అప్పుడు ‘మా’యం.. ఇప్పుడు ప్రత్యక్షం - alibaba co founder jack ma appeared after months of suspence
close

Updated : 20/01/2021 14:25 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

అప్పుడు ‘మా’యం.. ఇప్పుడు ప్రత్యక్షం

బీజింగ్‌: చైనా పాలకుల ఆగ్రహానికి గురై గత కొన్ని నెలలుగా బయటి ప్రపంచానికి కనిపించని ఇ-కామర్స్‌ దిగ్గజం, అలీబాబా సహ వ్యవస్థాపకుడు జాక్ మా.. ఎట్టకేలకు ప్రత్యక్షమయ్యారు. బుధవారం గ్రామీణ ఉపాధ్యాయులతో జరిగిన ఓ వీడియో కాన్ఫరెన్స్‌లో జాక్‌ మా పాల్గొన్నట్లు ఆ దేశ అధికారిక మీడియా గ్లోబల్‌ టైమ్స్‌ పేర్కొంది. ఇందుకు సంబంధించిన వీడియోను ఈ పత్రిక చీఫ్‌ రిపోర్టర్‌ కింగ్‌కింగ్ చెన్‌ తన ట్విటర్‌ ఖాతాలో పోస్ట్‌ చేస్తూ.. ‘‘జాక్‌ మా అదృశ్యమవలేదు. బుధవారం ఉదయం 100 మంది గ్రామీణ టీచర్లతో మా వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. ‘కొవిడ్‌ అంతమైన తర్వాత మనమంతా మళ్లీ కలుద్దాం’ అని ఆయన టీచర్లకు చెప్పారు’’ అని రాసుకొచ్చారు. ఇదే వీడియోను గ్లోబల్‌ టైమ్స్‌ కూడా తన ట్విటర్‌ ఖాతాలో పోస్ట్‌ చేసింది. 

దాదాపు మూడు నెలల క్రితం చైనా పాలకులకు సలహాలు ఇవ్వబోయి జాక్‌ మా.. వారి ఆగ్రహానికి గురైన సంగతి తెలిసిందే. గతేడాది అక్టోబరు 24న చైనాలో జరిగిన ఓ కార్యక్రమంలో జాక్‌ మా ప్రసంగిస్తూ చైనా ఆర్థిక వ్యవస్థలోని లోపాలను ఎండగట్టారు. చైనా బ్యాంకులు తాకట్టు దుకాణాల మనస్తత్వాన్ని వీడి విస్తృతంగా ఆలోచించాలని హితవు పలికారు. ఇంకేముంది.. జాక్‌ మా వ్యాఖ్యలపై మండిపడ్డ డ్రాగన్‌.. ఆయనపై ప్రతీకార చర్యలకు పూనుకుంది. ఆయన వ్యాపార సామ్రాజ్యంపై నియంత్రణ సంస్థలతో నిఘా పెట్టింది. అంతేగాక, ఆయనకు చెందిన యాంట్‌ ఫైనాన్షియల్‌ ఐపీవోను అడ్డుకొంది. ఈ పరిణామాల తర్వాత నుంచి జాక్‌ మా బయటి ప్రపంచానికి కన్పించకుండా పోయారు. 

గతేడాది నవంబరులో తాను నిర్వహిస్తున్న టాలెంట్‌ షో ‘ఆఫ్రికాస్‌ బిజినెస్‌ హీరోస్‌’ ఫైనల్‌ ఎపిసోడ్‌కు న్యాయనిర్ణేతగా వ్యవహరించాల్సి ఉండగా.. ఆయన రాలేదు. జాక్‌ మా స్థానంలో అలీబాబా ఎగ్జిక్యూటివ్‌ ఆ కార్యక్రమానికి న్యాయనిర్ణేతగా వ్యవహరించారు. అంతేగాక, ఆ షో వెబ్‌సైట్‌ నుంచి ఆయన ఫొటోలను తొలగించినట్లు టెలిగ్రాఫ్‌ పత్రిక వెల్లడించింది. ఆ తర్వాత నుంచి కూడా జాక్‌ మా ఎప్పుడూ బయటి ప్రపంచానికి కనబడలేదు. దీంతో ఆయన ఎక్కడున్నారన్నది మిస్టరీగా మారింది..

మళ్లీ ఇన్నాళ్ల తర్వాత జాక్‌ మా ప్రత్యక్షమైనప్పటికీ.. అది నేరుగా కాదు. రూరల్‌ టీచర్స్‌ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో ఆయన వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా పాల్గొన్నట్లు గ్లోబల్‌ టైమ్స్‌ చెబుతోంది. అలీబాబా ప్రధాన కార్యాలయం ఉన్న జెజియాంగ్‌ ప్రావిన్స్‌కు చెందిన తియన్ము న్యూస్‌ ఈ వార్తను మొట్టమొదట ప్రసారం చేసినట్లు ఆ పత్రిక తెలిపింది. అయితే గ్లోబల్ టైమ్స్‌ ట్వీట్ చేసిన వీడియో ఫోన్లో రికార్డు చేసినట్లుగా ఉండటం పలు అనుమానాలకు తావిస్తోంది. జాక్‌ మాను చైనానే నిర్బంధించి ఉంటుందని గతంలో ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. 

ఇదీ చదవండి..

జాక్‌ మాది అజ్ఞాతమా..? నిర్బంధమా?మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని