close

ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్‌దే మీన‘రాశి’

మత్స్య ఉత్పత్తిలో ప్రథమస్థానంలో నిలిచిన రాష్ట్రం
2017-18 మత్స్య గణాంకాల్లో వెల్లడి

ఈనాడు, దిల్లీ: మత్స్య ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్‌ దేశంలో తిరుగులేని రాష్ట్రంగా దూసుకుపోతోంది. 2017-18 నాటికి దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో కలిపి 125.90 లక్షల టన్నుల చేపల ఉత్పత్తి జరగ్గా అందులో ఒక్క ఆంధ్రప్రదేశ్‌ నుంచే 34.50 లక్షల టన్నులు(27.40%) వచ్చింది. గురువారం కేంద్రమంత్రి గిరిరాజ్‌సింగ్‌ విడుదల చేసిన 2018 మత్స్య గణాంకాలు ఈ విషయాన్ని వెల్లడించాయి. 2014-15 నుంచి మూడేళ్లలో దేశవ్యాప్తంగా సముద్ర ఉత్పత్తుల్లో 22% వృద్ధి నమోదుకాగా, ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం 74% పెరుగుదల కనిపించింది.

ఇన్‌ల్యాండ్‌ చేపల ఉత్పత్తిలోనూ..
17.42 లక్షల టన్నుల ఉత్పత్తితో పశ్చిమబెంగాల్‌ ఆంధ్రప్రదేశ్‌ తర్వాతి స్థానంలో నిలిచింది. ఆంధ్రప్రదేశ్‌లో సముద్ర చేపల ఉత్పత్తి 2014-18 మధ్యకాలంలో 4.38 లక్షల టన్నుల నుంచి 6.05 లక్షల టన్నులకు చేరింది. ఈ విషయంలో 7.01 లక్షల టన్నులతో గుజరాత్‌ తొలిస్థానంలో నిలవగా ఆంధ్రప్రదేశ్‌ రెండో స్థానానికి పరిమితమైంది. ఇన్‌ల్యాండ్‌ చేపల ఉత్పత్తిలో మాత్రం ఆంధ్రప్రదేశ్‌ 28.45 లక్షల టన్నులతో ఎవ్వరికీ అందనంత ఎత్తున నిలిచింది. 15.57 లక్షల టన్నుల ఉత్పత్తితో పశ్చిమబెంగాల్‌ సుదూరంగా రెండోస్థానానికి పరిమితమైంది.

ప్రపంచ మత్స్య ఉత్పత్తిలో మొదటి మూడు స్థానాలు:  చైనా, ఇండోనేషియా, భారత్‌
2017-18లో మత్స్య ఉత్పత్తుల ఎగుమతులు రూ.కోట్లలో: వైజాగ్‌ నుంచి 11,442.39, కాకినాడ నుంచి 124, హైదరాబాద్‌ నుంచి 40.49, కృష్ణపట్నం నుంచి 4,773.83
అత్యధిక ఎగుమతులు: జపాన్‌, అమెరికాలకు

మత్స్యరంగంపై ఆధారపడిన వారు: 1.60 కోట్ల మంది
2016-17లో మత్స్యకారుల నెలవారీ సగటు ఆదాయం: రూ.4,411
* వచ్చే అయిదేళ్లలో మత్స్య ఉత్పత్తి పెరుగుదలకు మౌలికవసతుల కల్పనకు రూ.25వేల కోట్లు ఖర్చుపెట్టాలని కేంద్రం నిర్ణయించింది.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు