అమెరికా చమురే ఎందుకు..
close

Published : 18/03/2021 01:18 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

అమెరికా చమురే ఎందుకు..

ఇరాక్‌ తర్వాత మనకు అధిక సరఫరా అక్కడి నుంచే  
నాలుగో స్థానానికి సౌదీ పరిమితం

మనదేశ ముడిచమురు అవసరాలు తీర్చే దేశాల జాబితాలో అమెరికా ప్రాధాన్యం పెరిగిపోయింది. ఇటీవలి వరకు ఇరాక్‌, సౌదీ అరేబియా నుంచి అధికంగా చమురు దిగుమతి అయ్యేది. ఇప్పుడు ఇరాక్‌ స్థానం అలానే ఉన్నా, అమెరికా రెండోస్థానానికి చేరింది. ఉత్పత్తికోతలకు కట్టుబడి ఉన్నామని పేర్కొన్న సౌదీ అరేబియా నాలుగో స్థానానికి పతనమైంది. మనకు చమురు అధికంగా ఎగుమతి చేసే దేశాల జాబితా మారడం వల్ల ధరల్లో ఏమైనా మార్పులొస్తాయా.. పెట్రో ధరలు తగ్గుతాయా?  

న ముడిచమురు అవసరాల్లో 80 శాతం దిగుమతులే తీరుస్తున్నాయి. ఇందులో సింహభాగం ఇటీవలి వరకు మధ్యప్రాచ్య దేశాల నుంచే వచ్చేది. కొవిడ్‌ సమయంలో ముడిచమురు ధర గణనీయంగా క్షీణించడంతో, ధరల స్థిరీకరణ నిమిత్తం ఉత్పత్తి కోత విధిస్తూ పెట్రోలియం ఎగుమతి దేశాల సమాఖ్య(ఒపెక్‌), అనుబంధ దేశాలు నిర్ణయించి, అమలు చేస్తున్నాయి. అంతర్జాతీయంగా ఇంకా గిరాకీ తగినంత రానందున, ఏప్రిల్‌ వరకు ఉత్పత్తి కోత అమలు చేయాలని ఇటీవల నిర్ణయించాయి. ఇందువల్ల బ్యారెల్‌ ముడిచమురు ధర 70 డాలర్లకు చేరినా, మళ్లీ ఇప్పుడు 66 డాలర్ల వద్ద కదలాడుతోంది. మన దేశంలో ఇంధన వినియోగం కరోనాకు ముందు స్థాయులకు చేరింది. ఉత్పత్తి కోత నిర్ణయాన్ని ఉపసంహరించమని కోరినా, ఒపెక్‌ దేశాలు పెడచెవిన పెట్టడంతో, ప్రత్యామ్నాయ దేశాల వైపు భారత్‌ చూడాల్సి వచ్చింది. దాని ఫలితమే ఇరాక్‌ తర్వాత మనకు అత్యధికంగా చమురు విక్రయిస్తున్న దేశంగా అమెరికా మారింది. ఫిబ్రవరిలో భారత చమురు దిగుమతులు అమెరికా నుంచి 48 శాతం పెరిగి 5,45,300 బీపీడీకి చేరాయి. అదే సమయంలో సౌదీ అరేబియా నుంచి 42 శాతం తగ్గి, దశాబ్ద కనిష్ఠ స్థాయి అయిన 4,45,200 బీపీడీకి చేరాయి.
అగ్రరాజ్యానికి ఎందుకంత గిరాకీ?
సౌదీ అరేబియా రోజుకు 1 మిలియన్‌ బారెల్‌ చమురు(బీపీడీ) ఉత్పత్తి కోతను అదనంగా చేపట్టడం  వల్ల అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పెరుగుతున్నాయని భారత్‌ చెబుతూనే ఉంది. ఇపుడు అమెరికానే చమురు అత్యధికంగా ఉత్పత్తి చేసే దేశంగా ఉంది. అమెరికాలో చమురుకు గిరాకీ ఇంకా ఎక్కువ లేదు. మరో వైపు భారత్‌ సహా ఆసియా ప్రాంతంలో గిరాకీ వేగంగా పెరుగుతోంది. దీంతో అమెరికా చమురు ఆసియా వైపు ప్రవహిస్తోంది.
నాణ్యత మాటేమిటి?
మధ్యప్రాచ్య దేశాల నుంచి వచ్చే చమురు నుంచి సాధారణంగా ఎక్కువ డీజిల్‌ ఉత్పత్తి చేస్తారు.  ఉత్తర సముద్రం, పశ్చిమ ఆఫ్రికా, అమెరికా షేల్‌ గ్యాస్‌ క్షేత్రాల నుంచి వచ్చే చమురు నుంచి  వంటగ్యాస్‌ (ఎల్‌పీజీ), పెట్రోలు ఎక్కువగా ఉత్పత్తి చేస్తారు. కాబట్టి నాణ్యతపరంగా అమెరికా చమురు మెరుగైనదే. అయితే డీజిల్‌ అవసరాల కోసం మధ్యప్రాచ్య దేశాల చమురు దిగుమతి మనకు తప్పనిసరి.

చమురు ధర పెరిగితే..
రూపాయి బలహీనపడుతుంది. దీని వల్ల  ఔషధ, ఐటీ రంగాలకు  కలిసొస్తుంది
చమురు ఉత్పత్తిసంస్థలకూ (ఓఎన్‌జీసీ, ఆయిల్‌ ఇండియా) లాభమే

ధరలు తగ్గుతాయా?
ప్రస్తుతం బ్యారెల్‌ ముడిచమురు ధర 64-67 డాలర్ల మధ్య కదలాడుతోంది. ఇటీవలి గరిష్ఠమైన 70 డాలర్లకు పెరిగితే మనకు కష్టాలే. నవంబరు నుంచి ఇప్పటిదాకా చమురు మార్కెటింగ్‌ కంపెనీలు పెట్రోలు, డీజిల్‌ ధరలను వరుసగా లీటరుకు రూ.10; రూ.11 చొప్పున పెంచాయి. కొన్ని రాష్ట్రాల్లో పెట్రోలు లీటరు ధర రూ.100కు కూడా చేరింది. ఇదంతా బ్యారెల్‌ ధర 40 డాలర్ల నుంచి ప్రస్తుత స్థాయికి చేరడం వల్లే. ఇది తగ్గితే మినహా దేశీయంగా పెట్రో ధరలు మారవు.
పన్నులే గుదిబండ
కొవిడ్‌ వల్ల అధికంగా వ్యయాలు చేయాల్సి వస్తోందంటూ, ఆదాయం పెంచుకోవడం కోసం లీటరు పెట్రోలుపై రూ.13; డీజిల్‌పై రూ.16 చొప్పున కేంద్రం సుంకాలు వడ్డించింది. పలు రాష్ట్రాలు కూడా పన్నులు పెంచాయి. మొత్తం మీద కేంద్ర, రాష్ట్ర పన్నులు కలిపితే, ప్రస్తుత పెట్రోలు ప్రాథమిక ధర కంటే 162 శాతం; డీజిల్‌ ప్రాథమిక ధర కంటే 125 శాతంగా ఉన్నాయి. ప్రస్తుత ఆర్థిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వాలు పన్నులు తగ్గించవు కాబట్టి, పెట్రో ధరలు ఇప్పట్లో తగ్గే అవకాశం లేదని విశ్లేషకులు అంటున్నారు.


 


Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని