Term insurance: 50 ఏళ్ల వ‌య‌సులోనూ ట‌ర్మ్ పాలసీ త‌ప్ప‌నిస‌రా? - Is it advisable to opt for term insurance in your fifties
close

Updated : 18/08/2021 22:27 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Term insurance: 50 ఏళ్ల వ‌య‌సులోనూ ట‌ర్మ్ పాలసీ త‌ప్ప‌నిస‌రా?

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఒక వ్య‌క్తి 50 ఏళ్ల వ‌య‌సుకు చేరుకోవ‌డం ఓ ముఖ్య‌మైన క్ష‌ణం. ఈ వ‌య‌సుకు చేరే స‌రికి వ‌చ్చిన అవ‌కాశాలను  అందిపుచ్చుకుంటూ ఒక స్థాయికి చేరుకుంటారు. సంపాద‌న పెరుగుతుంది. పూర్తి ఆర్థిక స్వేచ్ఛ ల‌భిస్తుంది. జీవ‌న శైలి మెరుగుప‌డుతుంది. దీంతో పాటే వృత్తి, ఉద్యోగాల్లో బాధ్యతలు, కుటుంబ బాధ్యతలు కూడా పెరుగుతాయి. ఖ‌ర్చులు కూడా అదేస్థాయిలో పెరుగుతాయి. వీటికి తోడు పిల్ల‌ల ఉన్న‌త చ‌దువులు, వివాహం, ఇంటి కొనుగోలు వంటి దీర్ఘ‌కాల ల‌క్ష్యాల‌కు చేరువ‌వుతుంటారు. వీటి కోసం ఇప్ప‌టికే మదుపు చేసినా మ‌రికొంత ఎక్కువ మొత్తం వెచ్చించాల్సి రావ‌చ్చు. ఇటువంటి ప‌రిస్థితుల్లో ప్ర‌స్తుత జీవిత బీమా గ‌డువు ముగిసినా.. ఇంకా పాల‌సీ కొనుగోలు చేయ‌క‌పోయినా.. కొత్తగా పాల‌సీ కొనుగోలు చేయ‌డం లేదా పున‌రుద్ధ‌రించ‌డం లాభ‌దాయ‌క‌మేనా? ఇప్పుడు తెలుసుకుందాం..

ప్ర‌యోజ‌నాలు: టర్మ్ పాల‌సీ అనేది సంపాదించే వ్య‌క్తి లేదా కుటుంబానికి మూలాధార‌మైన వ్య‌క్తి అనుకోని సంఘ‌ట‌న వ‌ల్ల దూరమైతే.. ఆ కుటుంబానికి ఆర్థికంగా అండ‌గా ఉంటుంది. అంటే పాల‌సీ చేసిన వ్య‌క్తి మ‌ర‌ణిస్తే హామీ మొత్తం నామినీకి అందిస్తారు. ఒక‌వేళ పాల‌సీ కాల‌వ్య‌వ‌ధిలో పాల‌సీదారుడు జీవించి ఉంటే ఎటువంటి మొత్తం చెల్లించ‌రు. ఈ కార‌ణంగానే మిగతా పాల‌సీల‌తో పోలిస్తే ట‌ర్మ్ బీమా ప్రీమియం కూడా త‌క్కువ‌గానే ఉంటుంది. చిన్న వ‌య‌సులో తీసుకుంటే మ‌రింత త‌క్కువ ప్రీమియంతో పాల‌సీని కొనుగోలు చేయొచ్చు.

కుటుంబ జీవ‌న శైలి అవ‌స‌రాల‌ను దృష్టిలో ఉంచుకుని వ్య‌క్తి వార్షిక ఆదాయానికి క‌నీసం 15-20 రెట్లు అధికంగా హామీ మొత్తం ఉండేలా చూసుకోవాలి. అదేవిధంగా క‌నీసం 60 ఏళ్ల వ‌య‌సు వ‌చ్చే వర‌కు పాల‌సీని కొన‌సాగించాలని నిపుణులు చెబుతారు. ఆ వయసు వచ్చే సరికి దాదాపు కుటుంబ బాధ్యతలు (పిల్ల‌ల ఉన్న‌త చ‌దువులు, వివాహం వంటివి) తీరిపోతాయి.

కానీ 50 ఏళ్ల‌లో ట‌ర్మ్ బీమా పాల‌సీ గడువు ముగిసిన త‌ర్వాత ఏదైనా దుర‌దృష్ట‌క‌ర‌మైన సంఘ‌ట‌న జ‌రిగి పాల‌సీదారుడు మ‌ర‌ణిస్తే కుటుంబానికి హామీ మొత్తం అంద‌దు. దాంతో అత‌డు/ ఆమెపై ఆధార‌ప‌డి జీవిస్తున్న వారు అనేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తుంది. 50 ఏళ్లు వ‌య‌సులో జీవిత బీమా పున‌రుద్ధ‌రించ‌డం లేదా కొనుగోలు చేయ‌డం వ‌ల్ల ఇటువంటి ప‌రిస్థితుల్లో హామీ మొత్తం జీవిత భాగ‌స్వామికి చేరుతుంది కాబ‌ట్టి మీ త‌ర్వాత కూడా కుటుంబ బాధ్యతలు ఆమె స‌క్ర‌మంగా నిర్వ‌ర్తించేందుకు వీల‌వుతుంది. ఆస్తి ప‌న్ను, గృహ‌రుణం వంటి దీర్ఘ‌కాల రుణాలు కూడా చెల్లించ‌గ‌ల‌గుతారు. ట‌ర్మ్ పాల‌సీతో ప‌న్ను ప్ర‌యోజ‌నాలు కూడా ల‌భిస్తాయి.

ప్ర‌తికూల‌తలు: ఇక్క‌డ 50 ఏళ్ల వ‌య‌స్సే పెద్ద ప్ర‌తికూల‌త‌. ఈ వ‌య‌సులో పాల‌సీదారుని అవ‌స‌రాల‌కు త‌గిన ప్లాన్‌ను కొనుక్కోవ‌డం అతి పెద్ద స‌వాల్‌. ప్రీమియం కూడా ఎక్కువ‌గానే ఉంటుంది. ప‌ద‌వీ విర‌మ‌ణ‌కు ద‌గ్గ‌ర‌గా ఉన్న‌వారు, సరైన పొదుపు మొత్తం లేని వారు అధిక ప్రీమియాన్ని చెల్లించ‌డం క‌ష్ట‌మ‌వుతుంది. ఆరోగ్య స్థితి కూడా స‌మ‌స్య కావొచ్చు.

* 50 ఏళ్ల వ‌య‌సులో పాల‌సీ కొనుగోలు చేసిన వారికి హామీ మొత్తం కూడా త‌క్కువ‌గా ఆఫ‌ర్ చేస్తుంటాయి బీమా సంస్థ‌లు. సాధార‌ణంగా 30 ఏళ్ల వ‌య‌సులో ఉన్న వ్య‌క్తి ట‌ర్మ్ పాల‌సీ తీసుకుంటే అత‌డి వార్షిక ఆదాయానికి 15-20 రెట్లు అధికంగా హామీ మొత్తం పొందొవ‌చ్చు. కానీ 50 ఏళ్ల వ‌య‌సులో పాల‌సీ తీసుకుంటే వార్షిక ఆదాయానికి 5 నుంచి 10 రెట్లు మాత్ర‌మే హామీగా పొందే వీలుంటుంది.

ట‌ర్మ్ బీమా తీసుకునేందుకు ప్రేరేపించే ప‌రిస్థితులు..
రుణాలు: ఆస్తులు త‌న‌ఖాలో ఉన్న‌ప్పుడు, బ‌కాయిలు చెల్లించేందుకు స‌రైన పొదుపు లేన‌ప్పుడూ ట‌ర్మ్ బీమా తీసుకోవ‌డం మంచిది. పాల‌సీదారుడు ఉన్న‌ప్పుడు రుణాల‌కు సంబంధించిన ఈఎంఐల‌ను ఆదాయం నుంచి స‌కాలంలో చెల్లించ గ‌లుగుతారు. ఒక‌వేళ అనుకోకుండా పాల‌సీదారుడు మ‌ర‌ణిస్తే హామీ మొత్తంతో రుణాల‌ను తీర్చేందుకు అవ‌కాశం ఉంటుంది. దీంతో కుటుంబంపై ఆర్థిక భారం ప‌డ‌కుండా ఉంటుంది.

ఆధారిత స‌భ్యులు: ప్ర‌స్తుత రోజుల్లో చ‌దువులు పూర్తి చేసుకుని స‌రైన‌ ఉద్యోగంలో స్థిర‌ప‌డితే త‌ప్ప పెళ్లి చేసుకోవ‌డం లేదు. దీంతో 23 నుంచి 25 ఏళ్ల వ‌య‌సులో జ‌ర‌గాల్సిన పెళ్లిళ్లు కాస్త 30 ఏళ్ల‌కు వాయిదా వేస్తున్నారు. మ‌రో రెండు, మూడేళ్ల‌కు పిల్ల‌లు జ‌న్మిస్తున్నారు. దీంతో 50 సంవ‌త్స‌రాలు వ‌చ్చే స‌రికి పిల్ల‌లు విద్యాభ్యాసం స్థాయిలోనే ఉంటున్నారు. వీరికి ఆర్థిక స‌హకారం అందించ‌డం అవ‌స‌రం. కాబ‌ట్టి 50ల్లోనూ ట‌ర్మ్ పాల‌సీ ఉండాలి. 

భ‌విష్య‌త్తు అవ‌స‌రాలు: ట‌ర్మ్ పాల‌సీ అనేది వ‌య‌సుపై ఆధార‌ప‌డ‌దు. కుటుంబ అవ‌స‌రాలు బాధ్యతలపై మాత్ర‌మే ఆధార‌ప‌డి ఉంటుంది. ఒక వ్య‌క్తిపై ఆధార‌ప‌డి కుటుంబం జీవిస్తున్న‌ంత కాలం ఆ వ్య‌క్తికి ట‌ర్మ్ పాల‌సీ ఉండ‌డం మంచిది. దీనికి వ‌య‌సు నిమిత్తం లేదు.


Advertisement

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని