
ఆంధ్రప్రదేశ్
నందిగామ, న్యూస్టుడే: కొందరు మహిళలు ఆదివారం రాత్రి తన ఇంటిపై దాడికి వచ్చినందుకు నిరసనగా కృష్ణా జిల్లా నందిగామ మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య సోమవారం ఒక రోజు నిరశన దీక్ష చేపట్టారు. దీక్షను సీనియర్ నాయకుడు వడ్డెల్లి సాంబశివరావు ప్రారంభించారు. పలువురు మహిళా నాయకులు కూడా ఆమెతో పాటు దీక్షలో కూర్చున్నారు. సౌమ్య మాట్లాడుతూ... నందిగామ మండలం లింగాలపాడుకు చెందిన సామాజిక కార్యకర్త పసుపులేటి సూర్యప్రకాష్ అధికార పార్టీ నాయకుల ఇసుక, గ్రావెల్ దోపిడీపై సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టడంతో.. అతనిపైన, అతడి భార్యపైన కొందరు మహిళలు దాడిచేయగా.. వారిని పరామర్శించానని తెలిపారు. ఆ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని వైకాపా నాయకుల ప్రోద్బలంతో తన ఇంటిపైకి 60 మందికిపైగా ఆ పార్టీ సానుభూతిపరులు దాడికి వచ్చారన్నారు. అర్ధరాత్రి తనపైనే దాడులకు వస్తే సామాన్యుల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. మాజీ మంత్రులు దేవినేని ఉమా, నెట్టెం రఘురాం, మాజీ ఎమ్మెల్యే శ్రీరాం తాతయ్య తదితరులు దీక్షను విరమింపజేశారు. పులివెందుల తరహా పంచాయతీలు నందిగామలో నడవవని దేవినేని ఉమా స్పష్టం చేశారు. రాజకీయ దురుద్దేశంతోనే వైకాపా నాయకులు ఆమె ఇంటిపై దాడికి ఉసిగొల్పారని నెట్టెం రఘురాం ఆరోపించారు.