close

వసుంధర

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share
బిర్యానీ రుచికి తలపాగా చుట్టారు!

తలపాగా... నిండైన ఆత్మగౌరవానికి నిదర్శనం... తమ ప్రాంత చిహ్నంగా మారిన రుచికరమైన బిర్యానీకీ తలపాగా పేరే పెట్టుకున్నారు తమిళనాడులోని దిండిగల్‌వాసులు.ఆ ఆత్మగౌరవానికి, మరింత సృజనాత్మకతను జోడించిన దీపిక ‘తలపాకట్టి బిర్యానీ’ రుచిని ఖండాంతరాలకు వ్యాపింపజేశారు. కేవలం అయిదే సంవత్సరాల్లో రూ.200 కోట్ల వ్యాపారంగా మార్చారు...
తమిళనాడులోని దిండిగల్‌ వెళ్లి ఆనంద విలాస్‌ గురించి అడిగితే చాలు... అక్కడి వాళ్లు దారి చూపించడమే కాదు, అక్కడి బిర్యానీ గురించి గొప్పగా చెబుతారు. ఆనంద్‌ విలాస్‌ను ప్రారంభించింది నాగసామి నాయుడు. 1957లో ఆయన  దిండిగల్‌లో ఓ చిన్న సంస్థలో అకౌంటెంట్‌గా పనిచేసేవారు. ఆయన సతీమణి కన్నమ్మాళ్‌ ప్రత్యేకమైన పద్ధతిలో బిర్యానీ తయారు చేసేవారు. బయట ఎక్కడ తిన్నా ఆ రుచి వచ్చేది కాదు. దీంతో బంధువులు, స్నేహితులు తెగ మెచ్చుకునేవారు. అప్పుడు నాగసామికి వచ్చిన ఆలోచనే ఆనంద విలాస్‌గా మారింది. తలపాగా చుట్టుకునే అలవాటున్న నాగసామి ఈ బిర్యానీకి బ్రాండ్‌ అంబాసిడర్‌ అయ్యారు. ఆయన తలపాగా పేరుమీదే ఇది తలపాకట్టి బిర్యానీగా మారింది. కానీ ఆ రుచికి వెనక ఉన్నది మాత్రం ఆయన సతీమణి కన్నమ్మాళ్‌. ఆమె తయారీ విధానంతోనే దానికంత పేరొచ్చింది. ఆపేరు దిండిగల్‌ దాటి తమిళనాడు అంతా వ్యాపించింది. నాగసామి నాయుడు తర్వాత తలపాకట్టి బిర్యానీ బాధ్యతను ఆయన వారసులే స్వీకరిస్తూ వచ్చారు.  నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఫ్యాషన్‌ టెక్నాలజీలో గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసిన దీపిక 2008లో ఈ ఇంటి కోడలుగా అడుగుపెట్టింది. తర్వాత  ఆనంద్‌విలాస్‌ బాధ్యతల్లోనూ పాలుపంచుకుంది. అప్పటి నుంచి తలపాకట్టి ప్రాభవం మరో దశకు చేరుకుంది.

ఆనంద విలాస్‌ బాధ్యత దీపిక తీసుకునే నాటికి వారి చేతుల్లో నాలుగంటే నాలుగే శాఖలు ఉండేవి.  దీన్ని విస్తరించాలనుకున్న దీపిక ఆధునిక మార్కెటింగ్‌ పద్ధతులను అనుసరించింది. నాణ్యత విషయంలో రాజీలేని ధోరణి, విస్తృత ప్రచారాలను తన విజయ సూత్రాలుగా చేసుకున్న ఆమె అయిదేళ్లలో చెన్నై నగరంలో 27 శాఖలతో సహా తమిళనాడు, పుదుచ్చేరి, బెంగళూరుల్లో మొత్తం 79 శాఖలను ఏర్పాటుచేశారు. ‘ఈ ప్రయాణం అనుకున్నంత తేలికేం కాదు. ఏ ప్రాంతంలో మా బ్రాండ్‌ను పరిచయం చేయాలనుకున్నామో అక్కడ మా సర్వే టీం అధ్యయనం మొదలుపెడుతుంది. అక్కడివారి రుచులు, ఆహారంపై వారికుండే అభిప్రాయాలను సేకరిస్తుంది. దాదాపు ఆరు నెలల తర్వాతే అక్కడ శాఖను ప్రారంభించి, సెంట్రల్‌ కిచెన్‌ను తెరుస్తాం. నాణ్యత తగ్గకుండా ఉండటానికి ఎవరికీ ఫ్రాంఛైజీ ఇవ్వకుండా ప్రతి శాఖ బాధ్యతా మేమే చూసుకుంటాం..’ అంటారు దీపిక. ‘ప్రస్తుతం ప్రజల అభిరుచులు వేగంగా మారుతున్నాయి. అందుకే తొలుత బిర్యానీ, దాల్చా మాత్రమే ఉండగా, ఇప్పుడు 300 రకాలకు పైగా రుచికరమైన ప్రత్యేక వంటకాలను జత చేశాం. బిర్యానీలోనే ఏడెనిమిది రకాలున్నాయి. అలాగే ప్రముఖ పట్టణాల్లో మిడ్‌నైట్‌ బిర్యానీ అందిస్తున్నాం. కస్టమర్‌ కేర్‌ పేరుతో వినియోగదారుల అభిప్రాయాలను ప్రత్యేక వెబ్‌సైట్‌ ద్వారా సేకరిస్తాం. అంతేకాదు, ప్రతి శాఖలోనూ రాత్రికి మిగిలిన ఆహారాన్ని నిరుపేదలకు ఉచితంగా పంచిపెడతాం.’ అని వివరించారామె.  ‘అమెరికా, దుబాయిల్లోనూ ఇప్పుడు తలపాకట్టి బిర్యానీ అందుబాటులోకి వచ్చింది.  విదేశాల్లో మాకు తొమ్మిది శాఖలున్నాయి. ప్రస్తుతం రెండున్నరవేలమందికి ఉపాధిని అందిస్తున్నాం...’ అంటారు దీపిక.  


ఆమె వేసిన దినుసులే...

ప్రతిచోటా బిర్యానీకి బాసుమతి రైస్‌ వాడితే, తలపాకట్టిలో మాత్రం దిండిగల్‌ ప్రాంతంలో పండే సీరగ సంబా రకం బియ్యాన్ని వాడతారు. దీనివల్ల మసాలాల రుచి ప్రతి మెతుకులోనూ తెలుస్తుంది. ఇందులో వాడే మాంసం, మసాలాల విషయంలో నాణ్యతకు పెద్ద పీట వేస్తారు. ఇప్పటికీ మసాలా పొడిని గ్రామాల్లోని మహిళలతో తయారు చేయిస్తారు. కన్నమ్మాళ్‌ ఎలాగైతే ఈ బిర్యానీని చేసేదో అదే రుచిని ఇప్పటికీ అందిస్తున్నారు. దీనికోసం వంటవాళ్లను కూడా మొదటి తరంలో పనిచేసిన వాళ్ల కుటుంబాల నుంచే తీసుకుంటారు. మరికొందరికి సొంతగా శిక్షణనిస్తున్నారు. తలపాకట్టికి మూలమైన కన్నమ్మాళ్‌ పేరు మీద ఏటా మహిళాసాధికారతకు ప్రతిరూపంగా నిలిచేవారిని ఎంపిక చేసి ‘సూపర్‌ ఉమెన్‌’ అవార్డునందించి గౌరవిస్తున్నారు.


మరిన్ని