
గ్రేటర్ హైదరాబాద్
ఈనాడు, హైదరాబాద్: రాష్ట్రంలో గత ఐదేళ్లలో కేంద్ర ప్రాయోజిత పథకాల నిధుల వ్యయం, కేటాయింపులు తగ్గిపోయాయని వ్యవసాయశాఖ పరిశీలనలో తేలింది. వచ్చే నెలలో శాసనసభలో ప్రవేశపెట్టనున్న రాష్ట్ర బడ్జెట్ కోసం వివిధ పథకాలకు కేటాయింపులు, వ్యయంపై ఈ శాఖ లెక్కలు తయారుచేస్తోంది. పలు కేంద్ర పథకాలకు ఐదేళ్ల క్రితంతో పోలిస్తే కేటాయింపులు తగ్గినట్లు తేలింది. ఉదాహరణకు 2016-17లో జాతీయ ఆహార భద్రత మిషన్ పథకం కింద కేంద్రం రూ.41.89 కోట్లు ఇవ్వగా ఈ ఏడాది రూ.28 కోట్లే వచ్చాయి. బిందుసేద్యానికి నిధులు రూ.139 కోట్ల నుంచి 89 కోట్లకు, రాష్ట్రీయ కృషి వికాస్ యోజనకు రూ.427 కోట్ల నుంచి రూ.177 కోట్లకు తగ్గిపోయాయి. కేంద్ర పథకాలకు నిధులు రావాలంటే రాష్ట్రం వాటా కింద 60 శాతం కలిపి ఇవ్వాలి. రాష్ట్రం వాటా కలపకపోవడంతో కొన్ని పథకాల్లో కేంద్రం నిధులు పెరగలేదు.