Stock Market: మళ్లీ నష్టాల్లోకి జారుకున్న స్టాక్‌ మార్కెట్‌ సూచీలు

ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు సోమవారం మళ్లీ భారీ నష్టాల్లోకి జారుకున్నాయి. వరుసగా ఏడు సెషన్ల నష్టాల నుంచి శుక్రవారం భారీ లాభాలతో విరామం తీసుకున్న మార్కెట్లు తిరిగి నేడు నష్టాల్లోకి పడిపోవడం గమనార్హం. ఉదయం స్వల్ప నష్టాలతో ట్రేడింగ్‌ ప్రారంభించిన సూచీలు చివరకు భారీ నష్టాలతో ముగిశాయి. ఇంట్రాడేలో ఏ దశలోనూ కొనుగోళ్ల మద్దతు లభించలేదు. ఆర్‌బీఐ రెపోరేటు పెంపు ఆశించిన స్థాయిలోనే ఉండడంతో శుక్రవారం వచ్చిన ర్యాలీకి నేడు కొత్త సానుకూలతలేవీ జతకాలేదు. పైగా ఇటీవల కనిష్ఠాల నుంచి ముడి చమురు ధరలు దాదాపు 4 శాతం పెరగడం మదుపర్ల ఆందోళనకు కారణమైంది. మరోవైపు ఇప్పటికే అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థలో ఉన్న అస్థిరతల నేపథ్యంలో మదుపర్లు అప్రమత్తత పాటించారు. దీనికి అంతర్జాతీయ మార్కెట్లలోని ప్రతికూలతలు కూడా జతయ్యాయి.

సెన్సెక్స్‌ ఉదయం 57,403.92 పాయింట్ల వద్ద నష్టాలతో ప్రారంభమైంది. ఇంట్రాడే ట్రేడింగ్‌లో 56,683.40 పాయింట్ల వద్ద కనిష్ఠాన్ని తాకింది. చివరకు 638.11 పాయింట్ల నష్టంతో 56,788.81 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 207 పాయింట్లు కోల్పోయి 16,887.35 దగ్గర స్థిరపడింది. ఇంట్రాడేలో ఈ సూచీ 17,114.65- 16,855.55 పాయింట్ల మధ్య కదలాడింది.

సెన్సెక్స్‌ 30 షేర్లలో మూడు మాత్రమే లాభపడ్డాయి. డాక్టర్‌ రెడ్డీస్‌, ఎన్‌టీపీసీ, భారతీ ఎయిర్‌టెల్‌ లాభాల్లో ముగిశాయి. మారుతీ, హెచ్‌యూఎల్‌, ఇండస్ఇండ్‌ బ్యాంక్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, ఎస్‌బీఐ, ఐటీసీ, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, కొటాక్‌ మహీంద్రా బ్యాంక్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, ఎల్‌అండ్‌టీ, యాక్సిస్‌ బ్యాంక్‌, ఎంఅండ్‌ఎం షేర్లు నష్టపోయిన జాబితాలో ఉన్నాయి.

మార్కెట్‌లోని ఇతర సంగతులు..

ఉదయం లాభాలతో ప్రారంభమైన ఐషర్‌ మోటార్స్‌ షేర్లు కాసేపటికే నష్టాల్లోకి జారుకున్నాయి. ఇంట్రాడే గరిష్ఠాల నుంచి దాదాపు 9 శాతం కుంగాయి. చివరకు 5.38 శాతం నష్టంతో రూ.3,474 వద్ద స్థిరపడ్డాయి.

అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ షేరు వరుసగా ఏడోరోజూ కుంగింది. గత ఏడు రోజుల్లో ఈ స్టాక్‌ 12 శాతానికి పైగా నష్టపోయింది. చివరకు ఈరోజు 8.42 శాతం దిగజారి రూ.3,164.75 వద్ద ముగిసింది.

నైకా షేరు ఇంట్రాడేలో 11 శాతానికి పైగా లాభపడింది. చివరకు 2.55 శాతం లాభంతో రూ.1,304.55 వద్ద స్థిరపడింది. 5:1 నిష్పత్తిలో బోనస్‌ షేర్ల జారీకి కంపెనీ బోర్డు ఆమోదం తెలిపింది. దీనికి ఈరోజుతో రికార్డు తేదీ ముగిసింది.


మరిన్ని