IND vs ZIM : కుర్రాళ్ల కోసం ఎప్పుడూ సిద్ధం

హరారె: యువ క్రికెటర్లకు అనుభవాన్ని పంచడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటానని భారత సీనియర్‌ క్రికెటర్‌ శిఖర్‌ ధావన్‌ అన్నాడు. ‘‘భారత జట్టులో యువ ఆటగాళ్లకు అనుభవాన్ని పంచడానికి సిద్ధంగా ఉంటా. ఆటలో ఏదైనా అనుమానాలు ఉంటే తీరుస్తా. ప్రస్తుతం కుర్రాళ్లకు ఎక్కువ అవకాశాలు దక్కుతున్నాయి. ఐపీఎల్‌, దేశవాళీ టోర్నీల వల్ల వాళ్ల ఆత్మవిశ్వాసం ఎంతో పెరుగుతోంది. టీమ్‌ఇండియాకు ప్రత్యామ్నాయాలు పెరుగుతున్నాయి. ఇదో మంచి పరిణామం. రాహుల్‌ తిరిగి జట్టులోకి రావడం సంతోషంగా ఉంది. ఆసియాకప్‌కు ముందు జింబాబ్వే సిరీస్‌ కేఎల్‌కు మంచి సన్నాహకం. ఈ పర్యటనలో అతడు సత్తా చాటుతాడని భావిస్తున్నా. గాయం కారణంగా సుందర్‌ అందుబాటులో లేకుండా పోయినా కుల్‌దీప్‌ యాదవ్‌, దీపక్‌ హుడా రూపంలో ఇద్దరు ఆఫ్‌ స్పిన్నర్లు జట్టులో ఉన్నారు’’ అని ధావన్‌ అన్నాడు. ఇటీవల బంగ్లాదేశ్‌పై గెలిచిన జింబాబ్వేను భారత్‌ తేలిగ్గా తీసుకోవద్దని శిఖర్‌ పేర్కొన్నాడు. ‘‘ప్రస్తుతం ఆ జట్టు జోరు మీద ఉంది. వారిని తేలిగ్గా తీసుకోకూడదు. బంగ్లాదేశ్‌పై జింబాబ్వే సిరీస్‌ గెలిచింది. సికిందర్‌ రజా లాంటి ప్రతిభావంతులు ఆ జట్టులో ఉన్నారు’’ అని ధావన్‌ అన్నాడు. జింబాబ్వేతో మూడు వన్డేల సిరీస్‌కు సెలెక్టర్లు.. ధావన్‌ను మొదట కెప్టెన్‌గా ప్రకటించినా.. రాహుల్‌ ఫిట్‌నెస్‌ సాధించడంతో అతడికి పగ్గాలు అప్పజెప్పారు. ఈ సిరీస్‌లో తొలి మ్యాచ్‌ ఈనెల 18న జరగనుంది.


మరిన్ని

ap-districts
ts-districts