close

వసుంధర

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share
విమానాలు చూసి...

అగ్ని పుత్రిక - టెస్సీ థామస్‌
చరిత్రలో ఆమె

కేరళకు చెందిన టెస్సీ థామస్‌ శాస్త్రవేత్తగా కంటే.. మిసైల్‌ ఉమన్‌గానే భారతీయులకు సుపరిచితం. ఎందుకంటే మన దేశంలో అత్యంత ప్రతిష్ఠాత్మకమైన మిసైల్‌ ప్రాజెక్టులో టెస్సీ తనదైన ముద్రవేశారు.

ప్రస్తుతం ఆమె ఏరోనాటికల్‌ వ్యవస్థకు డిప్యూటీ జనరల్‌. అంతకు ముందు డీఆర్‌డీవో(డిఫెన్స్‌ రీసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ ఆర్గనైజేషన్‌)లో అగ్ని4 మిస్సైల్‌కి ప్రాజెక్టు డైరెక్టర్‌గా పని చేశారు. టెస్సీ అలప్పుళాలోని సిరియన్‌- క్రిస్టియన్‌ కుటుంబంలో పుట్టి పెరిగారు. వాళ్లింట్లో ఐదుగురమ్మాయిలు, ఒక అబ్బాయి. ఆమె 13వ ఏటనే తండ్రి పక్షవాతంతో మంచానికి పరిమితమయ్యారు. దాంతో టీచర్‌గా పని చేస్తోన్న తల్లి మీద కుటుంబ భారమంతా పడింది. ఎన్ని కష్టాలున్నా ఆమె తన పిల్లల్ని ఉన్నత చదువులు చదివించారు. టెస్సీ ఇల్లు... తుంబ రాకెట్‌ లాంచింగ్‌ స్టేషన్‌కు దగ్గరగా ఉండేది. అలా ఆమెకి రాకెట్‌ మీద ఆసక్తి పెరిగింది. ఆకాశంలో ఏ చిన్న విమానం ఎగురుతూ కనిపించినా టెస్సీ తెగ సంబరంగా చూసేవారు. తను కూడా అందరికంటే భిన్నంగా ఎదగాలని... ఆకాశంలో రాకెట్లు వదలాలని కలలు కంటూ పెరిగారు. పట్టుదలతో అది నిజం చేసుకోవాలనుకున్న ఆమె చదువుల్లోనూ ముందుండేవారు. బీటెక్‌, పుణెలో గైడెడ్‌ మిస్సైల్‌లో ఎమ్‌టెక్‌, ఆపరేషన్స్‌ మేనేజ్‌మెంట్‌లో ఎంబీఏ, డీఆర్‌డీవోలో గైడెన్స్‌ మిసైల్‌లో పీహెచ్‌డీ పూర్తి చేశారు. డీఆర్‌డీవోలో శాస్త్రవేత్తగా చేరాక బాలిస్టిక్‌ మిస్సైల్‌, అగ్ని ప్రాజెక్టులో డిజైన్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ విభాగంలో చేరారు. తరువాత అగ్ని ప్రాజెక్టు డైరెక్టర్‌గా పనిచేశారు. గతేడాది డీఆర్‌డీవో ఏరోనాటికల్‌ వ్యవస్థకు డైరెక్టర్‌ జనరల్‌గా నియమితులయ్యారామె. ప్రస్తుతం ఆమె ఇండియన్‌ నేషనల్‌ అకాడమీ ఆఫ్‌ ఇంజినీరింగ్‌, ఇనిస్టిట్యూట్స్‌ ఆఫ్‌ ఇంజినీర్స్‌ ఇండియా, టాటా అడ్మినిస్ట్రేటివ్‌ సర్వీస్‌ వంటి సంస్థల్లో ఫెలోగా వ్యవహరిస్తున్నారు. పురుషులతో పోటీ పడి ఎదగడం... చురుగ్గా స్పందించడం ఆమె బలాలు. అందుకే నేటి మహిళలకు ఆమె ఆదర్శం. ఎందరికో స్ఫూర్తి ప్రదాత అయిన టెస్సీ థామస్‌కు అగ్ని పుత్రిక అనే పేరు కూడా ఉంది.


మరిన్ని