ఒలెక్ట్రాకు రూ.300 కోట్ల ఆర్డర్లు
close

Published : 31/12/2020 02:01 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఒలెక్ట్రాకు రూ.300 కోట్ల ఆర్డర్లు

పుణెకు 150 విద్యుత్తు బస్సుల సరఫరా

ఈనాడు, హైదరాబాద్‌: ఎంఈఐఎల్‌ గ్రూప్‌ సంస్థ, విద్యుత్‌ బస్సులు తయారు చేసే ఒలెక్ట్రా గ్రీన్‌టెక్‌కు రూ.300 కోట్ల విలువైన ఆర్డర్లు లభించాయి. పుణె మహానగర్‌ పరిహావన్‌ మహామండల్‌ లిమిటెడ్‌ (పీఎంపీఎల్‌)కు 150 విద్యుత్‌ బస్సులను తన అనుబంధ సంస్థ ఇవీ ట్రాన్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ ద్వారా సంస్థ సరఫరా చేయనుంది. ఇవీ ట్రాన్స్‌ ఈ బస్సులను సేకరించి, గ్రాస్‌ కాస్ట్‌ కాంట్రాక్ట్‌ (జీసీసీ)/ఒపెక్స్‌ విధానంలో 10-12 ఏళ్ల వ్యవధి పాటు నడపడంతో పాటు, నిర్వహణ బాధ్యతలనూ చూస్తుంది. విద్యుత్తు వాహనాల తయారీ, వినియోగాన్ని వేగవంతం చేసేందుకు ప్రతిపాదించిన భారత ప్రభుత్వ ఫేమ్‌-2 పథకంలో భాగంగా ఈ బస్సులను సరఫరా చేయనుంది. ఒలెక్ట్రా గ్రీన్‌టెక్‌ 150 బస్సులను సరఫరా చేసేందుకు ఏడాది కాలం పడుతుంది. ఈ కొత్త ఆర్డరుతో కలిపి ఒలెక్ట్రా గ్రీన్‌టెక్‌  మొత్తం 900లకు పైగా విద్యుత్‌ బస్సులను సరఫరా చేయాల్సి ఉంది. ఇటీవలే 353 బస్సుల కోసం ప్రకటించిన బిడ్‌లో భాగంగా అతి తక్కువగా కోట్‌ చేసి, ఇవీ ట్రాన్స్‌ ఈ 150 బస్సుల ఆర్డర్‌ను దక్కించుకుంది.
ఒలెక్ట్రా గ్రీన్‌టెక్‌ సీఈఓ, సీఎఫ్‌ఓ శరత్‌ చంద్ర మాట్లాడుతూ.. ఇప్పటికే ఇవీ ట్రాన్స్‌ పుణేలో 150 బస్సులు నడుపుతోందని, తాజా ఆర్డరుతో మొత్తం బస్సుల సంఖ్య 300కు చేరుతుందన్నారు. ఒలెక్ట్రా గ్రీన్‌టెక్‌, ఇవీ ట్రాన్స్‌ బృందానికి ఇది గర్వకారణమని వెల్లడించారు.


Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని