రక్తదాతకు వందనం!

‘గోవా బ్లడ్‌మ్యాన్‌’ సుదేశ్‌ అరుదైన ఘనత

పణజీ: రక్తదాతల్లో మేటిగా నిలుస్తూ.. గోవాకు చెందిన సుదేశ్‌ రమాకాంత్‌ నార్వేకర్‌ అరుదైన మైలురాయిని సాధించి ఎందరికో స్ఫూర్తినిస్తున్నారు. గతవారం 100వ సారి రక్తదానం చేసిన ఆయన ఇంతవరకు వేలాది మంది ప్రాణాలు కాపాడటంలో కీలకంగా నిలిచారు. ‘గోవా బ్లడ్‌మ్యాన్‌’గా పేరొందిన సుదేశ్‌ (51) గత 33 ఏళ్లుగా రక్తదానం చేస్తున్నారు. దక్షిణ గోవాలోని పోండా పట్టణానికి చెందిన ఆయన తన 18వ ఏట తొలిసారి రక్తదానం చేశారు. అప్పట్లో ప్రమాదం బారినపడి గోవా వైద్య కళాశాల ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఓ వ్యక్తి ప్రాణాలు కాపాడేందుకు రక్తదానం చేశారు. ‘‘అత్యవసర పరిస్థితుల్లో ఉన్నవారికి రక్తం ఎంత అవసరమో అప్పుడే నాకు అర్థమైంది’’ అని సుదేశ్‌ ‘పీటీఐ’కి తెలిపారు. నాటినుంచి ఆయన ఇదేరీతిలో నిస్వార్థంగా సేవలందిస్తూనే ఉన్నారు. 2019లో 10మంది స్నేహితులతో కలిసి సార్థక్‌ పేరుతో ఓ స్వచ్ఛంద సంస్థను ప్రారంభించిన ఆయన దీనిద్వారా కూడా గోవా రాష్ట్రమంతటా రక్తదాన శిబిరాలను నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ సంస్థ కోసం పలువురు వైద్యులతో కూడిన 30 మంది బృందం పనిచేస్తోంది. సుదేశ్‌ ప్రారంభంలో రెండేళ్ల పాటు సంవత్సరానికి రెండు సార్లు రక్తదానం చేసేవారు. అనంతరం ఎప్పుడు వీలయితే అప్పుడు రక్తదానం చేస్తూ వస్తున్నారు. ఇంతవరకు 130 శిబిరాలను కూడా నిర్వహించారు. గోవాలోనే కాకుండా బెంగళూరు, పుణె, హుబ్బళ్లి, బెళగావి తదితర ప్రాంతాల్లో కూడా అవసరాల్లో ఉన్నవారికి రక్తం అందిస్తున్నారు. ‘‘గోవాలో 100 సార్లు రక్తదానం చేసిన ఏకైక వ్యక్తి సుదేశ్‌. దేశంలో కూడా ఇది అరుదైన ఘనతే..’’ అని ఇండియన్‌ రెడ్‌క్రాస్‌ ప్రధాన కార్యదర్శి సుభాష్‌ సాల్కర్‌ తెలిపారు.


మరిన్ని