close

ఆంధ్రప్రదేశ్

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
ఇంకా తొలగని ముంపు భయం

ఉభయగోదావరి జిల్లాల్లో లోతట్టు ప్రాంతాలు మునకలోనే..

ఈనాడు, ఈనాడు డిజిటల్‌, న్యూస్‌టుడే బృందం: ఉభయగోదావరి జిల్లాలలో వరద ముంపు భయం వెన్నాడుతూనే ఉంది. గుంటూరు, కృష్ణా జిల్లాల లంక గ్రామాలు ఇంకా తేరుకోలేదు. నాలుగు జిల్లాలలో పంట, ఆస్తి నష్టాలు భారీగా నమోదవుతున్నాయి. వర్షాలు తగ్గినా వరదల వల్ల ఈ జిల్లాలలోని పలు ప్రాంతాలు భయం గుప్పిట్లోనే ఉన్నాయి. తూర్పుగోదావరి జిల్లాలో శనివారం కూడా 2లక్షల మందికిపైగా ప్రజలు ముంపులోనే ఉన్నారు. కాకినాడ నగరం, సామర్లకోట, పెద్దాపురం, పిఠాపురం, గొల్లప్రోలు మండలాలను ముంపు వీడలేదు. జిల్లాలో 62 గ్రామాల్లో మునక భయం కొనసాగుతోంది. కేవలం 26 పునరావాస శిబిరాలను నిర్వహిస్తున్నారు. వర్షాలు లేకపోయినా ఏలేరు నుంచి విడుదలవుతున్న నీటితో ముంపు తగ్గడం లేదు. పోటు కారణంగా ఏలేరు వరద త్వరగా సముద్రంలో కలవడం లేదు. ఇటీవలి వర్షాలకు కాజులూరు మండలం గొల్లపాలెంలో పెంకుటిల్లు గోడ కూలి అప్పారావు(80) చనిపోయారు.
* పశ్చిమగోదావరి జిల్లాలో గోస్తనీ నది ప్రవాహానికి పెనుమంట్రతోపాటు సోమరాజు ఇలింద్రపర్రు, మాముడూరు గ్రామాలు మునకలోనే ఉన్నాయి. పెనుమంట్ర మండలవ్యాప్తంగా శనివారం భారీ వర్షం కురిసింది. యనమదుర్రు డ్రెయిన్‌ ప్రభావానికి భీమవరం పట్టణంలోని లోతట్టు ప్రాంతాలు, మండలంలో 7 గ్రామాలు ముంపులోనే ఉన్నాయి. భీమవరం, ఉండి, ఆకివీడు, గణపవరం తదితర ప్రాంతాల్లో ఆక్వా చెరువులు ఏకమయ్యాయి. రహదారులపై రాకపోకలు నిలిచాయి. యనమదుర్రు ప్రవాహ తీవ్రతకు తాడేపల్లిగూడెం, తణుకు, గణపవరం, పెంటపాడు, ఉండి, అత్తిలి, పాలకోడేరు, మొగల్తూరు, నిడదవోలు మండలాల్లో వేలాది ఎకరాలు నీటి పాలయ్యాయి.

విజయవాడ లోతట్టు ప్రాంతాలు జలమయమే
ప్రకాశం బ్యారేజీకి వరద తగ్గడంతో అధికారులు రెండో ప్రమాద హెచ్చరికను ఉపసంహరించారు. బ్యారేజీకి దిగువన నీట మునిగిన విజయవాడలోని లోతట్టు ప్రాంతాల్లో ఇళ్లలోకి వచ్చిన నీరు తగ్గలేదు. నీరు తొలగిన ఇళ్లలో బురద మేట వేసింది. దీంతో ఆయా ప్రాంతవాసులు ఇళ్లలోకి వెళ్లలేక, బయట వర్షంలో తడుస్తూ ఉండలేక ఇబ్బంది పడుతున్నారు. బ్యారేజీకి దిగువ ప్రాంతాలైన పెనమలూరు, పామర్రు, అవనిగడ్డ నియోజకవర్గాల్లో నదీ పరివాహక ప్రాంతాలన్నీ మునిగాయి.
* కృష్ణా, గుంటూరు జిల్లాలలోని లంక గ్రామాలు నీటిలోనే ఉన్నాయి. శనివారం ఉదయం సనక శంకర్‌రావు అనే వ్యక్తి కొల్లూరు నుంచి తన స్వగ్రామమైన ఆవులవారిపాలేనికి వెళ్లడానికి కాస్త లోతు నీటిలో ఆగిన పడవ ఎక్కేందుకు వెళుతూ కాలు జారి వరదలో కొట్టుకుపోయారు. వరద తీవ్రత ఉన్నప్పుడు కూడా కొల్లూరు నుంచి లంకలకు వెళ్లే ప్రధాన రహదారి వద్ద రెస్క్యూ బోట్లు లేకపోవడంపై స్థానికులు మండిపడుతున్నారు. శ్రీశైలంనుంచి భారీగా నీటిని విడుదల చేస్తున్నారన్న సమాచారంతో లంక ప్రజలు ఆందోళన చెందుతున్నారు. శనివారం జిల్లా అధికారులతో కలిసి హోంమంత్రి మేకతోటి సుచరిత, జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు లంక గ్రామాల్లో పర్యటించారు.


మొలకలొచ్చిన కండె

సాలూరు గ్రామీణం, న్యూస్‌టుడే: మొక్కజొన్న కండెల నుంచి వచ్చిన మొలకలను చూపుతున్న ఈ రైతు పేరు కొసరు జోగులు. విజయనగరం జిల్లా సాలూరు మండలం మావుడి పంచాయతీ గాదెపల్లివలస గ్రామవాసి. ఎకరా పొలంలో మొక్కజొన్న వేశారు. ఈ ఏడాది కొనుగోలు కేంద్రాలు తెరవకపోవడంతో సమీపంలోని కొండరాయిపై పంటను ఆరబెట్టారు. పంటపై పరదాలు కప్పినా ఇటీవలి వర్షాలకు నీరు చేరి మొలకలొచ్చాయని రైతు వాపోతున్నారు.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు