స్టీలు కంపెనీల సిబ్బందికి కొవిడ్‌-19 టీకా - Steel companies preparing for vaccination of their employees
close

Published : 07/03/2021 12:40 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

స్టీలు కంపెనీల సిబ్బందికి కొవిడ్‌-19 టీకా

 యాజమాన్యాల సన్నాహాలు 

దిల్లీ: దేశంలోని స్టీలు కంపెనీలు తమ సిబ్బందికి కొవిడ్‌-19 టీకా వేయించడానికి ప్రయత్నాలు మొదలుపెట్టాయి. తమ కార్యాలయాలు, కర్మాగారాల్లో పనిచేస్తున్న వేలమంది సిబ్బందికి టీకా వేయించే ప్రణాళికలకు తుది రూపం ఇచ్చే పనిలో ఆయా కంపెనీలు ఉన్నాయి. టాటా స్టీల్, ఆర్సెలార్‌ మిత్తల్‌ నిప్పన్‌ స్టీల్‌ ఇండియా, రాష్టీయ ఇస్పాత్‌ నిగమ్‌ లిమిటెడ్‌(విశాఖ ఉక్కు).. ప్రభుత్వం చేపట్టిన టీకాల కార్యక్రమానికి మద్దతు ఇస్తామని, టీకా తమదాకా వచ్చే వరకు ఎదురు చూస్తామని తెలిపాయి. రాష్టీయ ఇస్పాత్‌ నిగమ్‌ లిమిటెడ్, సెయిల్‌ సంస్థలు తమ సిబ్బందిలో ఎవరికి ముందుగా టీకా ఇప్పించాలనే విషయమై ఇప్పటికే జాబితాలు సిద్ధం చేశాయి. ఈ సంస్థల ప్లాంట్లలో ఆసుపత్రులున్నందున, టీకా వేయించడం సులభం అవుతుంది. 
* టాటా స్టీలుకు జార్ఖండ్, ఒడిశా రాష్ట్రాల్లో ప్లాంట్లున్నాయి. కొవిడ్‌-19 ముప్పు మొదలైన నాటి నుంచి ఆయా రాష్ట్ర ప్రభుత్వాలతో సంప్రదింపులు సాగిస్తూ, కలిసి పనిచేస్తున్నట్లు తమ ఫ్యాక్టరీల్లోని వైద్య కేంద్రాల ద్వారా ప్రజలందరికీ సేవలు అందిస్తున్నట్లు టాటా స్టీలు ప్రతినిధి వివరించారు. జార్ఖండ్‌లోని జంషెడ్‌పూర్‌లో గల టాటా మెయిన్‌ హాస్పిటల్‌లో 1,000 పడకలతో అతిపెద్ద కొవిడ్‌-19 వైద్య సేవల కేంద్రాన్ని నిర్వహిస్తున్నారు. కొవిడ్‌-19 టీకా పరీక్షలకూ ఈ ఆసుపత్రిని ఎంపిక చేశారు. 
జేఎస్‌డబ్లూ స్టీల్, జిందాల్‌ స్టీల్‌ అండ్‌ పవర్‌ లిమిటెడ్‌ యాజమాన్యాలు దేశీయ టీకా తయారీ సంస్థలతో సంప్రదింపులు చేపట్టాయి. కొవిడ్‌-19 టీకాను తొలుత వ్యాధిపై పోరాటం చేస్తున్న యోధులకు ఇచ్చాక, తమకు సరఫరా చేయాలని తయారీదార్లను కోరుతున్నట్లు జిందాల్‌ స్టీల్‌ అండ్‌ పవర్‌ ముఖ్య మావన వనరుల అధికారి తెలిపారు. తమ సిబ్బందిలో 50 ఏళ్ల కంటే పైబడిన వారికి ముందుగా టీకా ఇవ్వాలనేది తమ ఆలోచనగా వివరించారు. 2020 సెప్టెంబరు నుంచి ప్రతి నెలా తమ సిబ్బందికి రెండుసార్లు తప్పనిసరిగా ఆర్‌టీ-పీసీఆర్‌ టెస్ట్‌ చేయిస్తున్నట్లు తెలిపారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో తమ 55,000 మంది సిబ్బందికి టీకా వేయించాలని భావిస్తున్నట్లు జేఎస్‌డబ్లూ గ్రూపు వెల్లడించింది. ప్రైవేటుగా టీకా తీసుకునే అవకాశం వచ్చాక 2 లక్షల డోసుల కొవిడ్‌-19 టీకాను కొనుగోలు చేయటానికి వీలుగా తయారీదార్లతో మాట్లాడుతున్నట్లు పేర్కొంది.

మా ఉద్యోగుల టీకా ఖర్చును భరిస్తాం: టీవీఎస్‌ 

దిల్లీ: తమ ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులకు టీకా వేసేందుకు అయ్యే ఖర్చును భరిస్తామని టీవీఎస్‌ మోటార్‌ తెలిపింది. ఇప్పటికే ఇన్ఫోసిస్‌ సహా పలు కంపెనీలు ఈ తరహా నిర్ణయాన్ని తీసుకున్న సంగతి తెలిసిందే. ‘ప్రస్తుతం ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం ప్రజలకు టీకా వేసే కార్యక్రమం జరుగుతోంది. ఇందులో భాగంగా దేశీయంగా మా కంపెనీలో ప్రత్యక్షంగా, పరోక్షంగా పనిచేస్తున్న ఉద్యోగులందరికీ టీకా వేసేందుకు అయ్యే ఖర్చును భరించనున్నామ’ని టీవీఎస్‌ మోటార్‌ ఒక ప్రకటనలో తెలిపింది. తొలి దశలో ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యుల్లో 45 నుంచి 60 ఏళ్ల మధ్య వయసున్న వారికి, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నవారికి ఈ సదుపాయాన్ని కల్పించనున్నట్లు పేర్కొంది.

ఇవీ చదవండి...
రూ.1,500 కోట్లతో బీపీసీఎల్‌ పైప్‌లైన్‌

వ్యూహాత్మక తయారీతోనే సత్వర ఆర్థికాభివృద్ధి


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని