close

బిజినెస్‌

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
రాణించిన ఎస్‌బీఐ

ఏప్రిల్‌- జూన్‌ లాభంలో 81% వృద్ధి
తగ్గిన మొండి బకాయిలు
కలిసొచ్చిన ఎస్‌బీఐ లైఫ్‌లో వాటా విక్రయం
దిల్లీ

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో (ఏప్రిల్‌- జూన్‌) స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) స్టాండలోన్‌ ప్రాతిపదికన రూ.4,189.34 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. ఏడాదిక్రితం ఇదే త్రైమాసికంలో నమోదైన రూ.2,312.02 కోట్లతో పోలిస్తే నికర లాభం 81 శాతం పెరిగింది. మొండి బకాయిలు తగ్గడం ఇందుకు ఓ కారణమైతే.. ఎస్‌బీఐ లైఫ్‌ ఇన్సూరెన్స్‌లో 2.1 శాతం వాటా విక్రయం ద్వారా వచ్చిన రూ.1,539.73 కోట్లు కూడా కలవడం మరో కారణం. ఈ వాటా విక్రయం అనంతరం ఎస్‌బీఐ లైఫ్‌లో ఎస్‌బీఐ వాటా 57.70 శాతం నుంచి 55.60 శాతానికి దిగివచ్చింది. మొత్తం ఆదాయం కూడా రూ.70,653.23 కోట్ల నుంచి రూ.74,457.86 కోట్లకు పెరిగింది. నిర్వహణ లాభం 36 శాతం అధికమై రూ.13,246 కోట్ల నుంచి రూ18,061 కోట్లకు చేరింది. ‘ప్రపంచవ్యాప్తంగా కొవిడ్‌-19 విస్తరిస్తున్న తీరును గమనిస్తున్నాం. కరోనా ప్రభావంతో ఆర్థిక వ్యవస్థలు నెమ్మదించాయి. ఆర్థిక మార్కెట్లకు ఒడుదొడుకులు పెరుగుతున్నాయి. మున్ముందు ఈ పరిస్థితులు కొనసాగుతాయా లేదా అనే దానిపై అనిశ్చితి నెలకొంది. అయినప్పటికీ మేం అన్నింటినీ పరిశీలిస్తూ ముందుకు వెళ్తున్నాం. ముఖ్యంగా నిర్వహణ మూలధనం, నిధుల రాక తగ్గడం లాంటి విషయాల్లో మాకు సవాళ్లు ఎదురయ్యే అవకాశం ఉంద’ని ఎస్‌బీఐ వెల్లడించింది. అయితే ఇప్పటివరకు తమ నిధుల లభ్యత, లాభదాయకతపై ఎటువంటి ప్రభావం పడలేదని స్పష్టం చేసింది. ఏప్రిల్‌- జూన్‌ ఆర్థిక ఫలితాలకు సంబంధించి మరికొన్ని ముఖ్యాంశాలు ఇలా..
* నికర వడ్డీ ఆదాయం రూ.16.14 శాతం పెరిగి రూ. 26,642 కోట్లకు చేరింది.  
* నికర వడ్డీ మార్జిన్‌ 3.24 శాతానికి మెరుగైంది.  
* స్థూల నిరర్థక ఆస్తులు 7.53 శాతం నుంచి 5.44 శాతానికి, నికర నిరర్థక ఆస్తులు 3.07 శాతం నుంచి 1.8 శాతానికి తగ్గాయి. దీనికి తగ్గట్లుగానే మొండి బకాయిలకు కేటాయింపులు కూడా రూ.11,648.45 కోట్ల నుంచి రూ.9,420.46 కోట్లకు తగ్గాయి.
* కరోనా సంక్షోభం దృష్ట్యా అదనంగా రూ.1,836 కోట్లను కేటాయింపులు జరిపినట్లు ఎస్‌బీఐ తెలిపింది. ఆర్‌బీఐ నిర్దేశించిన పరిమితికి మించి ఎస్‌బీఐ కేటాయింపులు చేయడం గమనార్హం.
* ఏకీకృత ప్రాతిపదికన నికర లాభం 62 శాతం పెరిగి రూ.2,950.50 కోట్ల నుంచి రూ.4,776.50 కోట్లకు చేరింది. మొత్తం ఆదాయం కూడా రూ.83,274.04 కోట్ల నుంచి రూ.87,984.33 కోట్లకు పెరిగింది. సమీక్షా త్రైమాసికంలో రుణాల వృద్ధి 6.58 శాతంగా నమోదైంది.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు