close

తెలంగాణ

సంద్రం దిశగా కృష్ణమ్మ 

వరుసగా అన్ని ప్రాజెక్టుల నుంచి భారీగా విడుదలవుతున్న జలాలు 
పూర్తి స్థాయి నీటిమట్టానికి చేరువలో పులిచింతల 
ప్రకాశం బ్యారేజీ గేట్లూ ఎత్తివేత

ఈనాడు, హైదరాబాద్‌, నల్గొండ: కృష్ణా నదిపై ఉన్న ప్రాజెక్టులు నిండుతాయా? అనే దశ నుంచి వరుసగా అన్ని ప్రాజెక్టులూ ఉప్పొంగుతూ సంద్రం దిశగా కృష్ణమ్మ వడివడిగా పరుగులు పెడుతోంది. నాగార్జునసాగర్‌ వద్ద కృష్ణమ్మ ఉద్ధృతి కొనసాగుతోంది. మంగళవారం రాత్రికి ప్రాజెక్టులో 8.43 లక్షల క్యూసెక్కుల ప్రవాహం నమోదైంది. 26 క్రస్ట్‌ గేట్ల ద్వారా దిగువకు 5.52 లక్షల క్యూసెక్కులను వదులున్నారు. పులిచింతలకు భారీగా ప్రవాహం ఉండగా ఇక్కడి నుంచి కూడా 4 లక్షల క్యూసెక్కులకు పైగా ప్రకాశం బ్యారేజీ వైపునకు విడుదల చేస్తున్నారు. నాగార్జునసాగర్‌ ప్రధాన విద్యుదుత్పత్తి కేంద్రం ద్వారా 32 వేల క్యూసెక్కుల నీటిని కృష్ణా నదిలోకి వదులుతున్నారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 590 అడుగులకు ప్రస్తుతం 575 అడుగులుగా నమోదైంది. 312 టీఎంసీలకు గానూ 269 టీఎంసీల నీరు ప్రస్తుతం నిల్వ ఉంది. ఎడమ కాల్వ, ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్టు కాల్వలకూ గరిష్ఠ స్థాయిలో నీటి విడుదల కొనసాగుతోంది. ఎగువన ఆలమట్టి, నారాయణపూర్‌, జూరాల వద్ద స్వల్పంగా ప్రవాహం తగ్గింది. తుంగభద్రకు కూడా ప్రవాహం తక్కువైంది. తుంగభద్ర, జూరాల నుంచి వస్తున్న ప్రవాహాలు కలిసి శ్రీశైలానికి 8.82 లక్షల క్యూసెక్కులు వస్తున్నాయి.

పులిచింతల ప్రాజెక్టు తొలిసారి పూర్తి స్థాయి నీటిమట్టానికి చేరుకుంటోంది. గతంలో ప్రాజెక్టు పరిధిలోని ముంపు గ్రామాల ప్రజలకు పరిహారం సమస్యను తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల ప్రభుత్వాలు పరిష్కరించడంతో ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 45 టీఎంసీల మేర నీటిని నిల్వ చేయాలని నిర్ణయించినట్లు తెలిసింది. దీంతో ప్రాజెక్టు ముంపు ప్రభావిత ప్రాంతాలైన సూర్యాపేట జిల్లా చింతలపాలెం, పాలకవీడు, మఠంపల్లి మండలాల్లోని 13 గ్రామాల ప్రజలను ఇప్పటికే పునరావాస కేంద్రాలకు అధికారులు తరలించారు. ప్రాజెక్టు 19 క్రస్ట్‌ గేట్లను 3.6 మీటర్ల ఎత్తున లేపి 4.24 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువన ఉన్న ప్రకాశం బ్యారేజీకి వదులుతున్నారు.

70 గేట్ల ద్వారా నీరు దిగువకు 
ఎగువ పులిచింతల నుంచి ప్రవాహం ఎక్కువగా ఉండటంతో కృష్ణా జిల్లాలోని ప్రకాశం బ్యారేజీకి వరదనీరు భారీగా వస్తోంది. దీంతో మంగళవారం సాయంత్రానికి 70 గేట్లను మూడడుగుల మేర ఎత్తి లక్షన్నర క్యూసెక్కులను విడిచిపెడుతున్నారు. ఇది రాత్రికి మూడు లక్షలకుపైగా క్యూసెక్కులకు పెరిగే అవకాశం ఉంది.

 


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు