర్వేక్షణ్‌ గ్రామీణ్‌ 2023లో భాగంగా అక్టోబరు 1 నుంచి నవంబరు 1 వరకు జిల్లాలు కనబరిచిన పనితీరు ఆధారంగా దేశంలోని వివిధ రాష్ట్రాల్లోని జిల్లాలకు 5, 4, 3, 2 స్టార్స్‌, ర్యాంకింగులు ప్రకటించగా ఇందులో ఏపీ, తెలంగాణ జిల్లాలకేమీ దక్కలేదు.


మరిన్ని