ద్రవ్యోల్బణం కంటే వృద్ధే ముఖ్యం - Aging is more important than inflation
close

Published : 23/04/2021 01:24 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ద్రవ్యోల్బణం కంటే వృద్ధే ముఖ్యం

ఆర్థిక రికవరీపై కరోనా ప్రభావం ఉండొచ్చు
పరపతి విధాన కమిటీ సమావేశ వివరాల వెల్లడి

ముంబయి: కరోనా కేసులు తిరిగి విజృంభిస్తున్నందున దేశంలోని పలు ప్రాంతాల్లో విధిస్తున్న లాక్‌డౌన్‌లు, ఆంక్షల వల్ల వృద్ధి అంచనాలపై అనిశ్చితి పెరుగుతోందని ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ పేర్కొన్నారు. కరోనా కేసుల ఉద్ధృతిని అదుపులో పెట్టకపోతే అది రికవరీపై ప్రభావం చూపుతుందని ఏప్రిల్‌ 5-7 మధ్య జరిగిన సమావేశంలో పరపతి విధాన కమిటీ(ఎమ్‌పీసీ) అంచనా వేసింది. అందుకే ద్రవ్యోల్బణం కంటే వృద్ధికే ప్రాముఖ్యతనివ్వదలచినట్లు స్పష్టం చేసింది. ఈ ఆర్థిక సంవత్సరంలో జరిగిన తొలి ద్వైమాసిక విధాన సమీక్షలో రెపో రేటును యథాతథంగా 4 శాతం వద్దే ఉంచిన సంగతి తెలిసిందే. అంతర్లీనంగా జరుగుతున్న ఆర్థిక రికవరీని కాపాడుకోవాల్సిన అవసరం కనిపిస్తోందని శక్తికాంత దాస్‌ పేర్కొన్నారు. ఇటువంటి సమయంలో రికవరీకి సానుకూలంగా, మద్దతు పలుకుతూ సర్దుబాటు ధోరణిలో పరపతి విధానం అవసరమని ఆయన వ్యాఖ్యానించారు. ఫిబ్రవరి 2019 నుంచి ఇప్పటిదాకా 250 బేసిస్‌ పాయింట్ల మేర కీలక రేట్లలో కోత వేసిన సంగతి తెలిసిందే. రికవరీ బలోపేతం అయ్యేంత వరకు ఆర్థిక వ్యవస్థకు పరపతి విధానం మద్దతుగా కొనసాగాల్సిన అవసరం ఉందని డిప్యూటీ గవర్నర్‌ మైఖేల్‌ దేబబ్రత పాత్ర పేర్కొన్నారు. ఇటీవల ద్రవ్యోల్బణం పెరిగిందని తెలిసినా.. ఆర్థిక వ్యవస్థ పుంజుకోవడంపైనే దృష్టి ఉందని ఆయన అన్నారు.

ఇళ్లకు గిరాకీ కొనసాగుతుంది
హెచ్‌డీఎఫ్‌సీ ఛైర్మన్‌ దీపక్‌ పరేఖ్‌

ముంబయి: ‘ఇటీవలి కాలంలో గృహాలకు పెరిగిన గిరాకీ సహజసిద్ధంగా వచ్చిందే. అది కొనసాగుతుంది. తక్కువ వడ్డీ రేట్లు, స్థిరమైన ధరలు, గృహ రుణాలపై ఇస్తున్న ప్రయోజనాలు.. కలిసి కొద్ది నెలలుగా ఇంటి రుణాల్లో వృద్ధికి తోడ్పడుతున్నాయి. తొలిసారిగా కొనుగోలు చేస్తున్న వారితో పాటు.. పెద్ద ఇళ్లు, వేరే ప్రాంతంలో ఇంకో ఇల్లు తీసుకోవాలనుకునే వారి సంఖ్య పెరిగింది. ఇందువల్లే ఇళ్లు/ఫ్లాట్లు/విల్లాలకు గిరాకీ పెరుగుతోంది. ‘ఇంటి నుంచి పని’ రావడంతో కంపెనీలకు దగ్గరగా ఉండాల్సిన అవసరం ఇపుడు లేదు. దీంతో అన్ని చోట్లా గిరాకీ పెరిగింది. ప్రపంచంలో అత్యంత తక్కువ స్థాయిలో డిజిటలీకరణ అయిన రంగం ఏదైనా ఉందంటే అది నిర్మాణ రంగమే. 1.5 శాతం కంటే తక్కువ ఆదాయాన్నే సాంకేతికతపై ఈ రంగం వెచ్చిస్తోంది. స్థిరాస్తిపై ‘రియల్‌టైమ్‌ డేటా’ లభించడం చాలా కష్టం. సాంకేతికతను అందిపుచ్చుకుంటే పారదర్శకత, బాధ్యత ఈ రంగంలోనూ పెరుగుతుంది. వ్యయ నియంత్రణా పెరుగుతుంది’ అని ప్రాప్‌టెక్‌ సమావేశంలో హెచ్‌డీఎఫ్‌సీ ఛైర్మన్‌ దీపక్‌ పరేఖ్‌ చెప్పారు.

లిబర్టీ స్టీల్‌పై కోర్టుకు టాటా స్టీల్‌

లండన్‌: లిబర్టీ స్టీల్‌ యజమాని సంజీవ్‌ గుప్తా ఆధ్వర్యంలోని జీఎఫ్‌జీ అలయన్స్‌పై బ్రిటన్‌ కోర్టులో టాటా స్టీల్‌ దావా వేసింది. 2017లో ఒక కొనుగోలుకు సంబంధించి చెల్లింపులు రాలేదని ఆరోపణలు చేసింది. టాటా స్టీల్‌కు చెందిన స్పెషాలిటీ స్టీల్స్‌ వ్యాపారాన్ని కొనుగోలు చేయడానికి లిబర్టీ స్టీల్‌ అప్పట్లో ముందుకు వచ్చింది. దాదాపు 100 మి.పౌండ్ల ఒప్పందం మే 2017న పూర్తయినట్లు టాటా స్టీల్‌ ప్రకటించింది కూడా. ఆ లావాదేవీకి సంబంధించి కొన్ని చెల్లింపులు పూర్తి కాలేదంటూ లిబర్టీ స్పెషాలిటీ స్టీల్స్‌, లిబర్టీ హౌస్‌ గ్రూప్‌ పీటీఈ, స్పెషాలిటీ స్టీల్‌ యూకే (ఇవన్నీ జీఎఫ్‌జీ అలయన్స్‌లో భాగమే)లను ఇప్పుడు కోర్టుకు లాగినట్లు ‘ద డెయిలీ టెలిగ్రాఫ్‌’ తన కథనంలో పేర్కొంది. ఈ సమయంలో ఎటువంటి వ్యాఖ్యలూ చేయబోమని టాటా స్టీల్‌ ప్రతినిధి తెలిపారు.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని