close

తాజా వార్తలు

క్యూలో నిల్చొనే భోజనం చేసేవాడు

గోవా: మనోహర్‌ పారికర్‌.. నిజాయతీ గల రాజకీయ నాయకుడు, సౌమ్యుడు, అజాతశత్రువు గానే కాదు.. మంచి విద్యార్థిగా ఆయనకు పేరుంది. పారికర్‌ రాజకీయాల్లోకి రాకముందు ఐఐటీ (బొంబాయి)లో చదువుకున్నారు. ఆదివారం సాయంత్రం పారికర్‌ మరణించడంతో అతనితో పాటు చదువుకున్న విద్యార్థుంతా ఆయనతో ఉండే జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు.1973-1980 మధ్య కాలంలో ఐఐటీ చదువుకున్న పారికర్‌ తనదైన ముద్ర వేశారు. చదువుతో పాటు అన్ని విషయాల్లో ముందుండేవారు. అప్పట్లోనే పారికర్‌ నాయకుడిగా ఎదుగుతాడని అందరూ అనుకునేవారు. చదువు పూర్తయిన తరువాత, రాజకీయాల్లో బిజీగా ఉన్నా సరే యూనివర్సిటీ  పూర్వవిద్యార్థిసంఘం ఏర్పాటు చేసిన సమావేశాలన్నింటికీ తప్పనిసరిగా హాజరయ్యేవారు.  
పారికరే రోజు బజారుకు వెళ్లేవాడు..

‘అప్పుడు మా హాస్టల్‌ ఫీజు నెలకు రూ. 180గా ఉండేది. ఈ మొత్తాన్ని కట్టడానికి మేమందరం ఇబ్బంది పడేవాళ్లం. మెస్‌ కాంట్రాక్టర్‌ సలహాతో పారికర్‌ తనే స్వయంగా నగరంలోని బైకుల్లా బజార్‌కు వెళ్లి కూరగాయలు కొనేవాడు. దీంతో మా ఫీజు రూ.160కి తగ్గింది’ అని అతని రూమ్‌మేట్‌ బకుల్‌ దేశాయ్‌ అప్పటి జ్ఞాపకాలను గుర్తు తెచ్చుకున్నాడు. పూర్వ విద్యార్థుల సమావేశం జరిగిన ప్రతిసారి సభ్యులందరికీ ఒక భోజన కూపన్‌ ఇచ్చేవారు. పారికర్‌ అతని హోదాను పక్కన పెట్టి మా అందరితో పాటే క్యూలో నిల్చొనే భోజనం చేసేవాడు. స్నేహితులతో ఉన్నప్పడు సెక్యూరిటీ సిబ్బందిని దూరంగానే ఉండమని చెప్పేవాడు అని ఆయన అన్నారు.
అలాంటి రుచులు ఇంకెప్పడు తినలేదు..
‘1978లో ఓసారి మా హాస్టల్‌ మెస్‌ సిబ్బంది నిరవధిక సమ్మెకు దిగారు. వారితో సన్నిహితంగా ఉండే పారికర్‌ వారిని విధుల్లోకి రమ్మని అడగ్గా వారు తిరస్కరించారు. దీంతో విద్యార్థులందరికీ వండి పెట్టేందుకు మాలోనే 40 మంది విద్యార్థులను ఒప్పించాడు. మా జీవితంలో అలాంటి వంటలు ఇంకెప్పడూ తినలేదని’ పారికర్‌ స్నేహితుడు, రూమ్‌మేట్‌ ముకుంద్‌ దేశ్‌పండే తెలిపారు.

ముఖ్యమంత్రి అయిన తరువాత కూడా ఆటోలోనే విమానాశ్రయానికి వెళ్లిన సాధారణ మనిషి పారికర్‌ అని ఐఐటీ పూర్వ విద్యార్థి గణేశ్‌ నటరాజన్‌ పేర్కొన్నారు. ‘పారికర్‌ మృతి మమ్మల్నందర్నీ షాక్‌కు గురి చేసింది. అతను ఐఐటీ(బి) విశిష్ట విద్యార్థి. విశ్వవిద్యాలయానికి సంబంధించి ఎన్నో కీలక కార్యక్రమాల్లో ఆయన భాగస్వాములయ్యారు.’ అని ఐఐటీ(బి) సంఘం ప్రతినిధి తెలిపారు.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు