భారత వన్డే జట్టులో కుల్‌దీప్‌ సేన్‌, షాబాజ్‌

దిల్లీ: మెకాలి గాయం నుంచి ఇంకా పూర్తిగా కోలుకోని ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా వచ్చే నెల బంగ్లాదేశ్‌తో మూడు వన్డేల సిరీస్‌కు దూరమయ్యాడు. ఎడమచేతి వాటం మీడియం పేసర్‌ యశ్‌ దయాళ్‌ కూడా గాయంతో సిరీస్‌ నుంచి వైదొలిగాడు. వీళ్ల స్థానాల్లో ఆల్‌రౌండర్‌ షాబాజ్‌ అహ్మద్‌, ఫాస్ట్‌బౌలర్‌ కుల్‌దీప్‌ సేన్‌ జట్టులోకి వచ్చారు. కుల్‌దీప్‌, షాబాజ్‌లు మొదట న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌కు ఎంపికయ్యారు. కానీ వాళ్లిప్పుడు బంగ్లా పర్యటనకు వెళ్తారు. వాళ్ల స్థానాల్లో కివీస్‌తో వన్డేలకు ఎవరినీ ఎంపిక చేయలేదు.

మూడో వన్డే వేదిక మార్పు: వచ్చే నెలలో భారత్‌తో ఢాకాలో జరగాల్సిన మూడో వన్డేను బంగ్లాదేశ్‌ క్రికెట్‌ బోర్డు చిట్టగాంగ్‌కు తరలించింది. డిసెంబరులో వన్డే సిరీస్‌తో బంగ్లాలో భారత పర్యటన మొదలవుతుంది. డిసెంబరు 4న ఢాకాలో తొలి వన్డే జరుగుతుంది. షెడ్యూలు ప్రకారం అన్ని వన్డేలూ అక్కడే నిర్వహించాల్సివుంది. కానీ డిసెంబరు 10న మూడో వన్డే జరగాల్సివుండగా.. అదే రోజు బంగ్లాదేశ్‌ ప్రతిపక్షాలు నిరసనలకు పిలుపునిచ్చాయి. దీంతో ఆఖరి వన్డే వేదికను మార్చారు.


మరిన్ని

ap-districts
ts-districts