Picnic: ఒక్కసారిగా వరద.. కొట్టుకుపోయిన 14 కార్లు..

భోపాల్‌: ఉన్నట్టుండి నది ప్రవాహం పెరిగిపోవడంతో ప్రాణాలు కాపాడుకునేందుకు పర్యాటకులు పరుగులు పెట్టారు. వరద ఉద్ధృతికి అక్కడ పార్క్‌ చేసి ఉంచిన 14 కార్లు కొట్టుకుపోయాయి. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని ఖర్గోన్‌ ప్రాంతంలో జరిగింది. ఇండోర్‌ జిల్లాకు చెందిన దాదాపు 50 మంది పర్యాటకులు కట్కూర్‌ అటవీ ప్రాంతంలోని సుక్డీ నది పరివాహక ప్రాంతానికి విహారయాత్రకు వెళ్లారు. వారంతా అక్కడి ప్రకృతి అందాలను వీక్షిస్తుండగా.. ఒక్కసారిగా నది ప్రవాహం పెరిగిపోయింది. దీన్ని గమనించిన పర్యాటకులు ప్రాణభయంతో కొద్దిదూరంలో ఎత్తుగా ఉన్న ప్రాంతానికి పరుగులు తీశారు. వీరిలో మహిళలు, చిన్నారులు కూడా ఉన్నారు.

అయితే, అదృష్టవశాత్తూ ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు. కానీ వారు పార్క్‌ చేసి ఉంచిన 14 కార్లు ఆ వరద ఉద్ధృతికి కొట్టుకుపోయాయి. వాటిల్లో ఖరీదైన ఎస్‌యూవీ కార్లు కూడా ఉన్నాయి. ఈ విషయాన్ని వారు పోలీసులకు తెలియజేశారు. ఆ కార్లను స్థానిక గ్రామస్థుల సాయంతో వెతుకుతున్నట్లు ఏఎస్‌పీ జితేంద్రసింగ్‌ పవార్‌ వెల్లడించారు. వాటిల్లో కొన్ని కార్లను గుర్తించామని, వెలికితీసే ప్రయత్నాలు చేస్తున్నామని ఆయన తెలిపారు.


మరిన్ని

ap-districts
ts-districts