close

ఆదివార అనుబంధం

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

అందరూ అందరే...!

కాజల్‌ అగర్వాల్‌... తాజాగా నిశ్చితార్థం జరుపుకుని పెళ్లయ్యాక కూడా నటిస్తానంటూ ముద్దుముద్దుగా చెప్పేసిన ఈ అందాల భామ.. తన రీల్‌లైఫ్‌లోని కొందరు హీరోల గురించి చెబుతోందిలా...


ఆ డ్యాన్స్‌కి ఫిదా

తారక్‌.. నటనలోనే కాదు, డ్యాన్స్‌లోనూ అద్భుతమే. నాకు తన డ్యాన్సంటే ఎంతిష్టమో.. అతనితో కలిసి డ్యాన్స్‌ చేయడమూ అంతే కష్టం. ఈ విషయాన్ని అతడికి ఇప్పటికే చాలాసార్లు చెప్పాను కూడా. చాలా ఎనర్జిటిక్‌గా ఉంటాడు. అంత ఎనర్జీ ఎలా వస్తుందనేది నాకు అస్సలు అర్థంకాదు. వీటన్నింటికీ మించి ముక్కుసూటిగా మాట్లాడే స్వభావం. తన మనసులో ఏముందో దాన్నే బయటకు చెప్తాడు.


పెద్ద ఫ్యాన్‌ని...

పవన్‌కల్యాణ్‌.. చాలామంది హీరోయిన్లలా నాకు కూడా ఒకప్పుడు తనతో నటించే అవకాశం వస్తే బాగుండని అనిపించేది. అది ‘సర్దార్‌’తో తీరింది. అంతకు ముందు చాలాసార్లు ఆయన్ని  కలిశా కానీ.. మేం కలిసి నటిస్తామని అనుకోలేదు. తన పాత్ర విషయంలోనే కాదు అతడి సహనటులూ అంతే బాగా చేయాలనే తపన పవన్‌కల్యాణ్‌లో కనిపిస్తుంది. సెట్‌లో నేను ఎప్పుడైనా హైపర్‌గా ఉండి కాస్త హడావుడి చేస్తే ‘బీ కామ్‌... ముందు దీర్ఘంగా శ్వాస తీసుకో..’ అంటూ నన్ను కూల్‌ చేసేందుకు ప్రయత్నించేవాడు.


నిజమైన స్నేహితుడు

రామ్‌చరణ్‌.. నాకు కోస్టార్‌ మాత్రమే కాదు, నిజమైన స్నేహితుడు కూడా. ఎప్పుడు ఏ అవసరం వచ్చినా సాయం చేయడానికి ముందుండే మంచి మనసున్న నటుడు. ఒకప్పుడు నాతో నటించి క్రమంగా నిర్మాతగానూ మారాడని తెలిసినప్పుడు చాలా గర్వంగా అనిపించింది. అతనితోనే కాదు... వాళ్ల నాన్నతోనూ కలిసి నటించడం నా కెరీర్‌లో ఎప్పటికీ మధుర జ్ఞాపకంగానే మిగిలిపోతుంది.


అదే నేర్చుకున్నా...

మహేష్‌బాబు... పర్‌ఫెక్షనిస్ట్‌. ఏదయినా సీను సరిగ్గా రాకపోతే మళ్లీమళ్లీ చేస్తాడే తప్పరాజీ పడడు. సినిమాల్లో కుటుంబ విలువలకు ఎంత ప్రాధాన్యం ఇస్తాడో జీవితంలోనూ అంతే. వీటన్నింటికీ మించి అతను ఫిట్‌నెస్‌ఫ్రీక్‌. వ్యాయామాలు, పోషకాహారం... వంటి విషయాలపైన మహేష్‌కి మంచి అవగాహన ఉంటుంది. అది నాకెంతో నచ్చుతుంది.


గర్వంగా అనిపిస్తుంది

ప్రభాస్‌.. బాహుబలితో తెలుగు సినిమాను ప్రపంచస్థాయికి తీసుకెళ్లిన నటుడు. అతడు కెరీర్‌లో అంచెలంచెలుగా ఎదిగిన వైనం చూస్తే.. చాలా సంతోషంగా అనిపిస్తుంది. అలాంటి నటుడితో నేనూ కలిసి నటించినందుకు గర్వంగానూ ఉంటుంది. మొదటినుంచీ అతడిది కష్టపడే తత్వమే. దర్శకులు తన నుంచి ఏం ఆశిస్తున్నారో తెలుసుకుని... తన పాత్రకు వందశాతం న్యాయం చేస్తాడు. ప్రభాస్‌ ఇంకా ఉన్నతికి చేరుకోవాలని ఎప్పుడూ కోరుకుంటా.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు