close

గ్రేటర్‌ హైదరాబాద్‌

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
యజమాని కోరుకున్న రోజే రిజిస్ట్రేషన్‌... మ్యుటేషన్‌ పూర్తి

ధరణి మార్గదర్శకాలు జారీ చేసిన ప్రభుత్వం
ఈనాడు - హైదరాబాద్‌

వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్ల సేవలు ధరణి పోర్టల్‌ ద్వారా మరింత సులువుకానున్నాయి. రాష్ట్రంలోని తహసీల్దారు కార్యాలయాల ద్వారా దసరా పండుగ రోజు నుంచి ఈ సేవలను ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొస్తోంది. భూ యజమానులు, తహసీల్దారు కార్యాలయం చేపట్టాల్సిన విధి విధానాలను ప్రభుత్వం శనివారం విడుదల చేసింది. గతంలో రిజిస్ట్రేషన్‌ కార్యాలయంలో భూమి రిజిస్ట్రేషన్‌ చేసుకున్నాక ఆ భూమిపై హక్కులు పొందేందుకు తహసీల్దారు కార్యాలయంలో మ్యుటేషన్‌కు దరఖాస్తు చేసుకోవాల్సి వచ్చేది. కొత్త ప్రక్రియలో భూ లావాదేవీలు పూర్తయిన మరుక్షణమే  కొనుగోలుదారు ఖాతాలో కొన్న విస్తీర్ణం చేరనుంది. పాసుపుస్తకం లేకపోతే ఈ-పాసుపుస్తకం కూడా జారీ చేయనున్నారు. భూ యజమాని ధరణి పోర్టల్‌లో వివరాలు నమోదు చేసే సమయంలో సెల్‌ఫోన్‌కు ఓటీపీ-వన్‌ టైమ్‌ పాస్‌వర్డ్‌ వస్తుంది. దాని ఆధారంగా పోర్టల్‌లో ముందుకు వెళ్లేలా ఐచ్ఛికాలు ఏర్పాటు చేశారు.
అందుబాటులో ఉండే సేవలు
వారసత్వ బదిలీ, భాగపంపిణీ, క్రయ విక్రయాలు, బహుమతి, కోర్టు డిక్రీతో వచ్చే హక్కులు


భూ యజమాని చేయాల్సింది...

భూ యజమాని ధరణి పోర్టల్‌లో కొనుగోలు దారు, విక్రయదారుకు సంబంధించిన అన్ని రకాల వివరాలు భర్తీ చేయాలి. ఆస్తి వివరాలు, కుటుంబ సభ్యుల వివరాలు పేర్కొనాలి.
* అవసరమైన అఫిడవిట్‌ నిక్షిప్తం చేయాలి.
* భాగపంపిణీ, వారసత్య బదిలీ ప్రక్రియ అయితే కుటుంబ సభ్యుల ధ్రువీకరణ జతచేయాలి.
* రిజిస్ట్రేషన్ల రుసుం, స్టాంప్‌ డ్యూటీ, మ్యుటేషన్‌ ఛార్జీలు చలానా రూపంలో చెల్లించి ఆ వివరాలు పోర్టల్‌లో నమోదు చేయాలి.
* ఏ సమయంలో రిజిస్ట్రేషన్‌ సేవలు (స్లాట్‌) పొందేందుకు వీలుంటుందో భూ యజమాని తెలియజేస్తే తహసీల్దారు కార్యాలయం సమాచారం పంపుతుంది. ఆ సమయానికి భూ క్రయ విక్రయదారులు, సాక్షులు కార్యాలయంలో హాజరుకావాలి.


తహసీల్దారు కార్యాలయంలో..

మొదటి దశలో... డేటా ఎంట్రీ ఆపరేటర్‌ (డీఈవో) సాక్షుల వివరాలు తీసుకుని ధరణిలో నిక్షిప్తం చేస్తారు. వేలిముద్రలు బయోమెట్రిక్‌ ద్వారా స్వీకరిస్తారు. సంయుక్త సబ్‌ రిజిస్ట్రార్‌- తహసీల్దారు బయోమెట్రిక్‌ వివరాలు పరిశీలిస్తారు. చలానా వివరాలు నిర్ధారించుకుని రిజిస్ట్రేషన్‌ పూర్తి చేస్తారు.
* రెండో దశలో డీఈవో రిజిస్టర్‌ డీడ్సీను స్కాన్‌ చేస్తారు. అనంతరం తహసీల్దారు దస్త్రాలపై డిజిటల్‌ సంతకం చేసి మ్యుటేషన్‌ ప్రక్రియ  పూర్తి చేస్తారు.
* రిజిస్ట్రేషన్‌ పత్రాలు, మ్యుటేషన్‌ దస్త్రం, నవీకరించిన పాసుపుస్తకం, లావాదేవీల వివరాల పత్రం క్రయ విక్రయదారులకు అందజేస్తారు.
* కొనుగోలుదారుకు పాసుపుస్తకం లేకపోతే ఈ-పట్టా పాసుపుస్తకం అందజేస్తారు. విక్రయదారు ఖాతాలో విక్రయించిన మేర విస్తీర్ణాన్ని తగ్గిస్తారు.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు