close

వసుంధర

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share
కడుపుతో ఉన్నారా..కథ వినండి!

‘అనగనగా ఒక రాజు.. ఆ రాజుకు ఏడుగురు భార్యలు...’ ఇలాంటి కమ్మని కథలను అంగన్‌వాడీ కార్యకర్త చెబుతూ ఉంటే కాబోయే అమ్మలందరూ శ్రద్ధగా వింటూ ‘ఊ’ కొడుతున్నారు. అంగన్‌వాడీ కేంద్రాల్లో పిల్లలకు కదా కథలు చెప్పేది... ఇక్కడ కాబోయే అమ్మలకు చెబుతున్నారేంటనే సందేహం మీకు వచ్చే ఉంటుంది. అక్కడికే వస్తున్నాం..

నెల రోజుల క్రితం అక్కడి మహిళలకు ధ్యానం అంటే ఏంటో తెలీదు. ఇప్పుడు హాయిగా శ్వాసపై ధ్యాస పెడుతూ చక్కని పాపాయికి జన్మనివ్వాలని అనుకుంటున్నారు ఆ మండంలోని గర్భిణులు. మహబూబ్‌నగర్‌ జిల్లా భూత్పూరు మండలంలో జరుగుతున్న చిత్రాలివి. ఇలా ఎందుకు చేస్తున్నారో తెలుసా!

మనిషి జీవనశైలి మారింది. ఉరుకులు పరుగుల జీవితం. ఒత్తిడి, కోపం, ద్వేషం, అసూయ, ఆందోళన అందరినీ వేధిస్తున్నాయి. సగటు మనిషికి ఇవి ఎదురైతే ఫరవాలేదు. అదే ఒక గర్భిణి వీటితో సతమతమయిందనుకోండి! పుట్టబోయే బిడ్డ బరువు తక్కువగా ఉండటం, నెలలు నిండకముందే జన్మించడం, మెదడు లాంటి ముఖ్య అవయవాల ఎదుగుదల లోపించడం వంటివి జరుగుతాయి. వీరికి బీపీ సాధారణ స్థితిలో ఉండకపోవడం, మూర్చ రావడం వంటి సమస్యలు తలెత్తుతాయి. ఈ సమస్యలు దరిచేరకుండా ఉండటానికే మహబూబునగర్‌ జిల్లా కలెక్టర్‌ రొనాల్డ్‌రోస్‌ ‘దివ్య జనని’ అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. భూత్పూర్‌ మండలంలోని ప్రాథమిక వైద్యకేంద్రంలో అక్టోబర్‌ 10న ప్రయోగాత్మకంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇందులో భాగంగా కాబోయే అమ్మలకు నీతి కథలు చెప్పడం, ధ్యానం చేయించడంపై పీహెచ్‌సీలు, అంగన్‌వాడీ కేంద్రాల్లో అక్కడి సిబ్బంది తర్ఫీదునిస్తున్నారు. ప్రతి సోమవారం ఆనందకరమైన జీవన విధానాలు, జీవిత విలువలని నేర్పిస్తున్నారు. వీటిపై అవగాహన కల్పించడానికి ప్రత్యేకంగా ఏడు మాడ్యూళ్లను రూపొందించారు. దీనికనుగుణంగా వైద్య సిబ్బంది, ఏఎన్‌ఎంలు, అంగన్‌వాడీ కార్యకర్తలను హార్ట్‌ఫుల్‌నెస్‌ బృందం సభ్యులు తీర్చిదిద్దారు. ఈ సమయంలో తల్లి ఆనందంగా ఉంటే... పుట్టబోయే బిడ్డా ఆరోగ్యంగా ఉంటుందని అధ్యయనాలూ చెబుతున్నాయి. ఇటీవల మధ్యప్రదేశ్‌ నుంచి ఒక బృందం వచ్చి ఈ కార్యక్రమాన్ని పరిశీలించడం విశేషం.

- కాయల పూర్ణచందర్‌, ఈనాడు, మహబూబునగర్‌


మరిన్ని