close

క్రైమ్

అవినీతి లెక్కలు సరి..!

అనిశాకు చిక్కిన మేడ్చల్‌ డీపీవో

కీసర, పేట్‌బషీరాబాద్‌, న్యూస్‌టుడే: మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లా పంచాయతీ అధికారి(డీపీవో) రవికుమార్‌ అవినీతి నిరోధక శాఖ(అనిశా)కు అడ్డంగా దొరికిపోయాడు. ఓ పంచాయతీకి సంబంధించిన లెక్కలు సరిచేస్తానని మాజీ సర్పంచి నుంచి రూ.లక్ష లంచం తీసుకుంటుండగా అధికారులు పట్టుకున్నారు. గతంలో గ్రామపంచాయతీగా ఉన్న మేడ్చల్‌ మండలం గుండ్లపోచంపల్లికి సంబంధించిన లెక్కల్లో అవకతవకలు జరిగినట్లు ఆరోపణలు వచ్చాయి. దీనిపై ప్రత్యేకంగా ఆడిట్‌ చేయాలని డీపీవో రవికుమార్‌ మాజీ సర్పంచి ఈశ్వర్‌తో పాటు ఆడిట్‌ అధికారులకు లేఖలు పంపారు. ఆ తర్వాత ‘ఆడిట్‌ నివేదిక నా చేతుల్లోనే ఉంది, రూ.15లక్షలు ఇస్తే అంతా సరిచేస్తా’ అంటూ మాజీ సర్పంచిని డిమాండ్‌ చేశాడు. చివరకు రూ.5లక్షలు ఇచ్చేలా ఒప్పందం కుదుర్చుకున్నాడు. విషయాన్ని బాధితుడు ఈశ్వర్‌ ఏసీబీ అధికారుల దృష్టికి తేగా.. డీపీవో గతంలోనూ బాధితుడి నుంచి డబ్బు తీసుకున్నట్లున్న వీడియోను చూసి రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకునేందుకు నిర్ణయించారు. వారి సూచనల మేరకు ఈశ్వర్‌ గురువారం మధ్యాహ్నం మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లా కలెక్టరేట్‌కు వెళ్లి డీపీవోకు రూ.లక్ష అందజేస్తుండగా.. అనిశా అధికారులు దాడిచేసి పట్టుకున్నారు. నిందితుడి నుంచి ఆ సొమ్ము స్వాధీనం చేసుకున్నారు. అనంతరం డీపీవో కార్యాలయం, కొంపల్లి సెంట్రల్‌ పార్కులోని అతని నివాసంలోనూ సోదాలు జరిపారు. నిందితుని అరెస్టు చేసి న్యాయస్థానానికి అప్పగిస్తామని రంగారెడ్డి రేంజి ఏసీబీ డీసీపీ సూర్యనారాయణ తెలిపారు.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు