విద్యుత్‌ వాహనాలన్నింటికీ ఒకటే ఛార్జింగ్‌ కనెక్టర్‌ - All electric vehicles have the same charging connector
close

Published : 11/08/2021 01:52 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

విద్యుత్‌ వాహనాలన్నింటికీ ఒకటే ఛార్జింగ్‌ కనెక్టర్‌

ఆవిష్కరించిన ఏథర్‌ ఎనర్జీ

ముంబయి: అన్ని కంపెనీల విద్యుత్‌ వాహనాలకూ (ఈవీ) ఉపయోగపడేలా దేశ వ్యాప్తంగా వేగవంత ఛార్జింగ్‌ స్టేషన్లు ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఏథర్‌ ఎనర్జీస్‌ తెలిపింది. దీనివల్ల విద్యుత్‌ వాహన వినియోగదారులకు ప్రయాణ సంబంధిత ఒత్తిడి దూరం అవుతుందని భావిస్తోంది. దేశంలో ఈవీల వినియోగాన్ని పెంచేందుకూ ఇది తోడ్పడుతుందని పేర్కొంది. తొలి దశలో దాదాపు 200లకు పైగా ఫాస్ట్‌ ఛార్జర్లను అందుబాటులోకి తేనున్నట్లు వెల్లడించింది. ప్రామాణిక విడిభాగాల తయారీలోనూ ఇది తోడ్పడుతుందని తెలిపింది. ఏసీ, డీసీ విద్యుత్‌తో ఛార్జింగ్‌ చేసుకునేందుకు ఒక కనెక్టర్‌ను ఏథర్‌ రూపొందించినట్లు సంస్థ సహ వ్యవస్థాపకుడు తరుణ్‌ మెహతా చెప్పారు. దీనివల్ల విద్యుత్‌ వాహనాల తయారీలో వ్యయం కూడా ఆదా అవుతుందన్నారు. ఏథర్‌ ఎనర్జీ ఇప్పటికే ఫాస్ట్‌ ఛార్జింగ్‌ నెట్‌వర్క్‌పై పెట్టుబడులు పెడుతోంది. సాధారణ ఛార్జింగ్‌ వ్యవస్థలను ద్విచక్ర వాహనాలు, కార్లకు ఉచితంగా అందిస్తోంది. ప్రభుత్వం ఫేమ్‌-2 నిబంధనలతో విద్యుత్‌ వాహనాలు పెద్ద ఎత్తున విపణిలోకి రాబోతున్నాయని తరుణ్‌ తెలిపారు. ఈ దశలో పరిశ్రమ అంతా పరస్పర సహకారంతో నడవాలని పేర్కొన్నారు.


మహీంద్రా పికప్‌ 29,878 వాహనాలు వెనక్కి

దిల్లీ: లోపాలున్న ఫ్లూయిడ్‌ పైప్‌ను సరిచేసేందుకు 29,878 పికప్‌ వాహనాలను వెనక్కి పిలిపించనున్నట్లు మహీంద్రా అండ్‌ మహీంద్రా (ఎం అండ్‌ ఎం) ప్రకటించింది. 2020 జనవరి నుంచి 2021 ఫిబ్రవరి మధ్య తయారైన కొన్ని పికప్‌ వాహనాల్లో అమర్చిన ఫ్లూయిడ్‌ పైప్‌లలో లోపాలున్నట్లు గుర్తించినందున,  కొత్తవి అమర్చనున్నట్లు ఎక్స్ఛేంజీలకు ఇచ్చిన సమాచారంలో సంస్థ పేర్కొంది. దేశవ్యాప్తంగా ఉన్న విక్రయశాలల వద్ద వాహనాలను ఉచితంగా పరీక్షించి, లోపాలుంటే, కొత్త పరికరం అమర్చుతామని కంపెనీ తెలిపింది. దీని కోసం వినియోగదారులను కంపెనీ నేరుగా సంప్రదిస్తుందని కంపెనీ వెల్లడించింది.  


60 ఎస్‌ఎంఈల నమోదు లక్ష్యం:బీఎస్‌ఈ

కోల్‌కతా: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2021-22)లో ఎస్‌ఎంఈ (చిన్న, మధ్యస్థాయి సంస్థల) ప్లాట్‌ఫామ్‌పై 60 కంపెనీలను నమోదు చేయాలని బాంబే స్టాక్‌ ఎక్స్ఛేంజీ (బీఎస్‌ఈ) భావిస్తోంది. మార్కెట్‌లో బుల్‌ పరుగు నడుస్తుండటం, నిబంధనల సడలింపు ఇందుకు దోహదపడతాయని బీఎస్‌ఈ హెడ్‌ (ఎస్‌ఎంఈ ప్లాట్‌ఫామ్‌) అజయ్‌ ఠాకూర్‌ పేర్కొన్నారు. కంపెనీ నమోదుకావాలంటే లాభాల్లో ఉండాల్సిన సమయాన్ని ఒక ఏడాదికి తగ్గించడంతో ప్లాట్‌ఫామ్‌పైకి వచ్చే కంపెనీలు 50 శాతం పెరగొచ్చని అంచనా వేశారు. స్టాక్‌ మార్కెట్‌లోకి ఎస్‌ఎంఈలు రావడం సులభం కానప్పటికీ.. మర్చంట్‌ బ్యాంకర్‌ సంస్థ గ్రీటెక్స్‌ కార్పొరేట్‌ సర్వీసెస్‌ ఇందులో కీలక పాత్ర పోషిస్తున్నట్లు వెల్లడించారు. ఈ ఏడాది 60 కంపెనీలు వస్తాయని అంచనా వేస్తున్నామని, ఇప్పటికే 50 కంపెనీలు పత్రాలు దాఖలు చేశాయని తెలిపారు.Advertisement

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని