ఆగని ఉల్లంఘనలు

రాష్ట్రంలో పలుచోట్ల ఎడాపెడా అక్రమ మైనింగ్‌

నూతన నిబంధనలకు తూట్లు

పాత అనుమతుల పేరుతో యథేచ్ఛగా తవ్వకాలు

ఈనాడు - హైదరాబాద్‌

గనుల తవ్వకాల్లో పలువురు లీజుదార్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. దశాబ్దాల క్రితం తీసుకున్న మైనింగ్‌ అనుమతి గడువు ముగిసినా.. వాటిని ఇంకా తమ గుప్పిట్లోనే పెట్టుకుంటున్నారు. 2012 నోటిఫికేషన్‌ నిబంధనల మేరకు  పర్యావరణ అనుమతులు తీసుకోవాల్సి ఉండగా.. అవేవీ లేకుండానే తవ్వకాలు కొనసాగిస్తూ దండుకుంటున్నారు. ఇలాంటివారు రెన్యువల్‌ కోసం మొక్కుబడిగా ఓ దరఖాస్తు పెట్టి.. పర్యావరణ అనుమతులు రాకున్నా అధికారుల పరోక్ష సహకారంతో రెండు మూడేళ్లు తవ్వకాలు సాగించినట్లు తాజాగా వెల్లడైంది. రాష్ట్రంలో గ్రానైట్‌, రోడ్‌మెటల్‌, బిల్డింగ్‌స్టోన్‌ గనుల విషయంలో అక్రమాలు అధికంగా జరుగుతున్నాయి. ప్రధానంగా రంగారెడ్డి, మేడ్చల్‌-మల్కాజిగిరి, నల్గొండ, యాదాద్రి, సిరిసిల్ల, ఖమ్మం, కామారెడ్డి, నాగర్‌కర్నూల్‌, సంగారెడ్డి జిల్లాల్లో ఈ ఉల్లంఘనలు ఎక్కువగా ఉన్నాయి. గత రెండు నెలల్లో 58 చోట్ల మైనింగ్‌ నిలిపివేతకు ఆదేశాలు వెలువడ్డాయి.

* స్టేట్‌ ఎన్విరాన్‌మెంట్‌ ఇంపాక్ట్‌ అసెస్‌మెంట్‌ అథారిటీ (ఎస్‌ఈఐఏఏ).. పర్యావరణ అనుమతుల కోసం వచ్చిన దరఖాస్తులపై జూన్‌ నెలలో చేసిన పరిశీలనలో 38 చోట్ల అనుమతుల్లేకుండా అక్రమ మైనింగ్‌ జరుగుతున్నట్లు గుర్తించింది. అనుమతులు వచ్చేవరకు మైనింగ్‌ నిలిపివేయాలని ఆయా పాత లీజుదారుల్ని ఆదేశించింది. లీజు విస్తీర్ణాన్ని బట్టి కొన్నింటికి ప్రజాభిప్రాయసేకరణ లేకుండా, మరికొన్నింటికి ప్రజాభిప్రాయసేకరణతో పర్యావరణ అనుమతులు తీసుకోవాలని స్పష్టం చేసింది.
* జులై నెల దరఖాస్తుల పరిశీలనలో 20 చోట్ల అనుమతులు లేకుండా అక్రమ మైనింగ్‌ జరుగుతున్నట్లు అథారిటీ గుర్తించింది. మైనింగ్‌ నిలిపివేయాలని ఆదేశించింది.
* నల్గొండ జిల్లా వలిగొండ మండలం కాసమ్మకుంటలో బ్లాక్‌గ్రానైట్‌ తవ్వకాలకు ఓ దరఖాస్తు రాగా.. చెరువుకు 11 మీటర్ల దూరంలోనే ప్రతిపాదిత మైనింగ్‌ ప్రాంతం ఉండటంతో తిరస్కరించింది.

పట్టించుకోని అధికారులు

గనుల తవ్వకాలు పెరగడం, నిబంధనలు పాటించకపోతుండడంతో చుట్టుపక్కల నీటి వనరులు, నివాస ప్రాంతాలు, పంటపొలాలపై ప్రభావం పడుతోంది. గాలి, నీరు కలుషితమవుతున్నాయి. ధ్వని కాలుష్యమూ తలెత్తుతోంది. పర్యావరణ ప్రభావ అంచనా (ఈఐఏ) నోటిఫికేషన్‌ 1994 ప్రకారం 5 హెక్టార్ల విస్తీర్ణం పైబడిన మేజర్‌ మినరల్స్‌ (పెద్ద ఖనిజాలు) గనులకే పర్యావరణ అనుమతులు అవసరం. ఈఐఏ-2006 ప్రకటనలో 5 హెక్టార్ల విస్తీర్ణానికి మించిన గనుల్లో చిన్న ఖనిజాలకూ పర్యావరణ అనుమతులు తప్పనిసరి చేశారు. 2012లో పెద్ద, చిన్న ఖనిజాలనే తేడా లేకుండా.. విస్తీర్ణంతో నిమిత్తం లేకుండా అన్నింటికీ పర్యావరణ అనుమతులు తప్పనిసరి చేశారు. పాత లీజులకు మాత్రం గడువు ముగిసి రెన్యువల్‌కు వచ్చినప్పుడు 2012 నిబంధనలు వర్తిస్తాయని కేంద్రం తెలిపింది. రెన్యువల్‌ సమయంలో పర్యావరణ అనుమతులు విధిగా తీసుకోవాలని స్పష్టం చేసింది.

లీజు ముగిసిన గనుల్లో.. రెన్యువల్‌ కానిచోట్ల మళ్లీ తవ్వకాలు జరగకుండా గనులశాఖ అధికారులు చూడాలి. కానీ వారి పరోక్ష సహకారంతోనే గడువు ముగిసిన తర్వాత కూడా ఏళ్లతరబడి తవ్వకాలు జరిగినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని