రూ.35 కోట్లు.. 300 మెట్రిక్‌ టన్నులు

బియ్యం నిల్వలు పక్కదారి

కోదాడ గ్రామీణం, న్యూస్‌టుడే: గత మూడు సీజన్ల నుంచి ప్రభుత్వానికి చెల్లించాల్సిన సుమారు 300 మెట్రిక్‌ టన్నుల సీఎంఆర్‌ (కస్టమ్‌ మిల్లింగ్‌ రైస్‌) బకాయిలు చెల్లించకుండా ధాన్యం నిల్వలు పక్కదారి పట్టిన ఘటన సూర్యాపేట జిల్లా కోదాడ మండల పరిధిలో కాపుగల్లులోని శ్రీ ఉషశ్విని రైస్‌ మిల్లులో చోటుచేసుకుంది. సీఎంఆర్‌ బకాయిలు చెల్లించాలని అధికారులు ఒత్తిడి తేవడంతో యజమానులు మిల్లుకు తాళాలు వేసి పరారయ్యారు. బుధవారం జిల్లా పౌర సరఫరాల అధికారులు బియ్యం నిల్వలు తనిఖీ చేసేందుకు మిల్లుకు వెళ్లగా ప్రభుత్వానికి అందించాల్సిన రూ. 35 కోట్ల విలువైన బియ్యం నిల్వలు కనిపించలేదు. బకాయిలు చెల్లించకుంటే సదరు మిల్లు యజమానులపై రెవెన్యూ రికవరీ చట్టం ప్రకారం క్రిమినల్‌ కేసులు నమోదు చేసి ఆస్తులను జప్తు చేస్తామని ఇన్‌ఛార్జి డీఎస్వో పుల్లయ్య తెలిపారు. విశ్వసనీయ సమాచారం మేరకు మిల్లు యాజమాన్యం కొనుగోలు కేంద్రాల నుంచి వచ్చిన నాణ్యమైన ధాన్యాన్ని అధిక ధరకు విక్రయించిందని.. తమిళనాడు, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే నాసిరకమైన ధాన్యాన్ని కొనుగోలు చేసి ప్రభుత్వానికి పంపిణీ చేసిందని తెలిసింది. ఈ విషయంపై కలెక్టర్‌ ఆగ్రహం వ్యక్తం చేయడంతో పౌర సరఫరాల అధికారులు హుటాహుటిన తనిఖీలు నిర్వహించారు.


మరిన్ని