
కాళేశ్వరంపై కొర్రీలే..కొర్రీలు
ఎంత నీరు ఎత్తిపోశారు? ఎంత ఆయకట్టుకు అందించారు?
ప్రాజెక్టును ప్రారంభించినప్పటి నుంచి ఎంత ఖర్చయింది?
పంపుహౌస్‌ల డిజైన్లూ పంపండి
రాష్ట్ర నీటిపారుదల శాఖకు కేంద్ర జలసంఘం లేఖ
ఈనాడు హైదరాబాద్: కాళేశ్వరం ఎత్తిపోతల పథకం నిర్వహణకు ఇప్పటివరకు ఎంత ఖర్చయిందన్న వివరాలతో పాటు ప్రతి సంవత్సరం ఏ పంపుహౌస్ నుంచి ఎంత నీటిని ఎత్తిపోసింది, ఎంత ఆయకట్టుకు నీటిని సరఫరా చేసిందన్న వివరాలను అందజేయాలని కేంద్ర జలసంఘం(సీడబ్ల్యూసీ) తెలంగాణ నీటిపారుదల శాఖను కోరింది. ఇటీవల వరదలకు పంపుహౌస్‌లు నీటమునిగిన నేపథ్యంలో వాటి డిజైన్లకు సంబంధించిన వివరాలనూ ఇవ్వాలని కోరింది. గతంలో రెండు టీఎంసీలకు కేంద్ర జలసంఘం సాంకేతిక సలహా కమిటీ ఆమోదం తెలపగా.. ఇటీవల అదనంగా మరో టీఎంసీ నీటిని ఎత్తిపోసేందుకు సంబంధించిన ప్రతిపాదనతో సవరించిన సమగ్ర ప్రాజెక్టు నివేదిక(డీపీఆర్)ను తెలంగాణ నీటిపారుదల శాఖ కేంద్ర జలసంఘానికి అందజేసింది. దీనిపై గత కొన్ని రోజులుగా ఉత్తర ప్రత్యుత్తరాలు జరుగుతున్నాయి. తాజాగా కేంద్ర జలసంఘం పలు కొర్రీలను లేవనెత్తింది. వాటికి సమాధానమివ్వాలని నీటిపారుదల శాఖకు లేఖ రాసింది. గోదావరిలో వరద వచ్చే రోజులు తగ్గినందువల్ల తక్కువ రోజుల్లో అవసరానికి తగ్గట్లుగా రోజుకు రెండు టీఎంసీలకు బదులు మూడు టీఎంసీలు ఎత్తిపోసేలా పథకంలో మార్పు చేశామని రాష్ట్రం నివేదించింది. మూడు టీఎంసీలను కొన్ని రోజులే ఎత్తిపోయడానికి అవకాశం ఉంటుందని, కొన్నిసార్లు ఒకటి నుంచి రెండు టీఎంసీలే ఉంటుందని తెలిపింది. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకొని మూడు టీఎంసీలు ఎత్తిపోసేలా మార్పు చేశాం తప్ప అదనంగా ఒక టీఎంసీని తీసుకోవడం గాని, అదనంగా ఒక ఎకరాకు నీరివ్వడం గాని లేదని స్పష్టంచేసింది. అయితే నదిలో 120 రోజుల పాటు వరద ఉంటుందని గతంలో వాప్కోస్ నివేదిక ఇచ్చిందని జలసంఘం పేర్కొన్నట్లు తెలిసింది.
కేంద్ర జలసంఘం తాజాగా కోరిన అంశాల్లో ముఖ్యమైనవి..
* ప్రాజెక్టు కింద 2టీఎంసీలు, అదనపు టీఎంసీ ద్వారా సాగులోకి వచ్చే కొత్త, స్థిరీకరణ ఆయకట్టుకు సంబంధించిన వివరాలను జీఐఎస్ మ్యాప్‌లు సహా అందజేయాలి.
* ఇటీవల వరదలకు పలు పంపుహౌస్‌లు నీటమునిగాయి. ఈ నేపథ్యంలో ప్రాజెక్టు మూడు టీఎంసీలకు సంబంధించిన డిటైల్డ్ డిజైన్లు, గోదావరిపై ఉన్న పంపుహౌస్‌ల సమగ్ర డ్రాయింగ్లు, పంపుహౌస్‌ల బే లెవల్, పూర్తిస్థాయి మట్టాలు.. ఇలా అన్ని వివరాలు పంపించాలి.
* నీటి లభ్యత, ఇరిగేషన్ ప్లానింగ్(ఖర్చు-ఫలితం నిష్పత్తి సహా) వేర్వేరు డీపీఆర్ చాప్టర్లు అందజేయాలి. అన్ని డీపీఆర్ చాప్టర్లు రెండు టీఎంసీలు, మరో టీఎంసీకి సంబంధించిన సమగ్ర వివరాలు ఉండాలి.
* ప్రాజెక్టును ప్రారంభించినప్పటి నుంచి ఏటా ఆపరేషన్, మెయింటెనెన్స్‌కు అయిన ఖర్చుల వివరాలు అందజేయాలి.
* ప్రతి సంవత్సరం ఏ పంపింగ్ స్టేషన్ నుంచి ఎంత నీటిని ఎత్తిపోశారు, నీరందిన ఆయకట్టు వివరాలు ఇవ్వాలి.
* తెలంగాణ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ యూనిట్ విద్యుత్తు ధరను రూ.మూడుకు ఆమోదించినట్లు 2018 మే 11న ఇరిగేషన్ ప్లానింగ్ డైరెక్టరేట్‌కు రాసిన లేఖలో పేర్కొన్నారు. ప్రస్తుతం యూనిట్ విద్యుత్తు ధర ఎంత, ప్రాజెక్టు ప్రారంభించినప్పటి నుంచి సరాసరి ధర ఎంతో వివరాలు పంపించాలి. దీర్ఘకాలంలో ప్రాజెక్టు ఫైనాన్షియల్ వయబులిటీ, సస్టెయినబులిటీ సమర్థించుకొనేలా వివరాలు, ప్రాజెక్టు రెవెన్యూ మోడల్‌కు సంబంధించిన వివరాలు అందించాలి.
* ఇప్పటివరకైనఖర్చు, బ్యాంకులనుంచి తీసుకున్న రుణాలు, చెల్లించే వడ్డీలకు సంబంధించిన వివరాలు తెలపాలి.
* మొత్తం ఎన్ని పంపులున్నాయి, ఒక్కో పంపు ధర, వాటి సామర్థ్యం, కంపెనీల వివరాలు అందించాలి.
* ప్రాజెక్టు నిర్మాణ వ్యయం పెరిగినప్పటికీ 2018 జూన్‌లో బి.సి.(ప్రయోజనం-ఖర్చు) నిష్పత్తి 1.51 ఉండగా ఇప్పుడు 1.542కు ఎలా పెరిగిందో చెప్పాలి. అదనపు పరికరాలు పెరిగాయి తప్ప ఆయకట్టు పెరగలేదు.
* ప్రాజెక్టు పరిధిలో 20 ఆన్లైన్ రిజర్వాయర్లు 0.09 టీఎంసీ నుంచి 50 టీఎంసీల వరకు మొత్తం 147.71 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో ఉన్నాయి. అయితే మల్లన్నసాగర్, గంధమల్ల, బస్వాపూర్ రిజర్వాయర్లతో పోల్చితే గోదావరిపై ఉన్న మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల చిన్నవి. ప్రధాన గోదావరిపై పెద్ద రిజర్వాయర్లు నిర్మించి వివిధ ప్రాంతాలకు నీటిని ఎందుకు మళ్లించలేదు. మేడిగడ్డకు దూరంగా మల్లన్నసాగర్, బస్వాపూర్ లాంటి రిజర్వాయర్ల వల్ల నిర్మాణం వ్యయం పెరగడంతోపాటు భూమిని కూడా సేకరించాల్సి వచ్చింది. ఇలా ఎందుకు చేశారో తెలపాలి.
* వివిధ పనులకు ఇచ్చిన టెండర్లు, వాటి విలువ, చేయాల్సిన పని తదితర వివరాలను సమగ్రంగా ఇవ్వాలి.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Crime News
Andhra News: ఇంజినీరింగ్ విద్యార్థి ఆత్మహత్య.. ఘటనాస్థలానికి వెళ్లిన వార్డెన్ హఠాన్మరణం
-
General News
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
-
Sports News
PV Sindhu: ఆ స్వర్ణం కోసం అయిదేళ్లు ఎదురుచూశా: పీవీ సింధు
-
Politics News
YSRCP: ప్రతి ఇంటికీ జగన్ స్టిక్కర్!
-
Crime News
సహజీవనం చేస్తూ హతమార్చాడు: తల్లీకుమార్తెలను గునపంతో కొట్టి చంపిన ప్రియుడు
-
Sports News
Sunil Gavaskar: బ్రిస్బేన్ పిచ్ గురించి మాట్లాడరేం?