ఈపీఎఫ్‌ ఖాతాల్లో వడ్డీ జమ - EPFO begins crediting interest for 2019-20 to reflect in EPF accounts from Jan 1
close

Updated : 31/12/2020 20:17 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఈపీఎఫ్‌ ఖాతాల్లో వడ్డీ జమ

దిల్లీ: పీఎఫ్‌ మొత్తాలపై వడ్డీని జమ చేసే ప్రక్రియను ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ (ఈపీఎఫ్‌వో) ప్రారంభించింది. 8.5 శాతం వడ్డీ చొప్పున మొత్తాలను వేసే ప్రక్రియను గురువారం మొదలుపెట్టింది. 2019-2020 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మొత్తం 6 కోట్ల చందాదారుల ఖాతాల్లో వడ్డీ మొత్తాలు జమ కానున్నాయి. ఇప్పటికే నగదు జమ చేసే ప్రక్రియ ప్రారంభమైనట్లు సీనియర్‌ అధికారి ఒకరు వెల్లడించారు. జనవరి 1 నాటికి అందరి ఖాతాల్లో జమ అయ్యే అవకాశం ఉంది. గత ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వడ్డీని రెండు విడతల్లో జమ చేయాలని తొలుత నిర్ణయించినప్పటికీ.. తర్వాత ఏకమొత్తంలో జమ చేయాలని కార్మిక శాఖ నిర్ణయించిన సంగతి తెలిసిందే. 

ఇలా చెక్‌ చేసుకోండి..
ఉమాంగ్‌ యాప్‌: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఉమాంగ్‌ యాప్‌ ద్వారా మీ పీఎఫ్‌ బ్యాలెన్స్‌ తెలుసుకునే వీలుంది. అందుకోసం ఉమాంగ్‌ యాప్‌లోని ఈపీఎఫ్‌వోను ఎంచుకోవాలి. అందులో ‘ఎంప్లాయీ సెంట్రిక్‌ సర్వీసెస్‌’ విభాగంలోకి వెళ్లి ‘వ్యూ పాస్‌బుక్‌’ను క్లిక్‌ చేయాలి. అప్పుడు మీ యూఏఎన్‌ నంబర్‌తో పాటు మీ మొబైల్‌ నంబర్‌కు వచ్చే ఓటీపీని ఎంటర్‌ చేయాల్సి ఉంటుంది. అప్పుడు కనిపించే మెంబర్‌ ఐడీని క్లిక్‌ చేయడం ద్వారా పీఎఫ్‌ బ్యాలెన్స్‌ను పొందొచ్చు. అయితే, మీ పీఎఫ్‌ ఖాతాతో మొబైల్‌ నంబర్‌ ముందే జత చేసి ఉండాలి. 

మిస్డ్ కాల్ స‌ర్వీస్‌: ఈపీఎఫ్‌వోతో రిజిస్టర్‌ చేసుకున్న మొబైల్ నుంచి 011-22901406 నంబర్‌కు మిస్డ్‌కాల్‌ ఇవ్వడం ద్వారా పీఎఫ్‌ బ్యాలెన్స్‌ తెలుసుకోవచ్చు. మీరు మిస్డ్‌కాల్‌ ఇచ్చిన తర్వాత ఓ రింగ్‌ అయి వెంటనే కాల్‌ కట్‌ అవుతుంది. కాసేపటికే బ్యాలెన్స్‌ వివరాలు ఎస్సెమ్మెస్‌ రూపంలో ప్రత్యక్షమవుతాయి. 

SMS ద్వారా: యూఏఎన్‌ యాక్టివేట్‌ చేసుకున్న చందాదారులు ఈపీఎఫ్‌ ఖాతాకు జత చేసిన మొబైల్‌ నుంచి ‘EPFOHO UAN’ అని టైప్ చేసి 77382 99899 నంబ‌ర్‌కు ఎస్సెమ్మెస్‌ పంపించాలి. ప్రస్తుతం ఈ సదుపాయం పది ప్రాంతీయ భాషల్లో అందుబాటులో ఉంది. ఒకవేళ తెలుగులో కావాలంటే EPFOHO UAN TEL అని ఎస్సెమ్మెస్‌ పంపించాలి.

ఈపీఎఫ్‌వో పోర్టల్‌ : ఈపీఎఫ్‌వో సభ్యత్వ పోర్టల్‌లో రిజిస్టర్‌ చేసుకున్న స‌భ్యులు www.epfindia.gov.in వెబ్‌సైట్‌కు వెళ్లి కూడా బ్యాలెన్స్‌ వివరాలు తెలుసుకోవచ్చు. అందులో ‘అవర్‌ సర్వీసెస్‌’లోని ‘మెంబర్‌ పాస్‌బుక్‌’ విభాగంలోకి వెళ్లాల్సి ఉంటుంది. అప్పుడు యూఏఎన్‌ నంబర్‌, పాస్‌వర్డ్‌ ఎంటర్‌ చేయడం కోసం మరో పేజీకి రీడైరెక్ట్‌ అవుతుంది. వివరాలు ఎంటర్‌ చేయడం ద్వారా మీ ఖాతా వివరాలు తెలుసుకోవచ్చు.

ఇవీ చదవండి..
ఈపీఎఫ్ గురించి తప్పక తెలుసుకోవాల్సిన 10 విష‌యాలు!
క్రెడిట్‌ కార్డు సైజులో ఆధార్‌.. అప్లై ఇలా..


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని