close

వసుంధర

భుజం విరిగినా బండి దిగలేదు

ఇంటరులో ఫెయిల్‌ అయినందుకు తండ్రి ఇంట్లోంచి వెళ్లిపొమ్మన్నా... బాధపడలేదామె. చిరుద్యోగం చేస్తూ... బైక్‌ రైడింగ్‌లో పాల్గొనేది.  ఆ ప్రయాణంలో ఎన్నో ప్రమాదాలు. ఓసారి భుజం విరిగింది. మరోసారి పొట్టకు తీవ్ర గాయాలు. రైడింగ్‌ చేయకూడదన్నా వినిపించుకోలేదు. సూటిపోటి మాటలు వినపడుతున్నా... పట్టించుకోలేదు. పడిలేచిన కెరటమై... అంచెలంచెలుగా ఎదిగింది. ఆమే ఐశ్వర్యా పిస్సే. తాజాగా మోటార్‌ స్పోర్ట్స్‌ విమెన్‌ వరల్డ్‌కప్‌ గెలిచి, ఈ ఘనత సాధించిన మొదటి భారత మహిళగా చరిత్ర సృష్టించింది.  ఆ విశేషాలను వసుంధరతో పంచుకుందిలా...

శ్వర్యా మధుసూధన్‌ పిస్సే పుట్టి పెరిగినదంతా బెంగళూరు. తల్లిదండ్రులు కొన్ని కారణాల వల్ల విడాకులు తీసుకోవడంతో తండ్రి దగ్గరే పెరిగింది. ఐశ్వర్య ఇంటరులో ఫెయిల్‌ కావడంతో... తండ్రి ఇంట్లోంచి వెళ్లిపొమ్మన్నాడు. అభిమానంతో గడప దాటిన ఆమె... తల్లి దగ్గరకు చేరుకుంది. తరువాత అసలు చదవలేదు. అలాగని ఖాళీగానూ లేదు. తన ఖర్చుల కోసం ఓ నగల తయారీ సంస్థలో మోడల్‌గా చేసింది. వీలు చిక్కినప్పుడల్లా... బెంగళూరులో తోటివారితో కలిసి బైక్‌ రైడ్స్‌లో పాల్గొనేది. అలా ఆమెకు బైక్‌ రైడింగ్‌పై ఆసక్తి పెరిగింది. మోడల్‌గా పనిచేసినప్పుడు వచ్చిన ఆదాయంలో కొద్దికొద్దిగా దాచుకుని తనకు నచ్చిన డ్యూక్‌ 200 బైక్‌ కొనుక్కుంది. కొన్నాళ్లకు ఎంటీవీ ఛానల్‌ ‘ఛేజ్‌ ది మాన్‌సూన్‌’ పేరుతో ఓ కార్యక్రమం నిర్వహించింది. ఆ వివరాలు తెలుసుకున్న ఐశ్వర్య దానికి దరఖాస్తు చేసుకుంది. దేశవ్యాప్తంగా ఐదుగురు అమ్మాయిలను ఎంపిక చేస్తే అందులో ఐశ్వర్యా ఉంది. గుజరాత్‌ నుంచి చిరపుంజి వరకు 24 రోజుల్లో ప్రయాణించింది. అదయ్యాక శాడిల్‌ సోర్‌ పోటీలో భాగంగా వెయ్యి మైళ్లను 24 గంటల్లో పూర్తి చేసింది. బన్‌ బర్నర్‌ రైడ్‌లో 2,500 మైళ్లను 36 గంటల్లో చేరుకుంది. స్నేహితుల సలహాతో దీన్నే కెరీర్‌గా ఎంచుకుంది. బెంగళూరులోని ఎపెక్స్‌ రేసింగ్‌ అకాడమీలో చేరింది. అప్పటి నుంచి రైడింగే ఊపిరిగా సాగుతోంది.

బైక్‌ రైడింగ్‌లో రోడ్‌ రైడింగ్‌, ర్యాలీ రైడింగ్‌ అని రెండు రకాలుంటాయి. ఐశ్వర్య ఎక్కువగా ర్యాలీ రైడింగ్‌లో పాల్గొంటుంది. ఇది వరుసగా నాలుగు నుంచి ఐదు రోజుల పాటు సాగే సాహస యాత్ర. దీన్ని కొండలు, ఎడారులు, అడవుల్లో నిర్వహిస్తారు. మార్గం ఎంతో కఠినంగా ఉంటుంది. ఎదురొచ్చే అడ్డంకులన్నింటినీ దాటి గమ్యం చేరాలి. 100 నుంచి 200 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించాలి. 150 నుంచి 200కిలోల బరువున్న బైకును బాలెన్స్‌ చేయాల్సి ఉంటుంది. దీని కోసం మానసికంగా, శారీరకంగా ఎంతో దృఢంగా ఉండాల్సి వస్తుంది.

భుజం విరిగినా...
అది జూన్‌ 2017. మరో ఐదు రోజుల్లో నేషనల్‌ ఛాంపియన్‌షిప్‌. జిమ్‌కు వెళ్లి వస్తుండగా ఒక కారు ఐశ్వర్యను ఢీకొంది. ఆమె కాలర్‌బోన్‌ విరిగిపోయింది. ఆపరేషన్‌ చేశారు. పూర్తిగా నయం అయ్యే వరకు విశ్రాంతి తీసుకోవాలని చెప్పారు వైద్యులు. ఆమె ట్రైనర్లు అనిల్‌కుమార్‌, జీవారెడ్డి అదే సూచించినా వినలేదు ఐశ్వర్య. ఓ వైపు నొప్పి బాధిస్తున్నా నేషనల్‌ రైడ్‌ ఛాంపియన్‌షిప్‌లో పాల్గొంది. అందులో విజయం సాధించిన మొదటి మహిళగా రికార్డు సృష్టించింది. అదే ఏడాది జరిగిన ర్యాలీ ఛాంపియన్‌షిప్‌లోనూ పాల్గొని విజేతగా నిలిచింది.
36 కుట్లు వేశారు...
2018లో ఐశ్వర్య అంతర్జాతీయ రైడింగ్‌ ఈవెంట్‌కు ఎంపికైంది. ఈ గుర్తింపు సాధించిన మొదటి భారతీయ మహిళగా చరిత్ర సృష్టించింది. ఆ ర్యాలీ స్పెయిన్‌లో జరిగింది. కొండలపై, రాళ్లురప్పల్లో ప్రయాణించాలి. అది ర్యాలీ రెండో రోజు... మరో పది కిలోమీటర్లు ప్రయాణిస్తే రైడింగ్‌ పూర్తవుతుందని అనుకుంటోన్న సమయంలో కింద పడిపోయింది. ఆమె పొట్టకు తీవ్ర గాయమైంది. క్లోమగ్రంథి విపరీతంగా దెబ్బతింది. అయితేనేం... రైడ్‌ పూర్తి చేయాలనే పట్టుదలతో నొప్పిని సైతం లెక్కచేయలేదు. శక్తినంతా కూడదీసుకొని లేచింది. బైక్‌ స్టార్ట్‌ చేస్తోన్న సమయంలో వైద్యులు వచ్చి... ‘చాలా తీవ్రంగా గాయాలయ్యాయి... వెంటనే ఆసుపత్రికి వెళ్లాలి...’ అని చెప్పినా వినలేదు. చివరకు బలవంతంగా అంబులెన్స్‌లోకి ఎక్కించి ఆసుపత్రికి తీసుకెళ్లారు. శస్త్రచికిత్స చేసి 36 కుట్లు వేశారు. నలభై రోజులు ఆసుపత్రిలోనే ఉంది. ‘ఇకపై నువ్వు ఇలాంటి రైడింగ్‌కి వెళ్లకూడదు. సాహసకృత్యాలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిద’ని ఆమెకు సూచించారు. తరువాత భారత్‌కు వచ్చేసిన ఆమె ఇక్కడ ఫిజియోథెరపీ, ఇతర చికిత్సలు చేయించుకొని మూడు నెలల్లో కోలుకుంది. ఆత్మస్థైర్యం కోల్పోకుండా మరో నేషనల్‌ ఛాంపియన్‌షిప్‌లో మళ్లీ పాల్గొని విజయం సాధించింది.
తాజాగా...
ఆ పోటీ తరువాత నొప్పి బాధిస్తున్నా... తాజాగా జరిగిన మోటార్‌ స్పోర్ట్స్‌ విమెన్‌ వరల్డ్‌కప్‌లో పాల్గొనేందుకు ఐదునెలలు కఠోర సాధన చేసింది. మార్చి 7న దుబాయ్‌లో  మొదలైన ఈ పోటీ ఆగస్టు 11న హంగేరీలో ముగిసింది. దాదాపు ఐదునెలలపాటు నాలుగు దేశాల్లో జరిగిన ఈ ర్యాలీలో పాల్గొంది. మొత్తంగా 65 పాయింట్లతో ప్రథమ స్థానంలో నిలిచింది. భారతదేశం నుంచి వరల్డ్‌ ఛాంపియన్‌షిప్‌ సాధించిన మొదటి మహిళగా చరిత్ర సృష్టించింది. ‘ఒక రైడర్‌గా చాలా గాయాలయ్యాయి. స్పెయిన్‌లో జరిగిన ప్రమాదం నాకు ఎన్నో పాఠాలు నేర్పింది. మానసికంగా దృఢంగా మార్చింది. శారీరకంగా నాకు అయిన గాయాలే ఒకెత్తయితే... ఇలాంటి పోటీలకు వెళ్తున్నప్పుడు చాలామంది నుంచి విమర్శలు ఎదుర్కోవడం మరొకెత్తు. ‘‘ఆడపిల్లలు నిక్కర్లేసుకొని బండ్లు నడపడం అవసరమా, వేగంగా వెళ్లేప్పుడు బండిపై నుంచి కిందపడితే ఎన్నో గాయాల వుతాయి... హాయిగా చదువుకుని ఉద్యోగం చేసుకోవచ్చు కదా...’’ అని రకరకాలుగా విమర్శించేవారు. నేను అవేవీ పట్టించుకోలేదు. నేనెంతో ఇష్టపడిన లక్ష్యంపైనే దృష్టి పెట్టా.  టీవీఎస్‌ సంస్థ నాకు ఆర్థికంగా చేయూతనందించింది. ఆ కష్టమే ఇప్పుడు గుర్తింపు తెచ్చింది...’ అని చెబుతుందామె.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు