ఓటు పురాణం

‘హ్రీం... క్లీం... ష్రీం... హ్లీం...’
‘ఏమిట్రోయ్‌ మాంత్రికుడిలా ఆ ఊగిపోవడాలేమిటి... మతిగానీ చెడిందా?’

‘రోజురోజుకీ విలువల వలువలు వదిలేస్తున్న ఈ రాజకీయ నాయకులను చూస్తుంటే గుండెకాయ గొంతులో ఇరుక్కున్నంతగా ఉక్కిరిబిక్కిరి అయిపోతున్నాను మావా. మంత్రాలకు చింతకాయలేమైనా రాలి మళ్ళీ మంచిరోజులు వస్తాయనే ఆశతో...’
‘నీ తెలివి తెల్లారినట్టే ఉంది. అడవి అన్నాక ఆకులు, రాజకీయాలన్నాక కుళ్లు మామూలే కదా! అయినా మన ప్రజాస్వామ్యం పున్నమినాటి చంద్రుడిలా వెలిగిపోతోందని దేశదేశాలన్నీ మనల్ని స్తుతించడం లేదూ. ఆ మెచ్చుకోలు ముచ్చట్లు వింటూ మురిసిపోవాలిగానీ, ఈ ఏడుపుగొట్టు మాటలు ఎందుకురా?’

‘నెలనెలా ఠంఛనుగా జీతమందుకొనే చట్టసభల సభ్యుడివి... నీకంతా బాగానే ఉంటుంది. మాబోటి సామాన్యుల తిప్పలు నీకేం తెలుసు. ఇంతకీ ప్రజాస్వామ్యం అనే పదం వాడేశావు కాబట్టి, దానికి నిర్వచనమేమిటో సెలవివ్వు’
‘ఈమాత్రం తెలియని వెర్రిబాగుల వాడివేమిట్రా! ప్రజల చేత ప్రజల కోసం ప్రజలే ఎన్నుకొనే ప్రభుత్వ విధానమే ప్రజాస్వామ్యమని అప్పుడెప్పుడో అబ్రహాం లింకన్‌ చెప్పాడు కదా’
‘అంటే ప్రజల చేతుల్లోనే పవరుందంటావు. మరి దాన్ని ఒడుపుగా వాడేదెలాగో చెప్పవచ్చుగా’

‘ప్రజాస్వామ్యంలో ఓటేరా గొప్ప ఆయుధం. దాంతో నచ్చని నేతల్ని గోతిలోకి తోసేయవచ్చు. పార్టీల జాతకాల్ని తారుమారు చేసేయవచ్చు’

‘నీ ఓటు పురాణం వినసొంపుగానే ఉన్నా... ఆచరణలో దాంతో ఆవగింజంతైనా ఫలితం లేదన్నది నా ప్రగాఢ నమ్మకం. ఓ పార్టీనో, అభ్యర్థినో చూసి ఓటేసి గెలిపిస్తామా... పదవీకాలం ముగియకముందే ఆ మహానుభావుడు పక్క పార్టీలోకి గెంతుతాడు. అదృష్టం కలిసి వస్తే అమాత్యుడైపోయినా ఆశ్చర్యం లేదు. అంటే నమ్మి ఓట్లేసిన జనం నెత్తిన అతగాడు కుచ్చుటోపీ పెట్టినట్టే కదా. ఇక పదవి రాలేదనో, పక్కవాడికి వచ్చిందనో, అధిష్ఠానం పట్టించుకోలేదనో, సవాళ్లు విసురుతూ... వెకిలి పౌరుషాలు ప్రదర్శిస్తూ- ఈమధ్య రాజీనామా చేసేవాళ్ల సంఖ్యా పెరుగుతోంది కదా. దానివల్ల మళ్ళీమళ్ళీ ఎన్నికలు నిర్వహించడం అంటే ఎంత ఖర్చు, ఎంత ప్రయాస? అదంతా ఎవడబ్బ సొమ్మని? ఈ గతి తప్పిన నాయకుల చేష్టలను అలా చూస్తుండటమే తప్ప... ముకుతాడు వేసే మార్గం లేదా?’

‘ఈ విశాల భారతంలో ఒకటీ అరా అలాంటి చేదు సంఘటనలు సహజం. కేవలం వాటిని చూసి ఏదో జరిగిపోతోందని గుండెలు బాదుకొని ఏం లాభం?’

‘చిన్నాచితకా అని సన్నాయి నొక్కులు నొక్కవద్దు మావా. జాబితా తీస్తే సిగ్గుతో చితికిపోవాలి. చట్టసభల్లోనే నీలి చిత్రాలు చూసే నీతి తప్పిన నేతాశ్రీలు... ధనం తీసుకొని మరీ కార్పొరేట్‌ సంస్థల కోసం ప్రశ్నలడిగే ప్రబుద్ధులు... సభల్లో చిల్లర రౌడీలను తలపించేలా పోరాటాలు... ఇలాంటి లీలలు రోజూ కథలుగా వింటూనే ఉన్నాం కదా. వారిలో ఒక్కరి పదవి అయినా ఊడిపోయిందా? అంతెందుకు... ఎన్నికల్లో గెలిస్తే ఫలానా హామీలను నెరవేరుస్తానని సొంతంగా అచ్చేసిన మేనిఫెస్టోను పదవి అలంకరించగానే చిత్తుకాగితంలా మార్చేస్తుంటే మనం ఎవరినైనా నిలదీశామా... మాట తప్పినవారి కిరీటం పడిపోయిందా? ఇవన్నీ చూస్తూనే ఇంకా ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతోందని డాంబికాలు పోవడం విడ్డూరం’

‘నువ్వు ఎన్నైనా చెప్పరా... జనానికి కాస్తైనా రక్షణ దక్కుతోందంటే ఈ ప్రజాస్వామ్యంలోనే. అవినీతిపరులకు శిక్షలు పడేది ఈ ప్రజాస్వామ్యంతోనే’ ‘అవునవును... మహబాగా సెలవిచ్చావు. అయ్యవారు అపర మేతాశ్రీ అయినా, అడ్డమైన పనులు చేసి గడ్డితిన్నా సభాధిపతి అనుమతి లేకుండా వాళ్లకు సంకెళ్లు వేయకూడదట. పదులు, వందల కేసుల భారం మోస్తున్నా... నిరూపితం కానంతవరకు నిక్షేపంగా చట్టసభలకు వెళ్ళి రాచమర్యాదలు పొందవచ్చట. ఇక జనం సంగతంటావా... సర్కారు తప్పులను ఎంచితే దేశద్రోహి. భూమి పోయిన బక్క రైతు పరిహారం కోసం రోడ్డెక్కితే చావబాది సంకెళ్లు వేస్తారు. అవినీతిపరులకు అందలాలు... అమాయకులకు అరదండాలు’ ‘నీ వాదనలో న్యాయం ఉందనిపిస్తోందిరా. కానీ, పురుగు సోకిందని పంటను తగలబెట్టుకోలేం కదా. పోనీ ఇంతకుమించిన ప్రత్యామ్నాయం ఏదైనా ఉందా? ప్రజాస్వామ్యానికి పాతరేసి ఏ రాచరికమో కావాలంటావా? లేదా అధికారమంతా గుప్పిట బంధించిన ఓ నియంత ఊడిపడి జనం నెత్తిన తైతక్కలాడాలంటావా?’
‘ఛఛ... అలాంటి కోరికలు నాకెందుకుంటాయి మావా. ఆ మాటకొస్తే నేనూ ప్రజాస్వామ్య పిపాసినే. ఇప్పుడున్న పరిస్థితి మారాలంటాను. ఓటు ఆయుధం కాకపోయినా ఫరవాలేదు... ఓటుతో నేతలకు ఇస్తున్న అధికారం మన పాలిట మారణాయుధం కావద్దంటాను. ప్రజాస్వామ్యాన్ని నమ్మిన జనానికి తమను తాము అమ్ముకొనే పరిస్థితి రావద్దంటాను. జనం చేతిలో పవర్‌ లేకపోయినా ఫరవాలేదు... అధికారం ఉన్నవాడు వారిని పీడించకుండా ఉండాలంటాను’

‘మంచి మాట చెప్పావురా. 75 ఏళ్ల ఈ స్వతంత్ర జెండా పండగ వేళ సామాన్యుడి ఆవేదనను నాయకులు ఆలకించాలనే ఆశిద్దాం’

- శ్రీనివాస్‌ బాలె


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని