మోసపోవద్దు.. ధీమాగా ఉండండి
close

Updated : 17/09/2021 09:05 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మోసపోవద్దు.. ధీమాగా ఉండండి

గత దశాబ్ద కాలంగా భారతీయ బీమా రంగం ఎంతో బలోపేతం అయ్యింది. మారిన పరిస్థితుల నేపథ్యంలో కొత్తగా పాలసీలు తీసుకుంటున్న వారి సంఖ్య పెరిగింది. ఇదే సమయంలో పాలసీదారుల అవసరాలను అవకాశంగా తీసుకొని, మోసగాళ్లు మాయ మాటలు చెప్పి, పాలసీదారులను దోచుకుంటున్నారు. బీమా సంస్థలు, నియంత్రణ సంస్థ ఎన్ని చర్యలు తీసుకుంటున్నప్పటికీ.. ఇవి జరుగుతూనే ఉండటం ఆందోళన కలిగిస్తుంది. పాలసీదారులు ఈ విషయంలో అప్రమత్తంగా ఉన్నప్పుడే.. ఈ మోసాల బారిన పడకుండా ఉంటారు...

బీమా సంస్థ నుంచి ఫోను చేస్తున్నామనో.. లేదా ఇ-మెయిల్‌ వచ్చినప్పుడు.. సహజంగానే పాలసీదారులకు ఏం జరిగింది అన్న ఆసక్తి ఉంటుంది. వారు ఏదైనా వివరాలు అడిగినప్పుడు అప్రయత్నంగానే తెలియజేస్తూ ఉంటారు. ఇదే పాలసీదారులకు ఇబ్బంది కలిగిస్తుంది. బీమా సంస్థ ప్రతినిధి లేదా ఐఆర్‌డీఏఐ నుంచి మాట్లాడుతున్నామని.. మీ పాత పాలసీకి సంబంధించిన బోనస్‌ లేదా.. రిఫండు ఇప్పిస్తామని ఫోన్లు వస్తుంటాయి. ఇందుకోసం కొంత మొత్తం చెల్లించాలని చెబుతుంటారు.. వీరి మాటలు నమ్మారా ఇక అంతే సంగతులు.. జేబు నుంచి కష్టార్జితాన్ని కోల్పోయినట్లే.

ఫోన్లు వస్తే..: సాధారణంగా బీమా సంస్థ ఎప్పుడూ తన పాలసీదారులకు నేరుగా ఫోన్‌ చేయదు. ఇక నియంత్రణ సంస్థ ఐఆర్‌డీఏఐ ఎట్టిపరిస్థితుల్లోనూ పాలసీదార్లను ప్రత్యక్షంగా సంప్రదించదు. నిజానికి ఆ అవసరమూ ఉండదు. కాబట్టి, ఐఆర్‌డీఏ నుంచి ఫోను చేసి ఎవరైనా పాలసీ వివరాలు అడిగినా.. మీ పాత పాలసీల వివరాలు చెప్పి, వాటికి బోనస్‌ లాంటివి ఇప్పిస్తామని అన్నా.. దాన్ని నమ్మకండి. ఎలాంటి చెల్లింపులూ చేయకండి.

గుర్తింపు చూశాకే: మీరు ఒక బీమా కంపెనీ ఏజెంటుతో మాట్లాడుతున్నప్పుడు.. ముందుగా ఆ వ్యక్తి గుర్తింపు వివరాలను చూడండి. అధీకృత ఏజెంటుతోనే మాట్లాడండి. ఏజెంటు తన గుర్తింపు వివరాలు, లైసెన్సు వివరాలు తెలియజేయకపోతే అతను/ఆమెతో మాట్లాడకూడదు.

అర్థం చేసుకున్నాకే: మీరు ఏ పాలసీని తీసుకోవాలని అనుకుంటున్నారో.. దాని గురించి ముందుగా పూర్తి వివరాలు తెలుసుకోండి. లేకపోతే.. మీకు అవసరం లేని పాలసీని ఎంపిక చేసుకునే ఆస్కారం ఉంది. పాలసీని అధీకృత ఏజెంటు లేదా బీమా సంస్థ వెబ్‌సైటు నుంచి, లైసెన్సు పొందిన బీమా అగ్రిగేటర్‌ నుంచి మాత్రమే తీసుకోవాలి. ఒకటికి రెండుసార్లు నిర్ధారించుకున్న తర్వాతే ప్రీమియం చెల్లించాలి.

పూర్తి వివరాలు చెప్పండి: మీరు ఏజెంటు ద్వారా పాలసీని తీసుకునేటప్పుడు మీకు సంబంధించిన పూర్తి వివరాలు స్పష్టంగా తెలియజేయండి. ప్రతిపాదిత దరఖాస్తు పత్రాన్ని మీరే పూర్తి చేసేందుకు ప్రయత్నించండి. మీ తరఫున ఏజెంటు పూర్తి చేస్తుంటే.. అన్ని వివరాలూ సరిగా నింపుతున్నారా లేదా గమనించండి. ఎలాంటి దాపరికాలూ లేకుండా చూసుకోండి.

నగదు వద్దు: బీమా ప్రీమియం చెల్లింపులో నగదు వాడకుండా చూసుకోండి. చాలా సందర్భాల్లో నగదు ద్వారా చెల్లించిన ప్రీమియం బీమా సంస్థకు చేరకుండా దుర్వినియోగం అయిన సందర్భాలున్నాయి. దీనివల్ల పాలసీదారులకు బీమా రక్షణ దూరం అవుతుంది. వీలైనంత వరకూ డిజిటల్‌ చెల్లింపులకు ప్రాధాన్యం ఇవ్వండి. చెక్కు ద్వారా చెల్లిస్తున్నప్పుడు బీమా సంస్థ పేరును స్పష్టంగా రాయండి. ఏజెంట్ల పేరుమీద చెక్కు ఇవ్వకూడదు.

పాలసీ వివరాలు: మీ వ్యక్తిగత వివరాలను ఎవరికీ.. ఏ సందర్భంలోనూ చెప్పకూడదు. ముఖ్యంగా ఓటీపీ (వన్‌ టైం పాస్‌వర్డ్‌)లాంటి వాటితో మరింత అప్రమత్తంగా ఉండాలి. ఇది దాదాపు మీ సంతకంతోనే సమానం అని మర్చిపోవద్దు. మీ ప్రమేయం లేకుండా ఓటీపీ వచ్చిందంటే.. వెంటనే ఆ విషయాన్ని బీమా సంస్థ దృష్టికి తీసుకెళ్లాలి.

- అనిల్‌ పీఎం, హెడ్‌, లీగల్‌ అండ్‌ కాంప్లియెన్స్‌, బజాజ్‌ అలియాంజ్‌ లైఫ్‌


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని