IPO: ఐపీఓకి మ్యాప్‌మై ఇండియా దరఖాస్తు - MapMyIndia files IPO papers with Sebi
close

Published : 01/09/2021 15:06 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

IPO: ఐపీఓకి మ్యాప్‌మై ఇండియా దరఖాస్తు

ముంబయి‌: దేశంలో ఇనీషియల్‌ పబ్లిక్‌ ఆఫర్ల(ఐపీఓ) పరంపర కొనసాగుతోంది. తాజాగా దేశీయ తొలి మ్యాపింగ్‌ కంపెనీ ‘మ్యాప్‌మైఇండియా’ ఐపీఓ కోసం సెబీకి దరఖాస్తు చేసుకుంది. మొత్తం 75,47,959 ఈక్విటీ షేర్లు విక్రయించనున్నట్లు వెల్లడించింది. ఇవన్నీ ఆఫర్‌ ఫర్‌ సేల్‌(ఓఎఫ్‌ఎస్‌) కిందే విక్రయించనున్నారు. వాటాదారులు, ప్రమోటర్లుగా ఉన్న రష్మీవర్మ 30,70,033 ఈక్విటీ షేర్లు, క్వాల్‌కామ్‌ ఏషియా పసిఫిక్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ 20,26,055 ఈక్విటీ షేర్లు, బెన్రిన్‌ కంపెనీ లిమిటెడ్‌ 10,27,471 ఈక్విటీ షేర్లను విక్రయించనుంది. మ్యాప్‌మైఇండియాలో వైర్‌లెస్‌ టెక్నాలజీ కంపెనీ క్వాల్‌కామ్‌, జపాన్‌కు చెందిన డిజిటల్‌ మ్యాపింగ్‌ జెన్రిన్‌కు వాటాలున్నాయి.

దిల్లీ కేంద్రంగా పనిచేస్తున్న మ్యాప్‌మైఇండియా.. దేశీయంగా డిజిటల్‌ మ్యాపులు, జియోస్పేషియల్‌ సాఫ్ట్‌వేర్‌, ఐఓటీ సాంకేతికత సేవలను అందిస్తోంది. మ్యాప్‌మైఇండియా, మ్యాపిల్‌ పేరిట వివిధ రకాల ఉత్పత్తులు, ప్లాట్‌ఫారంలు, ఏపీఐలు అందజేస్తోంది. ఫోన్‌పే, ఫ్లిక్‌కార్ట్‌, యులు, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, ఎయిర్‌టెల్‌, హ్యుందాయ్‌, ఎంజీ మోటార్‌, ఏవీస్‌, సేఫెక్స్‌ప్రెస్‌, జీఎస్టీఎన్‌ వంటి ప్రముఖ సంస్థలకు ఈ కంపెనీ సేవలందిస్తోంది. కొన్ని యాపిల్‌ ప్రోడక్టులకు కూడా మ్యాప్‌మైఇండియా సేవలందిస్తున్నట్లు సెబీ దరఖాస్తు ద్వారా తెలుస్తోంది. స్టోర్లు, బ్రాంచీల లొకేషన్‌ కోసం పలు బ్యాంకులు, ఆర్థిక సంస్థలు కూడా ఈ కంపెనీ సేవల్ని వినియోగించుకుంటున్నాయి.

కంపెనీ విలువను రూ.5,000-6,000 కోట్లుగా లెక్కగట్టి రూ.1,200 కోట్లు సమీకరించాలని మ్యాప్‌మైఇండియా లక్ష్యంగా పెట్టుకున్నట్లు సమాచారం. వ్యాపార విస్తరణకు ఈ నిధులను వినియోగించనున్నారు. ప్రభుత్వం కొత్త జియోస్పేషియల్‌ విధానాన్ని తీసుకొచ్చే యోచనలో ఉన్న తరుణంలో మ్యాప్‌మైఇండియా ఐపీఓకి రానుండడం గమనార్హం.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని