Shashi Tharoor: విదేశీ పార్లమెంట్‌లలోనే ప్రధాని ఎక్కువగా మాట్లాడతారు: శశిథరూర్‌

ఇంటర్నెట్‌ డెస్క్‌: పార్లమెంటు సమావేశాల్లో ప్రధాని నరేంద్ర మోదీ గైర్హాజరుపై కాంగ్రెస్‌ ఎంపీ శశిథరూర్‌ వ్యంగ్యోక్తులు విసిరారు. మన పార్లమెంటులోకన్నా విదేశీ పార్లమెంట్‌లలోనే మోదీ ఎక్కువగా మాట్లడతారని ఎద్దేవా చేశారు. ఓ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో శశిథరూర్ ఈ మేరకు వ్యాఖ్యానించారు. ప్రజాస్వామ్యం, ప్రజాస్వామ్య సంస్థలు, భావప్రకటనా స్వేచ్ఛకు సంబంధించిన అంశాల్లో దేశ తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ, ప్రస్తుత ప్రధాని మోదీల పనితీరును ఆయన ఈ సందర్భంగా పోల్చారు. నెహ్రూకు విరుద్ధంగా ప్రధాని మోదీ.. ఇక్కడి పార్లమెంటులోకంటే విదేశీ పార్లమెంట్‌లలోనే ఎక్కువ ప్రసంగాలు చేశారన్నారు.

1962లో జరిగిన భారత్‌- చైనా యుద్ధాన్ని గుర్తుచేస్తూ.. ఆ సమయంలో అప్పటి ప్రధాని నెహ్రూ పార్లమెంట్‌ సమావేశాన్ని ఏర్పాటు చేసి, సంబంధిత సమస్యలపై చర్చించారని తెలిపారు. నేడు భారత్‌- చైనాల మధ్య సరిహద్దు సమస్యలపై ప్రశ్నించడానికి కూడా వీల్లేని పరిస్థితి ఉందన్నారు. ముఖ్యంగా గల్వాన్‌ లోయలో ఏం జరుగుతోందో తెలుసుకునే అవకాశం కూడా లేకపోయిందని విమర్శించారు. అక్కడ జరిగిన ఘర్షణల్లో 20 మంది భారతీయ సైనికులు ప్రాణాలు కోల్పోయినప్పటికీ.. భారత్, చైనా సమస్యలపై లోక్‌సభ, రాజ్యసభల్లో చర్చ జరగలేదని పేర్కొన్నారు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని